– విమోచన పోరాట చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చాలి
– సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినంగా అధికారికంగా ప్రకటించాలి
– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు
పరకాల, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 2: పరకాల అమరవీరుల త్యాగాలు తెలంగాణ విముక్తి పోరాట చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయని, నిజాం నిరంకుశ పాలనపై ప్రజలు సాగించిన వీరోచిత పోరాట స్ఫూర్తిని రాబోయే తరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు అన్నారు. పరకాల అమరధామంలో అమరవీరుల స్తూపం వద్ద ఆయన బుధవారం ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా రామచందర్ రావు మాట్లాడుతూ 80 ఏళ్ల క్రితం నిజాం నిరంకుశ పరిపాలనలో రజాకార్లు పరకాలలో సాగించిన మారణకాండ దక్షిణ భారత జలియన్‌వాలా బాగ్‌ను తలపించిందన్నారు. చాపలబండ వద్ద 19 మందిని, లక్ష్మీపూర్‌లో మరో ముగ్గురిని దారుణంగా ఊచకోత కోశారని గుర్తుచేశారు. గుండ్రాంపల్లి, బైరాన్‌పల్లి సంఘటనలు నాటి దౌర్జన్యాలకు అద్దం పడతాయన్నారు. సర్దార్ వల్లభభాయ్ పటేల్ చేపట్టిన ‘ఆపరేషన్ పోలో’తో నిజాం తలవంచడంతో 1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ సంస్థానం భారత దేశంలో అంతర్భాగమైందని స్పష్టం చేశారు.
అధికారిక వేడుకలు జరపాలి
పాత హైదరాబాద్ సంస్థానంలో భాగమైన కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల్లో అక్కడి ప్రభుత్వాలు సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహిస్తున్నాయని, కానీ తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం మజ్లిస్ ఓటు బ్యాంకు రాజకీయాలకు భయపడి విస్మరిస్తోందని విమర్శించారు. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సెప్టెంబర్ 17 విమోచన పోరాట చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చి భావితరాలకు అందిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
జెండా ఆవిష్కరణకు పిలుపు
కేంద్ర ప్రభుత్వం ఏటా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో ఈ వేడుకలను అధికారికంగా నిర్వహిస్తోందని తెలిపారు.సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినంగా తక్షణమే అధికారికంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఆ రోజున ప్రతి పల్లెలో, విద్యాసంస్థల్లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి అమరవీరులకు నివాళులు అర్పించాలని ప్రజలకు రామచందర్ రావు పిలుపునిచ్చారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





