దేవాదుల పంపులు 24 గంటలు పనిచేస్తాయి

– ఈ రాత్రి నుంచే 9 యూనిట్లు పూర్తి సామర్థ్యంతో ప్రారంభం
– రాజకీయాలు కాదు.. ప్రజలకు నీటి భద్రతే మా లక్ష్యం
– మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి

హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 21 : దేవాదుల ఎత్తిపోతల పథకం కింద ఈ రాత్రి నుంచే తొమ్మిది పంపింగ్ యూనిట్లు 24 గంటలపాటు పూర్తి సామర్థ్యంతో పనిచేస్తాయని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. సచివాలయంలో తనను కలిసిన మీడియాతో ఆయన చిట్-చాట్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇటీవల దేవాదుల ప్రాజెక్టుపై మంత్రుల బృందం నిర్వహించిన సమీక్షలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేస్తోందని చెప్పారు. గోదావరి నుంచి వీలైనంత ఎక్కువ నీటిని ఎత్తిపోసి దేవాదుల పరిధిలోని తొమ్మిది జిల్లాలకు చెందిన 22 రిజర్వాయర్లను నింపడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. వర్షాభావ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని అధికారులు పంపులను గరిష్ఠ సామర్థ్యంతో నడపాలని ఇప్పటికే ఆదేశాలు ఇచ్చామన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రజలకు తాగునీరు, రైతులకు సాగునీటి భద్రత కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, రాజకీయ విమర్శలకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇవ్వదని ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా బీఆరఎస్ నేత హరీశ్ రావుపై మంత్రి తీవ్ర విమర్శలు చేశారు. దేవాదుల ప్రాజెక్టుపై తప్పుడు ప్రచారం చేయడం మానేసి కాళేశ్వరం ప్రాజెక్టులో తీసుకున్న నిర్ణయాలపై ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణంలో మొదట రూపొందించిన షీట్ పైల్ ఫౌండేషన్ డిజైన్‌ను ఎందుకు మార్చి సెకెంట్ పైల్ ఫౌండేషన్ అమలు చేశారో హరీశ్ రావు వివరించాలని మంత్రి ప్రశ్నించారు. ఆ నిర్ణయం వల్లే ప్రస్తుతం కాళేశ్వరం ప్రాజెక్టు ఈ పరిస్థితికి చేరుకుందన్నారు. అలాగే కాళేశ్వరం కాంట్రాక్టర్లు బీఆరఎస్‌కు రూ.1,400 కోట్లు చెల్లించారని ఎమ్మెల్సీ కె.కవిత చేసిన ఆరోపణలపై హరీష్‌రావు ప్రజలకు సమాధానం చెప్పాలని మంత్రి డిమాండ్ చేశారు. రైతులను తప్పుదోవ పట్టించడం మానేసి ఆ ఆరోపణలపై స్పష్టత ఇవ్వాలన్నారు. దేవాదుల ఎత్తిపోతల పథకాన్ని ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యంతో ముందుకు తీసుకెళ్తోందని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. భూసేకరణ, అనుమతులు, నిర్మాణ పనులను వేగవంతం చేసి 2027 డిసెంబర్ నాటికి ప్రాజెక్టును పూర్తి చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని చెప్పారు. ప్రాజెక్టు పూర్తయిన తర్వాత సుమారు 5.6 లక్షల ఎకరాలకు సాగునీరు అందడంతోపాటు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో తాగునీటి భద్రత కూడా గణనీయంగా మెరుగుపడుతుందని ఆయన తెలిపారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *