పడిపోతున్న పని దినాలు..
అమలుకు నోచుకోని వేతన జీవో 41
2014 కటాఫ్ నిబంధనతో వేల మందికి అందని జీవనభృతి
ఉనికి కోల్పోతున్న బీడీ రంగం
ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి, సిరిసిల్ల, నవంబర్ 27
రాష్ట్రంలో నిరుపేద కుటుంబాలకు తరతరాలుగా ఉపాధి కల్పిస్తూ వస్తున్న బీడీ రంగం ప్రస్తుతం ఉనికిని కోల్పోయే పరిస్థితులో ఉన్నది. పని దినాలు తగ్గిపోయి, వేతన జీ.వో .లు అమలుకాకపోవడంతో కార్మికులు దినదిన గండంగా కాలం గడుపుతున్నారు. సుమారు శతాబ్ద కాలంగా కార్మికుల ఉపాధికి ఊపిరిపోస్తున్న బీడీ రంగం ఉనికిని కోల్పోతుండగా కార్మికుల్లో నిరాశ, నిస్పృహ ఆవహించింది.
తెలంగాణలోనే కాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదే శ్లోని అనేక ప్రాంతాల్లో బీడీ పరిశ్రమలు కార్మికులకు ఉపాధి కల్పించాయి. తెలంగాణ రాష్ట్రంలో 1901లో నిజామాబాద్లో బీడీ పరిశ్రమ ప్రారంభమైనట్లు చారిత్రక ఆధారాలు తెలుపుతున్నాయి. నిజాం పాలకుల కాలం నుంచి ఇప్పటివరకు కార్మికుల కష్టానికి తగిన వేతనాలు, వృత్తి భద్రత లేకుండా పోయాయని బీడీ కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిజామాబాద్ కేంద్రంగా ప్రారంభమైన బీడీ పరిశ్రమలు క్రమక్రమంగా ఉత్తర తెలంగాణ ప్రాంతమంతా విస్తరించాయి. ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ ప్రాంతాల్లో ప్రధానంగా కేంద్రీకృతమైన బీడీ రంగంపై వివిధ విభాగాల్లో సుమారు 7 లక్షల మందికి పైగా కార్మికులు ఉపాధి పొందుతున్నట్లు కార్మిక సంఘాల నాయకులు తెలుపుతున్నారు. లక్షల మందికి ఉపాధి కల్పిస్తూ వచ్చిన ఈ పరిశ్రమ ఇటీవల మార్కెట్ ప్రభావాల నేపథ్యంలో క్రమక్రమంగా క్షీణిస్తూ వస్తోంది.
అత్యధికంగా మహిళలే..
బీడీ పరిశ్రమల్లో అత్యధికంగా ఉపాధి పొందుతున్నది మహిళలే. గ్రామీణ ప్రాంతాల్లో అనేక మంది మహిళలకు బీడీలు చుట్టడం ప్రధాన ఉపాధిగా మారింది. శ్రమకు తగిన వేతనాల కోసం కార్మికులు ప్రభుత్వాలకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకునేవారే కరువయ్యారని ఓ బీడీ కార్మిక సంఘం నాయకుడు “ప్రజాతంత్ర”తో కార్మికుల ఆవేదనను వెల్లడించారు. పరిశ్రమలో సింహభాగంగా ఉన్న బీడీలు చుట్టే మహిళా కార్మికులతో పాటు వివిధ విభాగాల్లో పలువురు కార్మికులు ఉపాధి పొందుతున్నారు. గుజరాత్, మహారాష్ట్ర ప్రాంతాలకు చెందిన ఫ్యాక్టరీల యజమానులు బీడీ పరిశ్రమలను నిర్వహిస్తున్న విషయం గమనించవచ్చు.
ప్రత్యామ్నాయ మార్గాలు లేవు
గడిచిన పదేళ్ల కాలాన్ని గమనిస్తే బీడీ కార్మికులకు గడ్డుకాలమనే చెప్పాలి. క్రమక్రమంగా పని దినాలు తగ్గిపోవడం, చాలీచాలని ఆదాయంతో బీడీ కార్మికుల కుటుంబాలు దినదిన గండంగా గడపాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. ఇప్పటికే అనేక బీడీ పరిశ్రమలు పూర్తిగా మూతపడగా, మరికొన్ని అదే దారిలో ఉన్నాయి. ఠాగూర్ సాదేకర్, రాకు సాదేకర్ బీడీ కంపెనీలు ఇప్పటికే ఎనిమిది నెలలుగా వేతనాలు ఇవ్వడం లేదని కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉపాధి కోల్పోతున్న కార్మికులకు ప్రత్యామ్నాయ ఉపాధి చూపించే విషయంపై ప్రభుత్వాలు పెద్దగా ఆలోచిస్తున్నట్లు కనిపించడం లేదు. ప్రత్యామ్నాయ ఉపాధి లేకపోవడం, సరిపడా పని దినాలు లభించకపోవడంతో కార్మికులు ఆందోళనకు గురవుతున్నారు.
జీవనభృతి ఉపశమనం-అందరికీ అందని వైనం
ప్రస్తుతం బీడీ పరిశ్రమల్లో పనిచేస్తున్న పేద మహిళలకు పని దినాలు తగ్గిపోయిన నేపథ్యంలో జీవనభృతి పెన్షన్లు కొంత ఊరటనిస్తున్నాయి. బీడీ పరిశ్రమల్లో ఉపాధి పొందుతూ పీఎఫ్ ఖాతాదారులుగా ఉన్నవారికే పరిమితమైన ఈ పెన్షన్లు ప్రస్తుతం బీడీ కార్మిక కుటుంబాలకు ఆసరాగా మారుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 4 లక్షల 20 వేల మందికి పైగా జీవనభృతి పెన్షన్లు పొందుతున్నట్లు అధికారిక గణంకాలు చెబుతున్నాయి.
జీవనభృతి పెన్షన్ల విషయంలో కటాఫ్ తేదీని 2014 వరకు నిర్ధారించడం వల్ల పూర్తిస్థాయిలో బీడీ కార్మికులకు పెన్షన్లు అందకుండా పోతున్నాయని పలువురు కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంకా వేల సంఖ్యలో బీడీ కార్మికులు చేతినిండా ఉపాధి లేక, జీవనభృతి చేతికి అందక తీవ్ర ఇబ్బందుల్లో కూరుకుపోతున్నారని వారు పేర్కొన్నారు.
జీవో 41 తొక్కిపెట్టడంపై కార్మికుల ఆగ్రహం
బీడీ కార్మికులకు చట్టపరంగా భద్రత కల్పించే జీవో 41 అమలుకు నోచుకోవడంలేదు. సుదీర్ఘ కాలంగా కార్మికుల పోరాటాల ఫలితం జీవో 41 తెరపైకి వచ్చింది.రాష్ట్ర ప్రభుత్వాలు కనీసం జీవో గురించి పట్టించుకోవడంలేదని కార్మిక సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జీవో అమల్లోకి వస్తే ప్రస్తుతం బీడీ కార్మికులకు కనీస వేతనం అమల్లోకి వొచ్చి, 1,000 బీడీలకు రూ.450 వరకు వేతనం లభిస్తుందని కార్మిక సంఘాల నాయకులు పేర్కొంటున్నారు. సంవత్సరానికి రెండు విడతలుగా వేరియబుల్ డియర్నెస్ అలవెన్స్ (వీడీఏ) కలపడం వల్ల కార్మికులకు ఎంతో ప్రయోజనం చేకూరే అవకాశం ఉందని చెబుతున్నారు. జీవో అమల్లోకి రావాలంటే ముందుగా రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించి కేంద్రానికి తెలియజేయాల్సి ఉంటుందని కార్మిక సంఘాల నాయకులు పేర్కొంటున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో బీడీ కార్మికుల సుదీర్ఘ పోరాటాల ఫలితంగా 2011లో అప్పటి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో జీవో జారీకి అవకాశాలు వచ్చాయని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వచ్చిన ప్రభుత్వాలు జీవోను పట్టించుకోలేదని ఆరోపణలు ఉన్నాయి. జీవో 41ను తొక్కిపెట్టడం వల్ల కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారు.
అంధకారంలో బీడీ పరిశ్రమ
ప్రస్తుతం బీడీ పరిశ్రమ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం బీడీ కట్టలపై క్యాన్సర్ ముద్రను తప్పనిసరి చేయడంతో దాని ప్రభావం పరిశ్రమపై తీవ్రంగా పడింది. అసలే మార్కెట్ సమస్యలతో సతమతమవుతున్న బీడీ పరిశ్రమపై క్యాన్సర్ ముద్ర ప్రభావం పడటంతో బీడీ పరిశ్రమల నిర్వాహకులు పరిశ్రమ పట్ల ఆసక్తి చూపడం లేదు. ఫలితంగా బీడీ కార్మికుల ఉపాధి ప్రశ్నార్థకంగా మారుతోంది. ఒకవైపు చేసిన పనికి సరైన వేతనాలు లేకుండా, మరోవైపు రోజురోజుకు ఉపాధి ప్రశ్నార్థకంగా మారుతున్న క్రమంలో బీడీ కార్మికులు ఆవేదన చెందుతున్నారు. ఏమైనా అడిగితే ఉన్న ఉపాధి కూడా ఎక్కడ పోతుందో అన్న భయం కార్మికులను వెంటాడుతోంది. ప్రభుత్వాలు ఇప్పటికైనా బీడీ కార్మికులకు ప్రత్యామ్నాయ ఉపాధి చూపడంతో పాటు, వారిని ఆదుకునేందుకు చర్యలు తీసుకోవాలని బీడీ కార్మికులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

జీవో 41 అమలు చేయాలి
ముద్రకోలా ఆంజనేయులు, బహుళ బీడీ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి.
బీడీ కార్మికుల జీవితాలు తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయి.బీడీ కంపెనీలు ఉంటాయో, మూతపడతాయో అన్న భయం కార్మికులను వెంటాడుతోంది. బీడీ కట్టలపై క్యాన్సర్ ముద్ర వల్ల బీడీల మార్కెట్ పూర్తిగా తగ్గిపోయిందని యాజమాన్యాలు చెబుతున్నాయి. తక్షణమే కేంద్ర ప్రభుత్వం బీడీ కట్టలపై క్యాన్సర్ ముద్రను తొలగించాలి. బీడీ కార్మికుల ప్రయోజనాలను కాపాడేందుకు జీవో 41ను తక్షణం అమలు చేయాలి. బీడీ కార్మికులకు ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి.





