ఇంధన రంగాన్ని బలోపేతం చేయాలి

– బొగ్గు సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలి
– భవిష్యత్ ప్రగతికి సరిపడే ఉత్పత్తి, ప్రసార సామర్థ్యాన్ని పెంచాలి
– డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 5 : రాష్ట్ర అభివృద్ధి వేగాన్ని మరింత పెంచేలా ఇంధన రంగాన్ని బలోపేతం చేయాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. రాష్ట్ర విద్యుత్ రంగం కార్యకలాపాలు, ఆర్థిక పరిస్థితి, బొగ్గు లభ్యత, భవిష్యత్ ఇంధన అవసరాలపై ప్రజాభవన్‌లో శనివారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. విద్యుత్ ఉత్పత్తిలో ఎలాంటి అంతరాయం కలగకుండా తగినంత బొగ్గు నిల్వలు, నిరంతర సరఫరా ఉండేలా పటిష్ట చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సింగరేణి ద్వారా బొగ్గు ఉత్పత్తి, ఉత్పత్తి సామర్థ్యం, బొగ్గు నాణ్యతను నిరంతరం కొనసాగించే అంశాలపై కూడా ఆయన దృష్టి సారించారు. విద్యుత్ ఉత్పత్తి అవసరాలకు అనుగుణంగా బొగ్గు సరఫరా వ్యవస్థను మరింత సమర్థవంతంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. ఒడిశాలోని నైనీ గని నుంచి రాష్ట్ర విద్యుత్ కేంద్రాలకు బొగ్గును సకాలంలో తరలించేందుకు అవసరమైన రవాణా, లాజిస్టిక్స్ ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు. గనిలో ఉత్పత్తి నుంచి తెలంగాణ విద్యుత్ కేంద్రాలకు బొగ్గు చేరే వరకు జాప్యం జరగకుండా సంబంధిత శాఖలు, సంస్థలు పరస్పర సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. రాష్ట్ర ఇంధన భద్రతలో నైనీ గని కీలక పాత్ర పోషించేలా పూర్తి సామర్థ్యాన్ని వినియోగించుకోవాలని స్పష్టం చేశారు.

విద్యుత్ సంస్థలకు ఆర్థిక బలం

రాష్ట్ర విద్యుత్ సంస్థల ఆర్థిక పరిస్థితిని కూడా ఉప ముఖ్యమంత్రి సమీక్షించారు. సంస్థల ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచడం ఒక్క శాఖ బాధ్యత కాదని, విద్యుత్ సంస్థలు, ఇంధన శాఖ, ఆర్థిక శాఖ సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని అన్నారు. నగదు ప్రవాహం, పెండింగ్ చెల్లింపులు, వ్యయ అవసరాలు, ఇతర ఆర్థిక అంశాలను నిరంతరం పర్యవేక్షిస్తూ సమస్యలను ముందుగానే గుర్తించి పరిష్కరించాలని ఆదేశించారు. ఇందుకోసం రెగ్యులర్ కోఆర్డినేషన్ మెకానిజాన్ని ఏర్పాటు చేసి, ఆర్థిక అంశాలపై ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహించాలని సూచించారు.

రేపటి తెలంగాణ కోసం నేటి నుంచే ప్రణాళిక

రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో భవిష్యత్ విద్యుత్ అవసరాలను ముందుగానే అంచనా వేసి సమగ్ర దీర్ఘకాలిక ఇంధన ప్రణాళిక రూపొందించాలని ఉప ముఖ్యమంత్రి ఇంధన శాఖను ఆదేశించారు. వ్యవసాయం, పరిశ్రమలు, సాగునీటి ప్రాజెక్టులు, పట్టణాభివృద్ధి, కొత్తగా అభివృద్ధి చెందుతున్న రంగాల నుంచి పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకుని ప్రణాళిక రూపొందించాలని సూచించారు. విశ్వసనీయమైన, అందుబాటు ధరల్లో విద్యుత్.. తగినంత విద్యుత్ ఉత్పత్తి.. బలమైన ప్రసార వ్యవస్థ.. పటిష్టమైన ఇంధన భద్రత.. విద్యుత్ సంస్థల దీర్ఘకాలిక ఆర్థిక స్థిరత్వం లక్ష్యంగా ఈ ప్రణాళిక ఉండాలని స్పష్టం చేశారు.

ఒకే వ్యవస్థగా సమన్వయంతో పనిచేయాలి

రాష్ట్ర ఇంధన రంగంలోని అన్ని సంస్థలు సమన్వయంతో ఒకే వ్యవస్థగా పనిచేయాలని భట్టి విక్రమార్క సూచించారు. తక్షణ అవసరాలైన బొగ్గు సరఫరా, విద్యుత్ ఉత్పత్తి, ఆర్థిక అంశాలను పరిష్కరించడంతోపాటు రాష్ట్ర భవిష్యత్ అభివృద్ధికి అవసరమైన ఇంధన వనరులు, మౌలిక వసతులను ఇప్పటినుంచే సిద్ధం చేయాల్నరు. తెలంగాణ అభివృద్ధి వేగానికి విద్యుత్ రంగం వెన్నెముక. రాష్ట్ర ప్రస్తుత అవసరాలను తీర్చడమేకాక రాబోయే సంవత్సరాల్లో పెరగనున్న విద్యుత్ డిమాండ్‌ను ముందుగానే అంచనా వేసి పటిష్టమైన ప్రణాళికతో ముందుకు సాగాలని భట్టి అధికారులకు దిశానిర్దేశం చేశారు. సమావేశంలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, ముఖ్యమంత్రి సలహాదారు రామకృష్ణారావు, స్పెషల్ చీఫ్ సెక్రటరీ నవీన్ మిట్టల్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, సింగరేణి సీఎండి డాక్టర్ బుద్ధప్రసాద్ జ్యోతి, జెన్ కో సీఎండీ హరీష్, ట్రాన్స్ కో సీఎండీ కృష్ణ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *