– కరీంనగర్‌లో మహా పాదయాత్ర గ్రాండ్ సక్సెస్
– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 24 : బీజేపీ కార్యక్రమాలకు వస్తున్న విశేష ప్రజాస్పందన చూసి కాంగ్రెస్ నాయకుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు అన్నారు. కరీంనగర్ వేదికగా తమ పార్టీ సోమవారం నిర్వ\హించిన మహా పాదయాత్ర విజయవంతమైందన్నారు. పార్టీ కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ హైదరాబాద్‌లో అంతకుముందు అమిత్ షా ఆధ్వర్యంలో మహా పాదయాత్ర, ఆ తర్వాత నిర్మల్ జిల్లాలో జరిగిన యాత్రలో భారీ వర్షాన్ని సైతం లెక్కచేయకుండా వేలాదిమంది కార్యకర్తలు, ప్రజలు పాల్గొనడంతో పాదయాత్ర విజయవంతమైందని తెలిపారు. కరీంనగర్ గడ్డపై నుంచి తమ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ తెలంగాణలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని స్పష్టమైన సందేశం ఇచ్చారన్నారు. 90 సీట్లు గెలుస్తామని సీఎం రేవంత్ రెడ్డి సహా కాంగ్రెస్ నేతలు చెబుతున్నారని, కానీ రాబోయే ఎన్నికల్లో 90 సీట్లలో కాంగ్రెస్‌కు డిపాజిట్లు గల్లంతవుతాయనే భయం వారిని వెంటాడుతోందని వ్యాఖ్యానించారు. తమ పార్టీ జాతీయ నాయకులు తెలంగాణకు వచ్చినప్పుడల్లా కాంగ్రెస్ నాయకులు తమ అసహనాన్ని, లెక్కలేనితనాన్ని బయటపెట్టుకుంటున్నారని ఆరోపించారు. తెలంగాణ ప్రజలు తదుపరి బీజేపీని అధికారంలోకి తీసుకురావాలని స్పష్టంగా నిర్ణయించుకున్నారన్నారు. బీజేపీ ఎదుగుదలను అడ్డుకోవడానికి కాంగ్రెస్, బీఆర్ఎస్ లు ఒక్కటై కుట్రలు పన్నుతున్నాయని ఆరోపించారు. గతంలో ‘మోసగాడు’ లాగా బీఆర్ఎస్ రాష్ట్రాన్ని పరిపాలిస్తే నేడు ‘మోసగాళ్లకు మోసగాడు’ సినిమా లాగా కాంగ్రెస్ పార్టీ పాలన సాగిస్తోందని విమర్శించారు. ఈ రెండింటి ఆట కట్టించడానికి తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాబోతోందని స్పష్టం చేశారు. అవినీతి రహితమైన పరిపాలనను బీజేపీ మాత్రమే అందిస్తుందని రామచందర్‌రావు హామీ ఇచ్చారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు




