– రామప్ప చెరువులో 29 అడుగుల నిల్వ
– ఉపాధి హామీ పనులతో నీటి సంరక్షణ నిర్మాణాలు చేపట్టాలి
– గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క
ములుగు, ప్రజాతంత్ర, అక్టోబర్ 21 : ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు లేక రాష్ట్రంలో ఎండ తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో నీటి ఎద్దడి తలెత్తకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపడుతోందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రి సీతక్క తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నేతృత్వంలో ఆరు నెలలుగా ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ నీటి సంరక్షణకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ములుగు జిల్లా వెంకటాపురం మండలం పరిధిలోని రామప్ప చెరువు, అక్కడి డీఫ్లోరైడేషన్ ప్రాజెక్టును మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రామప్ప చెరువులో ప్రస్తుతం 29 అడుగుల మేర నీరు అందుబాటులో ఉందని తెలిపారు. గోదావరి నుంచి నీటిని పంపింగ్ చేసి చెరువులు, పరిసర ప్రాంతాలకు నీటి సరఫరా మెరుగుపరిచే అవకాశాలను పరిశీలిస్తున్నామని వెల్లడించారు. నీటి నిల్వలు పెరిగేందుకు ఏటా ఇచ్చే విరామాన్ని దృష్టిలో ఉంచుకుని మరో రెండు రోజుల్లో నీటిని విడుదల చేసేలా సంబంధిత అధికారులను కోరినట్లు చెప్పారు. రామప్ప నుంచి నీటిని డీఫ్లోరైడేషన్ ప్రాజెక్టు ద్వారా శుద్ధి చేసి ములుగు, వెంకటాపురం, గోవిందరావుపేట, మల్లంపల్లి పరిసర ప్రాంతాలతోపాటు భూపాలపల్లి జిల్లాలోని కొన్ని ప్రాంతాలకు తాగునీరు అందించేలా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. నీటి సరఫరా వ్యవస్థలు, చెరువులపై ఆధారపడిన గ్రామాలు, భూగర్భ జలాల పరిస్థితిని అధికారులు నిరంతరం పరిశీలిస్తున్నారని తెలిపారు.
ప్రకృతి వైపరీత్యాలపై రాజకీయాలు తగవు
అతివృష్టి, అనావృష్టి వంటి ప్రకృతి పరిణామాలను ఏ శక్తీ పూర్తిగా నియంత్రించలేదని, ఇలాంటి పరిస్థితులను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించడం సరికాదని మంత్రి సీతక్క అన్నారు. పసిఫిక్ మహాసముద్ర ప్రాంతంలో ఉష్ణోగ్రతల్లో వస్తున్న మార్పులు వాతావరణ పరిస్థితులపై ప్రభావం చూపుతున్నాయన్నారు. ప్రకృతి సవాళ్లను ఎదుర్కొనేందుకు రాజకీయ విమర్శల కంటే సమష్టి కార్యాచరణ అవసరమని స్పష్టం చేశారు.
ఉపాధి హామీతో నీటి సంరక్షణకు పెద్ద పీట
వర్షపు నీటిని ఒడిసిపట్టేందుకు ఇంకుడు గుంతలు, ఊటకుంటలు, నీటి కుంటలు, చెక్‌డ్యామ్‌లు, చెరువుల పునరుద్ధరణతోపాటు బోర్ల రీచార్జ్ పనులకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని మంత్రి తెలిపారు. గ్రామాల్లో ఉపాధి హామీ పథకం కింద విస్తృతంగా నీటి సంరక్షణ పనులు చేపట్టాలని, కూలీల సంఖ్యను పెంచి అందుబాటులో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సర్పంచులు, గ్రామస్తులకు పిలుపునిచ్చారు. ఇప్పటినుంచే నీటి నిల్వలను పెంచుకుంటే భవిష్యత్తులో నీటి ఎద్దడి తీవ్రతను తగ్గించవచ్చన్నారు.
తాగునీటికి అత్యంత ప్రాధాన్యం
సాగునీటి అవసరాలతోపాటు తాగునీటి సరఫరాకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని సీతక్క స్పష్టం చేశారు. ప్రతి నీటి చుక్కను జాగ్రత్తగా వినియోగించుకోవాలని, వృథా చేయకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. రామప్ప-లక్నవరం కాలువ వంటి ప్రతిపాదిత ప్రాజెక్టు లతోపాటు ఇతర ప్రత్యామ్నాయ నీటి వనరులను అభివృద్ధి చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఎల్‌నినో ప్రభావంతో ప్రజలు ఇబ్బందులకు గురికాకుండా తాగునీటి సరఫరాను నిరంతరం పర్యవేక్షిస్తామని, నీటి సంరక్షణలో ప్రజలందరూ సహకరించాలని మంత్రి సీతక్క విజ్ఞప్తి చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





