– రైతు ఆశీర్వాద సభకు కేబినెట్ మొత్తం వస్తుంది
– డిప్యూటీ సీఎం భట్టి
చింతకాని/ఖమ్మం, ప్రజాతంత్ర, జూలై 9 : మధిర నియోజకవర్గంలోని చింతకాని మండలం మత్కెపల్లి క్రాస్ రోడ్, జగన్నాథపురం వద్ద రైతు ఆశీర్వాద సభ సభకు భారీ ఏర్పాట్లు చేశారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రాతినిద్యం వహిస్తున్న నియోజకవర్గం కావడం తో సభను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. అంతే గాక కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత ఈ నియోజకవర్గంలో మొదటి సభ. సీఎం సభకు సంబంధించి 31.5 ఎకరాల స్థలాన్ని వినియోగిస్తున్నారు. ఇందులో 150 స్టాల్స్ కోసం 5 ఎక రాలు, రెండు హెలీప్యాడ్ లకు 1.50 ఎకరాలు, సభా ప్రాంగణానికి 19 ఎకరాలు కేటాయించారు. దీనికి తోడు ముఖ్యమంత్రి రాకపోకలు, సెక్యూరిటీని దృష్టిలో ఉంచుకొని 6 ఎకరాలు ఫ్రీ స్పేస్ కింద కేటాయించారు. సభకు మూడు లక్షల మంది హాజరవుతారని అంచనా వేస్తున్నారు. ప్రజలు, రైతుల కోసం కేటాయిం చిన 19 ఎకరాల సభా ప్రాంగణంలో వీక్షకుల గ్యాలరీలు 80 ఏర్పాటు చేసారు. వీటిలో వీవీఐపీ, వీఐపీ, మహిళా ఇతర గ్యాలరీలు ప్రత్యేకంగా ఉండనున్నాయి. వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో భారీ ఖర్చుతో జర్మన్ టెంట్ షెడ్లు వేశారు. సభ ఏర్పాట్లు, పనుల తీరుపై భట్టి విక్రమార్క జిల్లా అధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నారు. పార్టీ నేతలు కూడా ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. ఆర్ అండ్ బీ శాఖ అధికారులు హెలీప్యాడ్, సభా ప్రాంగణానికి సంబంధించి ప్రత్యేక దృష్టి సారించారు. ట్రాఫిక్, రక్షణకు సంబంధించి సీపీ సునీల్ దత్ నేతృత్వంతో ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేశారు. కలెక్టర్ తోపాటు జిల్లా యంత్రాంగం అంతా సీఎం సభపైనే దృష్టి సారించింది. పార్కింగ్ కోసం మరో 125 ఎకరాలు కేటాయించారు. రైతు భరోసా నిధులు విడుదల రోజు సభ ఏర్పాటు చేశాం.. వర్షం వల్ల శుక్రవారం నిర్వహిస్తున్నామని భట్టి విక్రమార్క తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు జిల్లా ఇన్‌చార్జి మంత్రి, మంత్రివర్గ సభ్యులు, ప్రజాప్రతినిధులు హాజరవుతారని తెలిపారు. రాష్ట్రం నలుమూలల నుంచి సుమారు 3 లక్షల మంది రైతులు ఈ సభకు హాజరవుతారని అంచనా వేస్తున్నామన్నారు. ప్రతి రైతు ఈ కార్యక్రమానికి విచ్చేసి ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. రైతులే రాష్ట్రానికి వెన్నెముక అని, రైతులకు ప్రతి అడుగులో అండగా నిలవడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. గత ప్రభుత్వం రైతు భరోసా పథకం క్రింద పదేళ్లలో మొత్తం రూ.72 వేల కోట్లు మాత్రమే అందించిందని, తమ ప్రభుత్వం రెండున్నరేళ్లలోనే రైతు భరోసా క్రింద రూ.35,830 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేసిందని తెలిపారు. వ్యవసాయ, అనుబంధ రంగాల అభివృద్ధి కోసం ప్రభుత్వం లక్షా 67 వేల 877 కోట్లను వెచ్చించిందన్నారు. రైతు రుణమాఫీ, ధాన్యానికి బోనస్, పంటల బీమా, పంట నష్టపరిహారం, ఉచిత విద్యుత్, విద్యుత్ సబ్సిడీ, వ్యవసాయ యాంత్రీకరణ వంటి పలు రైతు సంక్షేమ కార్యక్రమాల అమలుకు ఈ నిధులను వినియోగించినట్లు వివరించారు. ఖమ్మం జిల్లా అంటేనే వ్యవసాయానికి ప్రతీక అని, నాగార్జునసాగర్ వంటి ప్రధాన సాగునీటి ప్రాజెక్టులతో ఈ ప్రాంతం వ్యవసాయాభివృద్ధిలో ముందంజలో ఉందన్నారు. భవిష్యత్తులో రైతులకు మరింత మేలు చేసే కార్యక్రమాలను అమలు చేస్తామని, రైతుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని అన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





