కేసీఆర్ రాజీనామా చేయాలి

– ప్ర‌జ‌ల డ‌బ్బు తీసుకుంటూ అసెంబ్లీకి హాజ‌రుకాక‌పోవ‌డ‌మేంటి?
– సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్‌
– సీఎం పిలుపు మేర‌కు కాంగ్రెస్ శ్రేణుల ధ‌ర్నాలు
– ఎదురు దాడికి దిగిన బీఆర్ ఎస్‌
– ఇచ్చిన వాగ్దానాలు నెర‌వేర్చ‌లేక డైవ‌ర్ష‌న్ రాజ‌కీయాలా?
– కేసీఆర్ రాజీనామా చేస్తే వ‌చ్చే స్పంద‌న‌ను రేవంత్ త‌ట్టుకోలేడు : కేటీఆర్

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 5: కేసీఆర్ ప్రతిపక్ష హోదాకు, శాసనసభ్యత్వానికి రాజీనామా చేయాలని రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. తాము అధికారం చేపట్టిన వెయ్యి రోజులకు కెసిఆర్ తీసుకున్న జీతాన్ని ఆయన లెక్కకట్టారు. ఈ వెయ్యి రోజుల జీతం కోటి 24లక్షల 40వేలతోపాటు, ప్రతిపక్ష నాయకుడికి కల్పించే భద్రత చర్యలకు గాను అయిన ఖర్చు అంతాకలిపి 22 నుండి 24 కోట్లన్న విషయాన్ని గుర్తుచేశారు. ప్రజలడబ్బు తీసుకుంటూ ఆయన ప్రజలకు, పాలనకు దూరం ఉండడమేంటని ప్రశ్నించడంతోపాటు, కెసిఆర్ అసెంబ్లీకి హాజరుకావాలంటూ ఈ నెల ఆరున హైదరాబాద్ ధర్నా చౌక్ వద్ద ధర్నా చేయాల్సిందిగా ఆయన కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈమేరకు మంత్రులు, ఎంఎలఏలతో ఆయన శ‌నివారం సమాలోచన చేశారు. ముఖ్యమంత్రి నోటి ధర్నామాట రాగానే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో కాంగ్రెస్ శ్రేణులు అప్పుడే ర్యాలీలు, ధర్నాలు మొదలెట్టాయి. వేములవాడలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అద్వర్యంలో 500 మీటర్ల ఫ్లెక్సీపైన ‘కెసిఆర్ అసెంబ్లీకి రావాల’న్న నినాదంతో, భారీ ప్రదర్శన నిర్వహించడం గమనార్హం. ఇదిలావుండ‌గా ఈ విషయంలో బిఆర్‌ఎస్ నేతలు తీవ్రంగా స్పందిస్తున్నారు. రాష్ట్రంలో అనేక సమస్యలున్నాయి. ప్రధానంగా అధికారంలోకి రావడానికి ముందు కాంగ్రెస్ ఇచ్చిన ఒక్క వాగ్ధానాన్ని కూడా పూర్తి చేయలేకపోయింది. దీంతో ప్రజల్లో తిరుగుబాటు మొదలైంది. మూడేళ్ల‌ కాలంలో చేయలేని పనులు మరో రెండు సంవత్సరాల్లో అవుతాయన్న నమ్మకం ప్రజల్లో లేకుండా పోయింది. దాదాపు అన్ని వర్గాలవారు పాలనపై అసంతృప్తితో ఉన్నారు. వారి దృష్టిని మళ్ళించడానికే ముఖ్యమంత్రి ఈ నినాదం ఎత్తుకున్నారని బిఆర్‌ఎస్ ఎదురుదాడి మొదలు పెట్టింది. తాజాగా ఆపార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ కెటిఆర్ ‘మళ్ళీ సిఎంగానే కెసిఆర్ అసెంబ్లీకి వస్తాడనడం’ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నంతకాలం ఆయన అసెంబ్లీకి రాడన్న విషయాన్ని స్పష్టంచేసినట్లైంది. గతంలో తమిళనాడులో జయలలిత, ఉమ్మడి ఏపిలో ఎన్టీఆర్, నేడు ప్రత్యేక రాష్ట్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబునాయుడు కూడా వివిధ కారణాలతో అసెంబ్లీకి వెళ్ళని విషయాన్ని బిఆర్‌ఎస్ గుర్తుచేస్తున్నది. కెసిఆర్ రానంత మాత్రాన ప్రతిపక్ష పాత్ర కుంటుపడడంలేదని డిప్యూటి ఫోర్‌లీడర్‌గా హరీష్‌రావు ప్రభుత్వ తీరును ఎప్పటికప్పుడు ఎండగడుతున్న విషయాన్ని వారు గుర్తుచేస్తున్నారు. కాగా అధికారపక్షం ప్రతిపక్షాన్ని విమర్శించినప్పుడల్లా వాడుతున్న భాషను బిఆర్‌ఎస్ తీవ్రంగా ఆక్షేపిస్తున్నది. పద్నాలుగు సంవత్సరాలు అవిరామంగా పోరాడి రాష్ట్రాన్ని సాధించడంతోపాటు, దశాబ్దాకాలం ముఖ్యమంత్రిగా కొనసాగిని కెసిఆర్ వయస్సుకు కూడా గౌరవం ఇవ్వకుండా ముఖ్యమంత్రి, ఇతర మంత్రులు కించపర్చే భాష వాడుతున్నప్పుడు కెసిఆర్ సభలో ఎలా ఉంటారని వారు ప్రశ్నిస్తున్నారు. ఇక రాజీనామా విషయానికొస్తే.. ఆయన రాజీనామా చేస్తే ఒక సంచలనమేనంటున్నారు కెటిఆర్. గతంలో ఆయన తన పదవులకు చేసిన రాజీనామాలు ఏమేరకు సంచలనం సృష్టించాయన్నది తెలియందికాదు. ఆయన రాజీనామాతో ప్రజలనుండి వచ్చే స్పందనకు రేవంత్‌రెడ్డి ప్రభుత్వం తట్టుకోలేదంటున్నారాయన. ఏదిఏమైనా ఈనెల 7న అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానుండగా కెసిఆర్ అసెంబ్లీకి వచ్చే విషయం రాష్ట్రంలో మరోసారి సంచలనంగా మారింది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *