కోట్ల నిధులు నీళ్ల పాలేనా?

– ఊరించి ఉసూరుమనిపించిన చెక్ డ్యాములు
– రూ.140 కోట్ల నిధుల ఖర్చు.. అయినా అందని సాగునీరు
– గండిపడిన చెక్‌డ్యామ్ వద్ద ప్రాణాలు కోల్పోయిన చిన్నారులు
– వర్షాలకే కొట్టుకుపోయిన నిర్మాణాలు.. మరికొన్నిచోట్ల లీకేజీలు
– ప్రతిపక్షంలో ప్రశ్నలు.. అధికారంలోకి వచ్చాక మౌనం
– వేములవాడ, సిరిసిల్ల ప్రాంతాల చెక్‌డ్యాములపై ‘ప్రజాతంత్ర’ ప్రత్యేక కథనం

ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి, సిరిసిల్ల‌, అక్టోబ‌ర్ 21 : రైతులకు సాగునీటి భరోసా కల్పించాలన్న లక్ష్యంతో నిర్మించిన చెక్‌డ్యాములు చివరకు అన్నదాతలకు నిరాశనే మిగిల్చాయా? కోట్లాది రూపాయల ప్రజాధనం వెచ్చించినా ఆశించిన ప్రయోజనం అందలేదా?  రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మూలవాగు, మానేరు వాగులపై నిర్మించిన చెక్‌డ్యాముల దుస్థితి చూస్తుంటే ఇలాంటి ప్రశ్నలే వినిపిస్తున్నాయి. కొన్ని నిర్మాణాలు వర్షాల ధాటికి దెబ్బతినగా, మరికొన్ని లీకేజీలతో నిరుపయోగంగా మారాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అన్నదాతల బతుకుదెరువుకు ఆధారంగా ఉన్న వేములవాడ నియోజకవర్గంలోని మూలవాగు, సిరిసిల్ల నియోజకవర్గ పరిధిలోని మానేరు వాగులపై పాలకులు నిర్మించిన చెక్‌డ్యాముల్లో కొన్ని గ‌తంలో కురిసిన వర్షాలకు కొట్టుకుపోయాయి. ఫలితంగా సాగునీరు అందక‌ రైతులు కంటతడి పెట్టాల్సిన దుస్థితి ఎదుర‌వుతోంది. రూ.155 కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభమైన ఈ పనులకు రూ.140.26 కోట్ల నిధులు వెచ్చించినప్పటికీ, ఆ ఫలాలు అందలేదన్న ఆవేదన అన్నదాతల్లో వ్యక్తమవుతోంది. నిధులు ఖర్చయినా, ప్రయోజనం మాత్రం కాంట్రాక్టర్లకే దక్కిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. చెక్‌డ్యాముల్లో కొన్ని కొట్టుకుపోవడంతో క‌ష్టాలు రెట్టింప‌య్యాయి.  మరికొన్ని చెక్‌డ్యాములు నిరుపయోగంగా మారాయి. ప్రస్తుతం సిరిసిల్ల నియోజకవర్గంలో నెలకొన్న పరిస్థితులను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతోంది.

ఊరింపులతో మొదలై.. 

వేములవాడ నియోజకవర్గ పరిధిలోని మూలవాగు, సిరిసిల్ల నియోజకవర్గ పరిధిలోని మానేరు వాగుపై గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో సుమారు రూ.150 కోట్లతో చెక్‌డ్యాముల నిర్మాణానికి ప్రతిపాదనలు చేశారు. మిడ్‌మానేరు డ్యామ్‌లో కలిసే వరకు మానేరు వాగు నిత్యం నీటితో కళకళలాడుతుందన్న హామీలతో సిరిసిల్ల పరిధిలోని మానేరు వాగుపై 11 చెక్‌డ్యాములు, మూలవాగుపై 13 చెక్‌డ్యాములు నిర్మించేందుకు ప్రతిపాదించారు. పనులు దాదాపు పూర్తయ్యాయి. కొన్ని చెక్‌డ్యాములు అందుబాటులోకి వచ్చినట్లు అప్పట్లో సంబరాలు కూడా నిర్వహించారు. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్‌ చొరవతో మరో 12 చెక్‌డ్యాములను రూ.68.47 కోట్లతో నిర్మించేందుకు అప్పట్లో ప్రతిపాదనలు చేసినట్లు ఆనాటి ప్రభుత్వ నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఏడు చెక్‌డ్యాముల నిర్మాణం పూర్తయినట్లు లెక్కల్లో చూపించారు. కాంట్రాక్టర్లు బిల్లులు కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది. అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు చెక్‌డ్యాముల నిర్మాణ ప్రతిపాదనలు బీఆర్‌ఎస్ నాయకుల జేబులు నింపేందుకేనని ఆరోపించారు. అయితే సిరిసిల్ల నియోజకవర్గంలో ఒక్క చెక్‌డ్యామ్ మినహా మిగతా కొన్ని చెక్‌డ్యాములు వర్షాలకే దెబ్బతిన్నాయని, మరికొన్ని లీకేజీల కారణంగా నిరుప‌యోగంగా మారాయ‌ని రైతులు వాపోతున్నారు. అంతేకాదు సిరిసిల్ల పట్టణానికి వన్నె తెస్తుందని అప్పట్లో జోరుగా ప్రచారం చేసిన నెహ్రు నగర్ శివారులోని మానేరు వాగులో నిర్మించిన చెక్‌డ్యామ్‌కు గండి పడిన ప్రాంతంలో ఈతకు వెళ్లిన చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. సిరిసిల్ల ప్రజల్లో పుట్టెడు దుఃఖాన్ని మిగిల్చిన ఆ గాయం ఇప్పటికీ వారి గుండెలను పిండేస్తోంది. క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలిస్తే, చెక్‌డ్యాముల నిర్మాణం మూన్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోయిందని అన్నదాతలు వాపోతున్నారు.

అప్పుడలా.. ఇప్పుడిలా.. 

గతంలో చెక్‌డ్యాములు కొట్టుకుపోయినపుడు ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ కాంగ్రెస్ పెద్ద ఎత్తున‌ ఆందోళనలు చేప‌ట్టింది.  నాణ్యత లేకుండా పనులు చేస్తున్నారని ఆరోపిస్తూ అఖిలపక్షం ఆధ్వర్యంలోనూ నిరసనలు చేపట్టారు. కానీ దాదాపు అన్ని పార్టీలూ ఈ విషయంలో వ్యూహాత్మకంగానే మౌనం వహించాయని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో టీపీసీసీ అధ్యక్షుడి హోదాలో 2023లో హాత్ జోడో యాత్రలో భాగంగా సిరిసిల్ల నియోజకవర్గంలో పర్యటించినప్పుడు ఆయన దృష్టికి చెక్‌డ్యాముల సమస్యను కాంగ్రెస్ జిల్లా నాయకత్వం తీసుకెళ్లినట్లు స‌మాచారం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నాటి బీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని నిలదీసిన కాంగ్రెస్ నాయకులు, అధికారంలోకి వచ్చాక అసలు ఆ విషయాన్నే ప్రస్తావించకపోవడంపై మానేరు పరివాహక ప్రాంత రైతులు ఆందోళన చెందుతున్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన కొత్తలో చెక్‌డ్యాముల నిర్మాణంలో జరిగిన అవకతవకలపై విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీలు ఇచ్చింది. కానీ అవేవీ అమ‌లుకు నోచుకోలేదంటూ మానేరు పరివాహక ప్రాంత రైతులు అంటున్నారు. జిల్లా పరిరక్షణ సమితి నాయకుడు బుస్సా వేణు ‘ప్రజాతంత్ర’తో మాట్లాడుతూ చెక్‌డ్యాముల విషయంలో ఇప్పటికైనా ప్రభుత్వం పూర్తిస్థాయిలో విచారణ జరిపించి వాస్తవాలను ప్రజలకు వెల్లడించాల్సిన అవసరం ఉందని  అన్నారు. ఆయా పార్టీల నాయకులు ఈ అంశంపై స్పందించాలని కోరారు. ఏది ఏమైనా పార్టీలు ఇప్పటికైనా మౌనం వీడి చెక్‌డ్యాముల నిర్మాణంపై సమగ్ర విచారణ జరిపించి, వాటిని రైతులకు ఉపయోగపడేలా అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని మానేరు పరివాహక ప్రాంత రైతులు కోరుతున్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *