రోడ్లపై వంటావార్పుతో తెలంగాణ వ‌చ్చింది

– రేవంత్‌రెడ్డి హ‌యాంలో మ‌ళ్లీ అదే ఖ‌ర్మ ప‌ట్టింది
– రైతుల‌కు ఇచ్చిన హామీలు నెర‌వేర్చండి
– కేసీఆర్ పాల‌న‌లో 24 గంట‌లు క‌రెంట్ వుండేది
– ఇప్ప‌డు పొద్దున లేస్తే క‌రంటు కోసం ఫోన్లు
– యూరియా దొర‌క్క రైతుల పాట్లు
– అన్నీ ప‌క్కాగా రావాలంటే కేసీఆర్ సీఎం కావాలి
– మాజీ మంత్రి హ‌రీష్‌రావు

దుబ్బాక‌, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 5: మా తెలంగాణ మాకు కావాలని రోడ్ల మీద వంటా వార్పు చేస్తే తెలంగాణ వచ్చింది. పదేళ్లు కేసీఆర్ నాయకత్వంలో అంతా చల్లగా ఉన్నాం. కానీ, ఈ రేవంత్ రెడ్డి పుణ్యమా అని రైతులు మళ్లీ వంటా వార్పుతో రోడ్ల మీదకు ఎక్కాల్సిన ఖర్మ పట్టిందని మాజీ మంత్రి హ‌రీష్‌రావు అన్నారు. రైతు సమస్యలపై, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై దుబ్బాక నియోజకవర్గంలో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో శనివారం  నిర్వహించిన ‘రైతు పొలికేక’ కార్యక్రమంలో  ఆయ‌న పాల్గొని ప్ర‌సంగించారు.  మేము గొంతెమ్మ కోరికలు కోరడం లేదు, ఎన్నికల్లో మీరు రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని, కేసీఆర్ లాగా రైతులకు అండగా ఉండాలని మాత్రమే డిమాండ్ చేస్తున్నామ‌న్నారు. పదేళ్ల కేసీఆర్ పాలనలో కరెంట్ అంటే ఒక లెక్క లేకుండా 24 గంటలు బాయి కాడ కరెంట్ ఉండేది. ఇప్పుడు పొద్దున లేస్తే కరెంట్ కోసం ఫోన్లు వస్తున్నాయి. ఎనిమిది గంటలు కూడా సరిగ్గా కరెంట్ రాక రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇందిరమ్మ పాలన, పాత రోజులు తెస్తానన్న రేవంత్ రెడ్డి.. నిజంగానే కరెంట్ కష్టాలతో పాత రోజులను వెనక్కి తెచ్చాడు.లాక్ డౌన్ లో ఇళ్లలో ఉన్నప్పుడు కూడా కేసీఆర్ రైతుబంధు ఆగనివ్వలేదు. ఎమ్మెల్యేల జీతాలు, ఉద్యోగుల జీతాలు సగం ఆపినా, కాంట్రాక్టర్ల బిల్లులు ఆపినా రైతులకు మాత్రం పక్కాగా రైతుబంధు అందించిన గొప్ప నాయకుడు కేసీఆర్ అన్నారు. ఓట్ల కోసం కేసీఆర్ ఏనాడు రైతుబంధు ఇస్తానని మాట ఇవ్వలేదు. కానీ రైతుల కష్టం చూసి రైతుబంధు ప్రారంభించారు. రేవంత్ రెడ్డి మాత్రం కేసీఆర్ రూ.10 వేలు ఇస్తే నేను రూ.15 వేలు ఇస్తానని చెప్పి, ఉన్నదాన్నే ఎగ్గొట్టాడు. ఈ మూడేళ్లలో రేవంత్ రెడ్డి రైతులకు ఎగ్గొట్టిన రైతుబంధు అక్షరాలా రూ. 29 వేల కోట్లు. పాముకాటుకో, కరెంట్ షాక్ తోనో రైతు చనిపోతే ఏ కష్టం లేకుండా రూ. 5 లక్షలు ఇచ్చే రైతు బీమా ఇప్పుడు ఏమైంది. ఈ నెల 13న ప్రీమియం కట్టకుండా రేవంత్ రెడ్డి రైతుల బీమాను బంద్ చేశాడు. దుకాణానికి వెళ్లి నాలుగు సంచుల యూరియా తెచ్చుకునే రోజులు పోయాయి. ఇప్పుడు యాప్ లలో బుక్ చేస్తే 15 రోజులకు గానీ డీఏపీ, యూరియా దొరకని దౌర్భాగ్య పరిస్థితి దాపురించింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం డీఏపీ ధరలను రూ. 900 నుంచి రూ. 2200కి పెంచితే, రాష్ట్ర ప్రభుత్వం యాప్ లతో రైతుల ఉసురు తీసుకుంటోంది. వడ్లు కొనుగోలులో రైతులను మోసం చేస్తూ బస్తాకు 5 కిలోల తరుగు పెడుతున్న మిల్లర్ల చేతిలో ముఖ్యమంత్రి కీలుబొమ్మగా మారాడు. అసెంబ్లీలో తరుగు తీస్తే తోలు తీస్తానన్న ముఖ్యమంత్రి.. నేడు మిల్లర్లకే వత్తాసు పలుకుతున్నాడు. ఏ పంట పండినా కొనుగోలు చేసిన ఘనత కేసీఆర్ ది. కానీ రేవంత్ రెడ్డి మాత్రం కేంద్రం ఏది కొనమంటే అదే కొంటానని చేతులెత్తేస్తున్నాడు. కేంద్రం కొనకపోతే రాష్ట్ర ముఖ్యమంత్రిగా నీ బాధ్యత ఏంటి? చేతకాకపోతే కుర్చీ దిగిపో. రైతులను ఆదుకున్న కేసీఆర్ రైతు బాంధవుడైతే, ఈ వెయ్యి రోజుల పాలనలో రైతుల ఉసురు పోసుకుంటున్న రేవంత్ రెడ్డి ఒక రాబందు లాంటివాడని విమ‌ర్శించారు. మండుటెండల్లో మల్లన్న సాగర్ గేట్లు ఎత్తి కూడెల్లి వాగులో నీళ్లు పారించి రైతుల పొలాలను పచ్చగా ఉంచిన భగీరథుడు కేసీఆర్. కానీ రేవంత్ రెడ్డి వచ్చిన మూడేళ్లలో మెదక్, దుబ్బాక, సిద్దిపేటలో ఒక్క ఎకరా కాలువ తవ్వలేదు.మేడిగడ్డ దగ్గర చిన్న పిల్లర్ మరమ్మతు చేయకుండా, మోటార్లు ఆన్ చేయకుండా కావాలనే కాళేశ్వరం ప్రాజెక్టును పడుకోబెట్టాడు. ఇది కేవలం రేవంత్ రెడ్డి తెచ్చిన కరువు.1000 రోజుల కాంగ్రెస్ పాలనలో 1000 అబద్ధాలు, కబ్జాలు, మోసాలు తప్ప మరేమీ లేదు. దేవుళ్ళ మీద ప్రమాణాలు చేసి మాట తప్పిన రేవంత్ రెడ్డి మనిషేనా? నాలుగు వేల పెన్షన్ ఇస్తానని మోసం చేయడమే కాకుండా, ఉన్న 3 లక్షల 50 వేల పెన్షన్లు తొలగించారు. కేసీఆర్ ఇచ్చిన కళ్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్ ఇప్పుడు మచ్చుకైనా కనిపించడం లేదు. తులం బంగారం పేరుతో ఆడబిడ్డలను నిలువునా మోసం చేశాడు. కరెంట్, రైతుబంధు, రైతుబీమా ఇవన్నీ మళ్లీ పక్కాగా రావాలంటే కేసీఆర్ నాయకత్వం మళ్లీ రావాలి. కాంగ్రెస్ మోసాలకు రైతులు, మహిళలు తమ ఓటు ద్వారా తగిన బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైంద‌న్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *