రేపు సద్దుల బతుకమ్మ

– రాష్ట్ర‌వ్యాప్తంగా నిమజ్జనోత్సవానికి ముస్తాబు
– తొమ్మిది రోజుల పూల పండుగ తుది ఘట్టం
– హుస్సేన్‌సాగర్, ట్యాంక్‌బండ్ వద్ద రూ.10 కోట్లతో భారీ ఏర్పాట్లు
– ఎల్నినో ఎఫెక్ట్‌తో కరువైన తంగేడు, గునుగు..
– ఆకాశాన్నంటిన పూల ధరలు

(మండువ రవీందర్‌రావు, ప్ర‌జాతంత్ర ప్ర‌త్యేక ప్ర‌తినిధి, వ‌రంగ‌ల్‌)

తెలంగాణ వ్యాప్తంగా గత తొమ్మిదిరోజులుగా ఆటపాటలతో అత్యంత ఆనందోత్సవంగా జరుపుకున్న బతుకమ్మ వేడుకలు నేడు తుది ఘట్టానికి చేరుకోనున్నాయి. తరతరాలుగా వస్తున్న సంప్రదాయం ప్రకారం తొమ్మిదవ రోజున నీటిలో నిమజ్జనం చేయడం ఆనవాయితీ. కాగా ఈ సంప్రదాయం వేములవాడలో మరోతీరుగాఉంది. అక్కడ ఏడవరోజున్నే బతుకమ్మను నిమజ్జనంచేయడమన్నది చాలాకాలంగా కొనసాగుతున్నది.  ఇక్కడ శుక్రవారం రోజున్నే నిమజ్జన కార్యక్రమం అత్యంత వైభవోపేతంగా జరిగింది. అలాగే ఉమ్మడి వరంగల్‌ ‌జిల్లాలోని హసన్‌పర్తి మండలం సీతంపేట గ్రామంలో మరో సంప్రదాయముంది. చద్దుల బతుకమ్మరోజు యధావిదిగా మహిళలు తొమ్మిదిరోజుల వేడుకల్లో పాల్కొన్నప్పటికీ, ఈ గ్రామంలోని పురుషుల్లో ‘నేతగానివారు’ మాత్రం దీపావళిరోజున బతుకమ్మ అడడమన్నది చాలాకాలంగా కొనసాగుతున్నది. ఇదిలాఉంటే ఆశ్వయుజ శుద్ధ అష్టమి(దుర్గాష్టమి) రోజున్నే దాదాపు రాష్ట్రమంతా నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఆ రోజున స్థానికంగా అందుబాటులో ఉండే చెరువులు, కుంటలు, వాగుల్లో నిమజ్జనం చేస్తారు. ఈ వేడుకల్లో రాష్ట్రవ్యాప్తంగా కోట్లసంఖ్యలో పాల్గొనే మహిళలకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా రాష్ట్రప్రభుత్వం ముందుస్తుగానే ఏర్పాట్లు చేసింది. ఇందుకోసం దాదాపు పదికోట్ల రూపాయలను కేటాయించింది. తెలంగాణకు తలమానికంగా లక్షలాది సంఖ్యలో ఈ వేడుకలో పాల్గొనే హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌వద్ద భారీఏర్పాట్లు చేపట్టారు. అలాగే బతుకమ్మకుంట ఘాట్‌, ‌నెక్లెస్‌రోడ్‌ ‌పరిసర ప్రాంతాల్లో నిమజ్జనానికి భారీఏర్పాట్లు చేశారు. అలాగే సచివాలయంనుండి ట్యాంక్‌బండ్‌ ‌వరకు వేలాదిగా మహిళలు భారీస్థాయిలో ఊరేగింపు నిర్వహించనున్న క్రమంలో అందుకు కావాల్సిన జాగ్రత్తలను ప్రభుత్వం తీసుకుంటున్నది. బతుకమ్మల నిమజ్జనం సందర్భంగా నీళ్ళలోదిగే విషయంలో మహిళలు ఇబ్బందిపడకుండా చిన్న క్రేన్లనుకూడా ఏర్పాటు చేశారు. నీళ్ళలో దిగేప్పుడు ఏమరుపాటులేకుండా బారికేడ్లనుకూడా ఏర్పాటుచేశారు. అందుకు సంబందించిన హెచ్చరిక బోర్టులనుకూడా పెట్టారు. మహిళలు ఆడిపాడి నిమజ్జనం చేసేసమయానికి చీకటి పడుతుంది. రాత్రి పొద్దుపోయేవరకు ఈ కార్యక్రమం సాగనుండడంతో ఆయా ప్రాంతాల్లో విద్యుత్‌ ‌దీపాలను ఏర్పాటుచేశారు. హైదరాబాద్‌తోపాటు మిగతా జిల్లాల్లోకూడా ఇదే రీతిలో స్థానిక కలెక్టర్లు, అధికారులు, పోలీసు యంత్రాంగం తమపరిధిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకుంటున్నారు. తొమ్మిది రోజులపాటు అత్యంత ఉత్సాహభరితంగా నిర్వహించుకున్న బతుకమ్మ వేడుకలు ఆదివారంతో ముగియనున్నాయి. మహిళకు ప్రత్యేకమైనది ఈపండుగ. బతుకమ్మను పార్వతిగా, గౌరీదేవిగా కొలిచి చివరన అత్తవారింటికి పంపడమే ఈ నిమజ్జన కార్యక్రమం. తొమ్మిది రోజులు ఎంత వైభవోపేతంగా, భక్తిశ్రద్దలతో ఆడిపాడుతారో, అమ్మవారిని నిమజ్జనంచేసే క్రమంలో ‘పోయిరా బతుకమ్మ పోయిరావమ్మ.. పోయి మీ అత్తింట్లో బుద్దికలిగి ఉండు’అని పాడుతూ సాగనంపుతారు. శంఖు ఆకారంలో బతుకమ్మ పేర్చినప్పుడు మధ్యలో పసుపుతోచేసి నిలిపిన గౌరమ్మను వోలలాడించి, నిజంగానే తమ కన్నబిడ్డలను అత్తవారింటికి పంపినంత బరువైన హృదయాలతో మహిళలు పాడే పాటలు చలింపచేసివిగా ఉంటాయి. కాని, ఒకవిధంగా ఆ నిమజ్జన కార్యక్రమం చూడముచ్చటగా ఉంటుంది. గృహిణులు తమ శక్తికి తగినట్లుగా రంగురంగుల పూలతో అలంకరించిన బతుకమ్మలు జలాశయాల్లో తేలాడుతూ కనులవిందు కలిగించేవిగా ఉంటాయి. అత్తవారింటికి పంపేక్రమంలో గౌరమ్మకు కొబ్బరి, బెల్లం, నవ్వులు, పంచదార మిశ్రమాన్ని నైవేద్యంగా సమర్పించి, అక్కడున్నవారికి పంచిప్టెడం సంప్రదాయంగా వస్తున్నది.

తంగేడు, గునుగు పూల కొరత

ఎల్‌నినో ఎఫెక్టు ఈసారి బతుకమ్మలపై పడింది. బతుకమ్మ అనగానే తంగేడు, గునుగుపూలు గుర్తుకువస్తాయి. అయితే ఈసారి ఎల్‌నినో కారణంగా వర్షాలు కురవక తంగేడు, గునుగు పూల కొరత ఏర్పడింది. దానికితోడు రోజురోజుకు అడవులు తరిగి కాంక్రీట్‌ ‌జంగిల్స్‌గా మారడంకూడా ఒక కారణమైంది. ఫలితంగా ప్రకృతిలో లభించే ఇతర పూలధరలు ఆకాశాన్ని అంటాయి. అయినా తెలంగాణలో ముఖ్యంగా మహిళలకు అతిముఖ్యమైన పండుగ కావడంతో తమతమ శక్తిమేర కొన్నపూలతో తమ ముచ్చట తీర బతుకమ్మలను పేర్చుకుంటున్నారు. ఒకవిధంగా ఈ పండుగను మహిళా సమ్మేళనంగా భావిస్తారు. చిన్నాపెద్ద, గ్రామం, పట్టణం, కులమత బేదం లేకుండా సర్వమహిళాలోకం ఒకచోటచేరి జరుపుకునే ఈవేడుక బహుషా దేశంలోనే మరెక్కడాలేదు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాల సమ్మేళనమే బతుకమ్మ. గౌరీదేవి, పార్వతిగా, కాళీమాతగా పూజించడంతోపాటు సంపూర్ణ స్త్రీమూర్తికి ప్రతిబింబంగా ఆరాదిస్తారు. బతుకమ్మ పుట్టుపూర్వోత్తరాల విషయంలో అనేక కథలు ప్రచారంలోఉన్నప్పటికీ, సమాజంలో మహిళలపాత్ర, కొత్తగా పెళ్ళిఅయిన యువతులు అత్తవారింటికి వెళ్ళేక్రమంలో కుటుంబ సభ్యులతో ఎలా మర్యాదగా ప్రవర్తించాలన్న విషయాలను పాటలరూపంలో తెలియజేయటమన్నది ఈ వేడుకల్లో ఒక భాగమవటం విశేషం. గతంలో ఉమ్మడి కుటుంబాలుండడంవల్ల ఎవరినీ నొప్పించకుండా ఎలా మసలుకోవాలన్న విషయాన్ని పల్లెప్రజలకుకూడా సులభంగా అర్థమయ్యేరీతిలో పాటల్లో వివరించేవారు. ఇప్పుడు పరిస్థితులు మారాయి. బతుకమ్మలు రాజకీయ రంగులు పులుకుంటున్నాయి. తెలంగాణ ఉద్యమకాలంలో బతుకమ్మ రాజకీయ వేదికలెక్కిన విషయం తెలియందికాదు. ఉద్యమాల్లో బాగమైంది. ఆ క్రమంలోనే  తెలంగాణ ఎల్లలుదాటి విశ్వవ్యాపితమైంది. అలాగే ఇప్పుడు పాతపాటలచోట కొత్తతరం పాటలు చోటుచేసుకుంటున్నాయి. స్థానిక పరిస్తితులకు, అవసరాలకు అనుగుణమైన పాటలిప్పుడు యువతరాన్ని ఉత్తేజపరుస్తున్నాయి.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *