రాష్ట్రంలో రాజకీయాలు రోజురోజుకు దిగజారుతున్నాయి. మాట, భాష, హావభావాల్లో విపరీతమైన మార్పు వొచ్చింది. సభ్యసమాజం తలదించుకునేలా మాటల దాడి కొనసాగుతున్నది. ప్రజల సమస్యలను పక్కన పెట్టి వ్యక్తిగత ధూషణలకు దిగుతున్న నాయకుల తీరును ప్రజలు ఛీత్కరించుకుంటున్నారు. రాజకీయాల్లో తలపండిన వారై ఉండికూడా సభ్యసమాజంలో ఉన్నామన్న విషయాన్ని మరిచిపోయి మాట్లాడుతున్నతీరు పట్ల తమ అసహనాన్ని వ్యక్తంచేస్తున్నారు. నేతల మధ్య మాటల యుద్ధం సహజం. ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకోవడమన్నది పార్టీలవరకే పరిమితంగా ఉండాల్సి ఉండగా, ఇటీవల కాలంలో వ్యక్తిగత దూషణలే ఎక్కువైపోయాయి. క్రమేణ వీధి పంచాయతీల్లా మారుతున్నాయి.
సాధారణ వ్యక్తుల మాదిరిగా అధికారపార్టీకి చెందిన ఎమ్మెల్యే తన అనుచరగణంతో విపక్ష ఎంఎల్‌ఏ ఇంటిపైన దాడికి వెళ్ళడం లాంటి సంఘటనలు గతంలో ఎన్నడూ లేని విధంగా తెలంగాణలో ఇటీవల చోటుచేసుకుంటున్నాయి. తెలంగాణ ఉద్యమకాలంలో ఉద్యమనాయకులు బాధ, వ్యధతో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినప్పుడు వ్యతిరేకత వొచ్చినప్పటికీ, ఆ తర్వాత కూడా అదే వరుస కొనసాగుతూరావడాన్ని చూస్తున్నాం. పదేళ్ళ బిఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని గద్దెదించే క్రమంలో రాష్ట్రకాంగ్రెస్ నాయకత్వం కూడా అలాంటి పరుషపదాలనే వాడింది. తమకు ఆ మాటలు నేర్పింది గత బిఆర్‌ఎస్ ప్రభుత్వమేనంటూ కాంగ్రెస్ పెద్దలు తమనుతాము సమర్థించుకుంటున్నారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వొచ్చిన ఈ పదినెలలకాలంలో ఈ పదజాలానికి మరింత పదనుతేలింది. రాష్ట్రంలోని మూడు ప్రధాన పార్టీలైన అధికార కాంగ్రెస్‌తోపాటు ప్రధాన ప్రతిపక్షాలు బిఆర్‌ఎస్, బిజెపిలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకునే క్రమంలో వాడుతున్న పదజాలాన్ని వినలేకపోతున్నామంటున్నారు ప్రజలు. ఇలాంటి పదాలను వాడటంలో పార్టీల నాయకులు ఒక విధంగా పోటీ పడుతున్నట్లు కనిపిస్తున్నది. సిగ్గులేదా, నాలుకలు తెగకోస్తాం, నోళ్ళు ఫినాయిల్‌తో కడుగాలి లాంటి రెచ్చగొట్టే అనేక పదాలను వాడటానికి అలవాటు పడ్డాయి ఈ పార్టీలు. నిత్యం ఏదో ఒక సమస్యను తీసుకుని దాని పరిష్కార మార్గం కన్నా వాగ్వాదానికి పార్టీలు ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నాయి. మీరు అధికారంలో ఉన్నప్పుడు అదిచేయలేదా అంటే గతంలో మీరు అధికారంలో చేసిన నిర్వాకమే ఇది అంటూ సమస్య ఒకటైతే చర్చ మరోటిగా నాయకులు కీచులాడుకోవడం సహజమైపోయింది. ఇప్పుడు ఆరోపణల స్టేజీకూడా దాటిపోయి లీగల్ నోటీసులు, కేసులకు దారి తీస్తున్నది.
తాజాగా మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ఒక విధంగా రాష్ట్ర రాజకీయ వాతావరణాన్ని ఒక్క కుదుపు కుదిపిందనే చెప్పాలె. మాజీమంత్రి, బిఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావును లక్ష్యంగా చేసుకుని ఆమె సంధించిన బాణం మరో కుటుంబాన్ని గాయపర్చింది. తెలంగాణలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సాధించుకున్న కొండా సురేఖ, రాష్ట్ర రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న వ్యక్తి. అయినా కెటిఆర్‌ను విమర్శించే క్రమంలో నోరుజారి చేసిన వ్యాఖ్య సినీ ఇండస్ట్రీని కదిలించింది. ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగార్జున, అమల, సమంత తో పాటుగా సినీ ప్రముఖులు పలువురు కొండా సురేఖ మాటలను తీవ్రంగా ఆక్షేపించారు. రాజకీయ ప్రత్యర్థుల మధ్య కొనసాగుతున్న వివాదంలో సంబందం లేని వారిని లాగడాన్ని వారితోపాటు పలువురు విజ్ఞులు కూడా అమె మాటలను తప్పుపడుతున్నతీరు రాష్ట్రంలో ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. చివరకు తన కుటుంబ ప్రతిష్టను దెబ్బతీసే వ్యాఖ్యలు చేసినందుకు కొండా సురేఖపైన అక్కినేని నాగార్జున పరువు నష్టం దావా వేయడంతో పాటు క్రిమినల్ కేసును కూడా పెడుతున్నట్లు ప్రకటించారు.
దీనికంతకు మంత్రి కొండా సురేఖ దుబ్బాక పర్యటన ప్రధాన కారణమైంది. కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో స్థానిక ఎంపి రఘనందన్‌రావు ఆమెకు నూలమాల వేయడం ఈ విపరీత పరిణామానికి కారణంగా మారింది. స్థానికంగా నెలకొన్న అనేక సమస్యలను ఈ మాల రూపంలో మీకు సమర్పిస్తున్నానంటూ రఘునందన్‌రావు సురేఖ మెడలో వేసిన మాలపైన సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టు పెట్టడం ఈ మొత్తం ఎపిసోడ్‌కు కారణమైంది. అది బిఆర్‌ఎస్‌పార్టీకి చెందిన సోషల్ మీడియావారే పెట్టారన్నది ఇందులో ప్రధాన ఆరోపణ. పోస్టుపెట్టిన అకౌంట్‌కు హరీష్‌రావు, కెసిఆర్ ఫోటోలు ఉండడమే అందుకు కారణంగా మంత్రి సురేఖతోపాటు కాంగ్రెస్‌పార్టీ, చివరకు రఘునందన్‌రావు కూడా ఆరోపిస్తున్నారు. దీనిపై బిఆర్‌ఎస్ కూడా స్పందించి అలాంటివారిపైన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నప్పటికీ, తమ పార్టీకి పనిచేస్తున్నవారిపైన బిఆర్‌ఎస్ నాయకులే ఎందుకు చర్యతీసుకోవడంలేదని కాంగ్రెస్ ప్రశ్నిస్తున్నది. అయితే తనపై కొండా సురేఖ ఆధారాలులేని అభాండం వేయడాన్ని తీవ్రంగా ఖండించిన కెటిఆర్ సురేఖకు లీగల్ నోటీసు పంపించారు. తనకు క్షమాపణ చెప్పాలని, లేనిపక్షంలో పరువు నష్టం దావా వేస్తానని ఆయన అందులో పేర్కొన్నట్లు తెలుస్తున్నది. కొండా సురేఖ కూడా అంతే పట్టుదలగా తనకే కెటి ఆర్ క్షమాపణ చెప్పాల్సిందేనని, కాని పక్షంలో న్యాయపరంగా పోరాడుతానని ప్రకటించారు.
కాగా ఈ ఎపిసోడ్‌లో అనుకోని రీతిలో నాగార్జున కుటుంబ ప్రస్తావన తీసుకురావడం తనను కూడా బాధించిందని, వారి విషయంలో తన ఆరోపణను వెనక్కి తీసుకుంటున్నట్లు సురేఖ ప్రకటించారు. కాగా బిఆర్‌ఎస్, కాంగ్రెస్ నాయకులు ఒకరిపై ఒకరు లీగల్ నోటీసులను పంపే కార్యక్రమాలు ఇలానే కొనసాగుతున్నాయి. హరీష్‌రావు కాంగ్రెస్ ఎంపి అనిల్‌కుమార్ యాదవ్‌కు ఇటీవల లీగల్ నోటీస్ పంపించారు. హిమాయత్‌సాగర్ ఎఫ్‌టిఎల్ పరిధిలోని ఆనంద్ కన్వెన్షన్‌లో హరీష్‌రావుకు వాటా ఉన్నట్లు యాదవ్ ఆరోపించడాన్ని సవాల్ చేస్తూ హరీష్‌రావు ఈ నోటీస్ పంపించారు. అలాగే అమృత్ పథకం విషయంలో తనపై తప్పుడు ఆరోపణలు చేయడాన్ని సవాల్‌చేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి వరుసకు బావమరిది అయిన స్వజన్‌రెడ్డి కెటిఆర్‌కు లీగల్‌నోటీస్ పంపించారు. తాజాగా వరంగల్‌లోని నయింనగర్ బ్రిడ్జి విషయంలో బిఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే , ప్రస్తుత ఎమ్మెల్యే ల ఎం , మధ్య కూడా తీవ్రస్థాయిలో ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన పదినెలల కాలంలో రాష్ట్రంలో బిఆర్‌ఎస్, కాంగ్రెస్ మద్య ఏదో ఒక విషయంపైన తరుచు యుద్ద వాతావరణం చోటు చేసుకుంటూనే ఉంది. ప్రధానంగా మహిళలపై రెండు పార్టీలకు చెందనవారు అనుచిత వ్యాఖ్యలు చేయడం కూడా పలు సందర్భాల్లో ఘర్షణకు దారితీసింది. గతంలో మంత్రి సీతక్కను అవమానించారన్న ఆరోపణ బిఆర్‌ఎస్‌పై ఉండగా, శాసనసభలో సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డే మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి కంటి తడిపెట్టించిన విషయం తెలిసిందే. మొత్తం మీద రాజకీయాలు దారి తప్పి వ్యక్తిగత విమర్శలకు దారి తీయడాన్ని ప్రజాస్వామ్యవాదులు జీర్ణించుకోలేకపోతున్నారు.




