కాంగ్రెస్‌ది అరాచక పాలన

– త్వరలో బీజేపీ ప్రజా ప్రభుత్వం ఖాయం
– పరకాల అమరధామం స్ఫూర్తితో నిరంకుశ సర్కార్‌పై పోరాటం
– బీజేపీ కార్యకర్తలు, కార్యాలయాలపై దాడులు ప్రజాస్వామ్యంపై దాడి
– బీఆరఎస్ కుటుంబ పాలన.. కాంగ్రెస్ ‘బ్రదర్స్ అండ్ కంపెనీ’ పాలన
– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు

భువనగిరి, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 2 : దక్షిణ భారత జలియన్‌వాలా బాగ్‌గా చరిత్రకెక్కిన పరకాల మారణకాండలో నిజాం నిరంకుశ పాలనను ఎదిరించి అసువులు బాసిన వీరుల త్యాగాలు చిరస్మరణీయమని, ఆ స్ఫూర్తితోనే కాంగ్రెస్ ప్రజావ్యతిరేక, దౌర్జన్య పాలనపై రాజీ లేని పోరాటం సాగిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు స్పష్టం చేశారు. పరకాల అమరధామంలో అమరవీరులకు ఘనంగా నివాళులర్పించేందుకు హైదరాబాద్ నుంచి రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ బూర నర్సయ్య గౌడ్, రాష్ట్ర అధికారిక ప్రతినిధి రాణి రుద్రమ, తదితరులతో కలిసి ఆయన బయలుదేరారు. ఈ క్రమంలో మార్గమధ్యంలో భువనగిరిలో బీజేపీ శ్రేణులతో కలిసి ఆయన అల్పాహార సమావేశంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ కక్షసాధింపు చర్యల్లో అక్రమ అరెస్టులను ఎదుర్కొని, మెజిస్ట్రేట్ ద్వారా బెయిల్‌పై విడుదలైన స్థానిక కార్యకర్తలను పరామర్శించారు. అనంతరం భువనగిరిలో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.

బీజేపీ శ్రేణులపై దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాం

రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు బీజేపీ కార్యకర్తలు, నాయకులు, పార్టీ కార్యాలయాలపై విచ్చలవిడిగా దాడులకు తెగబడుతున్నాయని, పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షుడి ఇంట్లోకి చొరబడి ఆయన తల్లిపై కూడా దాడి చేయడం కాంగ్రెస్ గూండాగిరికి పరాకాష్ట అని రామచందర్‌రావు దుయ్యబట్టారు. దళితులు ఆరాధ్యదైవంగా భావించే సంత్ రవిదాస్ చిత్రపటంపై నల్లరంగు పూసి అవమానించడం దారుణమన్నారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి భౌతిక దాడులకు తావులేదన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయి

గతంలో పశ్చిమ బెంగాల్‌లో నాటి అధికార పార్టీ ఏ విధంగానైతే ప్రతిపక్షాలపై, ప్రజలపై హింసాత్మక దాడులకు పాల్పడిందో అదే తరహా హింసాత్మక రాజకీయాలను తెలంగాణలో కాంగ్రెస్ పునరావృతం చేస్తోందని రామచందర్ రావు విమర్శించారు. పశ్చిమ బెంగాల్‌లో దౌర్జన్యాలకు స్వస్తి పలికి బీజేపీని ప్రజలు ఎలా ఆదరించారో తెలంగాణలోనూ కాంగ్రెస్ సర్కార్‌కు ప్రజలు అదే గతి పట్టిస్తారన్నారు. ప్రజా సమస్యలను పట్టించుకోకుండా మోసం చేసిన కాంగ్రెస్‌కు, మిగిలి ఉన్న సుమారు 750 రోజుల వ్యవధిలో ప్రజలే తగిన గుణపాఠం చెబుతారన్నారు.

పోరు బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ మాత్రమే

గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఒక కుటుంబం మాత్రమే బాగుపడింది తప్ప ప్రజలకు ఎలాంటి మేలు జరగలేదు. ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్ ‘బ్రదర్స్ అండ్ కంపెనీ’గా మారి రాష్ట్రాన్ని దోచుకుంటోందని రామచందర్ రావు ఆరోపించారు. బీఆర్ఎస్ కుటుంబ పాలనను, కాంగ్రెస్ దోపిడీని ప్రజలు గమనిస్తున్నారన్నారు. అందుకే రాష్ట్రంలో ప్రజా సంక్షేమానికి, సమగ్ర అభివృద్ధికి ఏకైక ప్రత్యామ్నాయం బీజేపీ మాత్రమేనని ప్రజలు బలంగా విశ్వసిస్తున్నారని తెలిపారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ మధ్యనే ముఖాముఖి పోరాటం ఉంటుందని, ప్రజల ఆశీస్సులతో బీజేపీ ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర, జిల్లాస్థాయి ముఖ్య నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *