– జిల్లా న్యాయ సేవాధికార సంస్థ
– 18న ప్రత్యేక లోక్ అదాలత్ విజయవంతానికి సమన్వయ సమావేశం
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 9 : చెక్కు బౌన్స్ కేసులను సుదీర్ఘ న్యాయ ప్రక్రియకు బదులుగా పరస్పర రాజీ ద్వారా త్వరితగతిన పరిష్కరించేందుకు ప్రత్యేక లోక్ అదాలత్ అత్యంత సమర్థవంతమైన వేదిక అని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, సెషన్స్ డివిజన్, నాంపల్లి, హైదరాబాద్ చైర్‌పర్సన్, సెషన్స్ జడ్జి కె.సాయి రమాదేవి పేర్కొన్నారు. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ, హైదరాబాద్ గౌరవ కార్యనిర్వాహక అధ్యక్షుడు జస్టిస్ సామ్ కోశీ ఆదేశాల మేరకు గౌరవ సభ్య కార్యదర్శి పంచాక్షరి సూచనలతో ఈనెల 18న నాంపల్లి, సికింద్రాబాద్ కోర్టులలో నిర్వహించనున్న ప్రత్యేక లోక్ అదాలత్ (సెక్షన్ 138 నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ చట్టం కేసుల పరిష్కారం) నిర్వహించేందుకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, సెషన్స్ డివిజన్, నాంపల్లి ఆధ్వర్యంలో గురువారం సమన్వయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జస్టిస్ రమాదేవి ముఖ్య అతిథిగా మాట్లాడుతూ ఈ ప్రత్యేక లోక్ అదాలత్‌లో ప్రజలకు సమయం, ధనం ఆదా కావడంతోపాటు, ఇరుపక్షాలకు ఆమోదయోగ్యమైన పరిష్కారం లభిస్తుందని తెలిపారు. న్యాయస్థానాల్లో పెండింగ్‌లో ఉన్న అర్హత కలిగిన అన్ని సెక్షన్ 138 ఎన్.ఐ యాక్ట్ కేసులను ప్రత్యేక లోక్ అదాలత్‌కు రిఫర్ చేయాలని, బ్యాంకులు, ప్రైవేట్ ఆర్థిక సంస్థలు తమ ఖాతాదారులను రాజీకి ప్రోత్సహించాలని సూచించారు. ఈ ప్రత్యేక అదాలత్‌ను విజయవంతం చేయడంలో ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆమె పిలుపునిచ్చారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి పి.అరుణ కుమారి సమావేశానికి అధ్యక్షత వహించి ప్రత్యేక లోక్ అదాలత్ లక్ష్యాలు, నిర్వహణ విధానం, కేసుల ఎంపిక, రాజీ ప్రక్రియ, సంబంధిత అధికారుల పాత్రను వివరించారు. అర్హత కలిగిన ప్రతి కేసును గుర్తించి రాజీ అవకాశాలను ముందుగానే పరిశీలించి 18న జరిగే ప్రత్యేక లోక్ అదాలత్‌లో పరిష్కారానికి తీసుకురావాలని కోరారు. సమావేశంలో సెక్షన్ 138 ఎన్.ఐ యాక్ట్ కేసులను విచారిస్తున్న న్యాయాధికారులు, వివిధ జాతీయీకృత ప్రైవేట్ బ్యాంకుల అధికారులు, ప్రైవేట్ ఆర్థిక సంస్థల ప్రతినిధులు పాల్గొని ప్రత్యేక లోక్ అదాలత్ విజయవంతానికి తమ సంపూర్ణ సహకారాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ విజ్ఞప్తి చేసింది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





