– తెలంగాణ విద్యావంతుల వేదిక
నల్గొండ, ప్రజాతంత్ర, అక్టోబర్ 8: ఓటు హక్కు పరిరక్షణ కోసం జరుగుతున్న ఉద్యమానికి ప్రజాస్వామ్యవాదులు అండగా నిలవాలనీ మానవ హక్కుల వేదిక రాష్ట్ర నాయకులు జి మోహన్, తెలంగాణ విద్యావంతుల వేదిక జిల్లా అధ్యక్షులు పందుల సైదులు పిలుపునిచ్చారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మానవ హక్కుల రక్షణ కోసం ఉద్యమించిన అలుపెరగని హక్కుల పతాక బాలగోపాల్ 17వ వర్ధంతి సందర్భంగా గురువారం ప్రజా సంఘాలు, హక్కుల సంఘాల ఆధ్వర్యంలో గురువారం నల్లగొండ పట్టణంలోని అమరవీరుల స్థూపం వద్ద బాలగోపాల్‌కు కొవ్వొత్తులతో నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జి.మోహన్, పందుల సైదులు మాట్లాడుతూ బాలగోపాల్ సార్ బతికినంతకాలం హక్కులపై కొనసాగిన ఆధిపత్యాన్ని, అన్యాయాన్ని ధిక్కరించిన ధీశాలి అన్నారు. ప్రభుత్వం కొనసాగిస్తున్న హింసనైనా, ప్రైవేటు హింసనైనా తీవ్రంగా వ్యతిరేకించిన వారన్నారు. అణగారిన వర్గాల హక్కుల కోసం నిరంతరం పోరాడారన్నారు. ఓటు హక్కు, ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఈ దేశ యువత, ప్రతిపక్ష పార్టీలు, ప్రజాసంఘాలు, ప్రజాస్వామ్యవాదులు చేపడుతున్న నిరసనలపై కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు తీవ్రమైన ఆందోళన కలిగిస్తున్నదన్నారు. కార్యక్రమంలో డీటీఎఫ్ నాయకుడు, జిల్లా ప్రధాన కార్యదర్శి టి.వెంకటేశ్వర్లు, రాష్ట్ర నాయకులు పి.వెంకులు, పి.ఏడుకొండలు, పిడిఎస్‌యు నాయకుడు ఇందూరి సాగర్, తెలంగాణ విద్యావంతుల వేదిక నాయకులు ఆర్.విజయకుమార్, జి.కాశయ్య, బహుజన కమ్యూనిస్టు పార్టీ నాయకుడు కె.పర్వతాలు, తెలంగాణ ప్రదేశ్ ఎరుకల సంఘం జిల్లా అధ్యక్షుడు మానుపాటి బిక్షమయ్య, నాయకులు గూడూరు జానకిరామ్ రెడ్డి, సునీత, న్యాయవాదులు భీమార్జున్ రెడ్డి, శివప్రసాద్, మదన్ తదితరులు పాల్గొన్నారు.
—————————————————————————————————————————————————–
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





