- రాజంపేటకు చెందిన వ్యక్తి కోవిడ్‌తో మృతి
– అప్రమత్తం అయిన వైద్యారోగ్య శాఖ
తిరుపతి, జూలై 9: కోవిడ్ మహమ్మారి మరోమారు కలవర పెడుతోంది. ఏపీలోని కడప జిల్లా రాజంపేటకు చెందిన ఒక వ్యక్తి(52) కొవిడ్ కారణంగా చనిపోవడంతో వైద్యశాఖ అప్రమత్తమైంది. అన్ని జిల్లాల్లో ఆరా తీయగా కడప, తిరుపతి జిల్లాల్లో 5 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదైనట్టు గుర్తించింది. దీంతో మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ (డీఎంఈ) రాష్ట్రంలోని ప్రధాన ప్రభుత్వ ఆస్పత్రుల సూపరింటెండెంట్లకు లేఖలు రాశారు. కొవిడ్ పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని, ఆస్పత్రుల్లో అందుబాటులో ఉన్న ఐసోలేషన్ బెడ్లు, ఐసీయూ పడకలు, ఆక్సిజన్ సౌకర్యం, వెంటిలేటర్లు, మందులు, ర్యాపిడ్ కిట్లు, అంబులెన్స్ వంటి వైద్య సిబ్బంది వివరాలతో నివేదిక పంపాలని ఆదేశించారు. ఇటీవల నమోదైన కేసుల నేపథ్యంలో అవసరమైతే వెంటనే చికిత్స అందించేందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధంగా ఉంచాలని వైద్యాధికారులకు సూచించినట్టు సమాచారం. రాజంపేటకు చెందిన వ్యక్తి తీవ్రమైన ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతూ గత నెల 24న వేలూరు సీఎంసీలో చికిత్స నిమిత్తం చేరారు. న్యుమోనియా వ్యాధిని గుర్తించారు. అనుమానంతో కొవిడ్ పరీక్ష చేయగా 26వ తేది పాజిటివ్ వచ్చింది. చికిత్స పొందుతూ 28న మృతిచెందడంతో వైద్య శాఖ అప్రమత్త మైంది. కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదైన నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని డీఎంఈ ఆదేశాలిచ్చారు. రుయాలో కొవిడ్ ఐసోలేషన్ వార్డు ఏర్పాటు చేశాం.. కొవిడ్ టెస్ట్ కిట్లు, సిబ్బంది, అవసరమైన మందులతో సిద్ధంగా ఉన్నాం.. రుయాలో ఇప్పటివరకు ఎలాంటి కేసులు నమోదు కాలేదు.. ప్రస్తుతం నమోదైన కేసుల్లో తీవ్రమైన లక్షణాలు లేవని, అయినప్పటికీ అప్రమత్తంగా ఉండాలని భావిస్తున్నాం అని డీఎంఈ వివరించారు. గతంలోలాగా భయపడాల్సిన పనిలేదని భరోసా ఇచ్చారు. వాతావరణంలో మార్పుల కారణంగా రోగనిరోధక శక్తి తగ్గినవారు అశ్రద్ధ చేయకూడదని, జ్వరం, దగ్గు, గొంతునొప్పి వంటి లక్షణాలుంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని. వృద్ధులు, గర్భిణులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





