సీతక్కపై క్రిమినల్ కేసు కొట్టివేత

– కింది కోర్టు ఉత్తర్వులు రద్దు చేసిన హైకోర్టు

హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 21: ములుగు ఎమ్మెల్యే, పంచాయతీరాజ్ శాఖ మంత్రి దనసరి అనసూయ(సీతక్క)కు హైకోర్టులో ఊరట లభించింది. కొవిడ్-19 సమయంలో ఆరోగ్యశ్రీ పథకం పరిధిలో కరోనా చికిత్సను చేర్చాలని డిమాండ్ చేస్తూ నిరాహార దీక్ష చేపట్టినందుకు ఆమెపై నమోదైన క్రిమినల్ కేసును హైకోర్టు కొట్టివేసింది. ఈ కేసును న్యాయమూర్తి జస్టిస్ సుజన మంగళవారం విచారించి ఎక్సైజ్ కేసుల ప్రత్యేక జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు తీసుకున్న చర్యలను, కేసులో జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేస్తూ తీర్పు వెలువరించారు. దీంతో సీసీ నెం.308/2024లో సీతక్కపై కొనసాగుతున్న క్రిమినల్ కేసు విచారణకు ముగింపు పలికినట్లయింది. ఆరోగ్యశ్రీ పథకంలో కొవిడ్ చికిత్సను చేర్చాలని కోరుతూ సీతక్కతోపాటు పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు 2021 ఏప్రిల్ 26న హైదరాబాద్‌లో ఇందిరా పార్కు ధర్నా చౌక్ వద్ద నిరాహార దీక్ష నిర్వహించారు. ఇందుకు పోలీసుల అనుమతి తీసుకోలేదని, కొవిడ్ నిబంధనలను ఉల్లంఘిస్తూ సామాజిక దూరం పాటించకుండా, మాస్కులు ధరించకుండా నిరసన చేపట్టారని ఆరోపిస్తూ గాంధీనగర్ పోలీసులు ఐపీసీ సెక్షన్లు 188, 269, 270తోపాటు విపత్తు నిర్వహణ చట్టంలోని సెక్షన్ 51(బి) కింద కేసు నమోదు చేశారు. అనంతరం దర్యాప్తు పూర్తి చేసి చార్జిషీట్ దాఖలు చేయగా ఎక్సైజ్ కేసుల ప్రత్యేక జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు దానిని స్వీకరించి విచారణ కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో సీతక్క హైకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదు చేసిన కేసు చట్టబద్ధం కాదని, కేసు స్వీకరణ నుంచే న్యాయపరమైన లోపాలున్నాయని వాదించారు. ఐపీసీ సెక్షన్ 188 కింద కేసు విచారణకు సంబంధిత ప్రజాసేవకుడు లేదా అతని పై అధికారి నుంచి తప్పనిసరిగా లిఖితపూర్వక ఫిర్యాదు ఉండాల్సి ఉందని, కానీ ఈ కేసులో కేవలం పోలీసుల ఎఫఐఆర్, చార్జిషీట్ ఆధారంగానే కోర్టు విచారణ ప్రారంభించడం చట్టవిరుద్ధమని తెలిపారు. అలాగే విపత్తు నిర్వహణ చట్టంలోని సెక్షన్ 51(బి) కింద కూడా అవసరమైన చట్టబద్ధమైన విధానాన్ని అనుసరించలేదని, సెక్షన్ 60 ప్రకారం అధికారం కలిగిన వ్యక్తి ఫిర్యాదు చేయకపోవడంతో విచారణ కొనసాగించడానికి అవకాశం లేదని వాదించారు. అంతేకాక ఐపీసీ సెక్షన్లు 269, 270 వర్తించాలంటే నిందితుడి చర్యల వల్ల అంటువ్యాధి వ్యాపించే అవకాశం లేదా వ్యాప్తికి సంబంధించిన ప్రాథమిక ఆధారాలు ఉండాలని, కానీ తనపై అలాంటి ఆరోపణలు గానీ, ఆధారాలు గానీ లేవని సీతక్క తరఫు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. కేవలం శాంతియుత నిరసనలో పాల్గొన్నందుకు ఈ నేరాలు వర్తించవని, సుప్రీంకోర్టు, వివిధ హైకోర్టుల తీర్పులు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశాయని వాదించారు. వాదనలు పరిశీలించిన జస్టిస్ సుజన సీతక్కపై కొనసాగుతున్న క్రిమినల్ ప్రొసీడింగ్స్‌ను కొనసాగించడానికి చట్టపరమైన ఆధారం లేదని నిర్ధారిస్తూ కింది కోర్టు ఉత్తర్వులను రద్దు చేసి కేసును కొట్టివేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *