– రక్షణ, పౌర విమానయాన శాఖల సంయుక్త సమావేశం ఏర్పాటు చేయండి
– ఆదిలాబాద్ విమానాశ్రయంలో ఎంఆర్‌వో వసతులు కల్పించండి
– కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
దిల్లీ, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 2 : ఆదిలాబాద్, మామూనురు(వరంగల్) విమానాశ్రయాల పనులు వేగవంతం చేయాలని పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుకు ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. మామూనురు విమానాశ్రయానికి అవసరమైన భూ సేకరణను పూర్తి చేసి ఇచ్చామని తెలిపారు. దిల్లీలోని పౌర విమానయాన శాఖ కార్యాలయం రాజీవ్ గాంధీ భవన్‌లో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం సమావేశమయ్యారు. ఆదిలాబాద్ విమానాశ్రయంలో కార్గో, ప్యాసింజర్ టెర్మినల్, ఎంఆర్‌వో(మెయింటెనెన్స్, రిపేర్స్, ఓవర్‌హాలింగ్) వసతులు ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రికి సీఎం విజ్ఞప్తి చేశారు. ఆదిలాబాద్‌లో రన్ వే ఫైనలైజ్‌కు సంబంధించి రక్షణ, పౌర విమానయన శాఖల సంయుక్త సమావేశం ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రిని కోరారు. మామునూరు ఎయిర్‌పోర్టు టెండర్లను రెండు వారాల్లో పిలిచి డిసెంబరు నాటికి ఖరారు చేసి పనులకు అదే నెలలో శంకుస్థాపన చేస్తామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలియజేశారు. తెలంగాణలో ఛాపర్ల ద్వారా హెలీ టూరిజం అభివృద్ధికి కృషి చేయాలని కేంద్ర మంత్రికి ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. హెలీ టూరిజంతో రాష్ట్రంలో పర్యాటక రంగం మరింత అభివృద్ధికి అవకాశం ఉంటుందని సీఎం తెలియజేశారు. హుస్సేన్ సాగర్‌లో సీ ప్లేన్ ల్యాండింగ్‌కు సంబంధించిన నివేదికను రెండు వారాల్లో రాష్ట్ర ప్రభుత్వానికి అందజేస్తామని పౌర విమానయాన శాఖ అధికారులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలియజేశారు. సమావేశంలో ఎంపీలు సురేశ్ షెట్కార్, ఎం.అనిల్ కుమార్ యాదవ్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ప్రొటోకాల్) హర్కార వేణుగోపాల్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, సీఎం సెక్రటరీ మాణిక్ రాజ్ తదితరులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





