జ్ఞానేష్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్ దేశవ్యాప్త నిరసనలు

– బీహార్‌లో కార్యకర్తలపై వాటర్ కెనాన్ల ప్రయోగం
– అస్సాంలో గౌరవ్ గొగోయ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు
– పాట్నాలో కాంగ్రెస్ కార్యకర్తలపై వాటర్ కెనాన్ల ప్రయోగం

న్యూదిల్లీ, సెప్టెంబర్ 25 : భారత ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) జ్ఞానేష్ కుమార్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ తన దేశవ్యాప్త ఆందోళనను శుక్రవారం ప్రారంభించింది. సీఈసీని తక్షణమే పదవి నుంచి తొలగించాలని, ఆయన ఆధ్వర్యంలో తీసుకున్న అన్ని నిర్ణయాలు, ఓటర్ల జాబితా మార్పులపై స్వతంత్ర సమీక్ష జరపాలని డిమాండ్ చేస్తూ తమతమ రాష్ట్ర ఎన్నికల సంఘాల కార్యాలయాల వరకు శుక్రవారం నిరసన ప్రదర్శనలు నిర్వహించాలని కాంగ్రెస్ తన రాష్ట్ర విభాగాలను గురువారం ఆదేశించింది. ఈ మేరకు దిల్లీ, పాట్నా, జమ్మూ, కోల్‌కతా, పంజాబ్, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ వరకు జ్ఞానేష్ కుమార్ రాజీనామా కోరుతూ కాంగ్రెస్ కార్యకర్తలు శుక్రవారం వీధుల్లోకి వచ్చారు. దిల్లీలో పార్టీ నాయకులు బ్యారికేడ్లను బద్దలుకొట్టి ఎన్నికల కమిషన్ కార్యాలయం వైపు వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ సందర్భంగా పలువురు కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ‘జ్ఞానేష్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలి.. దేశంలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతుంటే మౌనంగా కూర్చోబోము.. దీనికి బాధ్యులైన వారిని శిక్షిస్తాము’ అని కాంగ్రెస్ దిల్లీ అధ్యక్షుడు దేవేందర్ యాదవ్ నినదించారు. జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని కోరుతూ ఆయన ముఖం ఉన్న మాస్కులు ధరించి, చేతులకు సంకెళ్లు వేసుకుని యువజన కాంగ్రెస్ కార్యకర్తలు దిల్లీలో నిరసన తెలిపారు. పోస్టర్లు, బ్యానర్లు ప్రదర్శించారు. అస్సాంలో సీఈసీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ నిరసన సందర్భంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు గౌరవ్ గొగోయ్‌తోపాటు పలువురు కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బీహార్ రాజధాని పాట్నాలో ఎన్నికల సంఘం కార్యాలయం వరకు మార్చ్ నిర్వహించిన కాంగ్రెస్ కార్యకర్తలపై పోలీసులు వాటర్ కెనాన్లను ప్రయోగించారు. కోల్‌కతా, చండీగఢ్, జమ్మూ సహా పలు రాష్ట్ర రాజధానులలో, ఇతర ప్రాంతాల్లోనూ కాంగ్రెస్ పార్టీ నిరసన ప్రదర్శనలను నిర్వహించింది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *