– రూ.70 వేల కోట్ల పెట్టుబడి, 7 వేల మందికి ఉపాధి
– తెలంగాణకే కాక దేశానికి ఇది చరిత్రాత్మక ప్రాజెక్టు
– టీసీఎస్-హైపర్‌వాల్ట్ ప్రతినిధులతో సీఎం సమావేశం
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 5: హైదరాబాద్‌లో దేశంలోనే అతిపెద్ద ఏఐ డేటా సెంటర్ క్యాంపస్‌ను ఏర్పాటు చేయనున్నట్లు టీసీఎస్ అనుబంధ సంస్థ హైపర్‌వాల్ట్ ప్రకటించింది. అందుకు సంబంధించి ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. టీసీఎస్ ప్రతినిధుల బృందం ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డితో సచివాలయంలో శనివారం సమావేశమైంది. హైదరాబాద్‌లో 250 ఎకరాలకుపైగా విస్తీర్ణంలో ఒక గిగావాట్(1,000 మెగావాట్లు) సామర్థ్యంతో ఈ అత్యాధునిక ఏఐ డేటా సెంటర్ క్యాంపస్‌ను అభివృద్ధి చేయనున్నారు. హైపర్వాల్ట్తోపాటు భాగస్వామ్య సంస్థలు ఈ ప్రాజెక్టు నిర్మాణం, నిర్వహణకు దాదాపు రూ.70 వేల కోట్లు పెట్టుబడి పెట్టనున్నాయి. ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు ఏడు వేల ఉద్యోగాలు అందుబాటులోకి రానున్నాయి. ప్రపంచంలోని అగ్రశ్రేణి ఏఐ కంపెనీలు, హైపర్స్కేలర్లు, గ్లోబల్ ఎంటర్‌ప్రైజెస్‌కు అవసరమైన భారీ కంప్యూటింగ్ మౌలిక వసతులను ఈ క్యాంపస్ అందించనుంది. అధిక సామర్థ్యమున్న కంప్యూటింగ్ వ్యవస్థలు, లిక్విడ్ కూలింగ్ వంటి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ కేంద్రాన్ని తీర్చిదిద్దనున్నారు. దేశంలోని అత్యంత అధునాతన, అతిపెద్ద ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్యాంపస్‌లలో ఇది ఒకటిగా నిలవనుంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణకే కాక దేశానికి ఇది చరిత్రాత్మక ప్రాజెక్టు అని అన్నారు. ఏఐ మోడల్స్, కంప్యూటింగ్ సామర్థ్యం భవిష్యత్తులో కీలక ప్రజా మౌలిక వసతులుగా మారనున్న తరుణంలో ఆ సామర్థ్యం తెలంగాణలోనే అందుబాటులో ఉండటం రాష్ట్రానికి గొప్ప ప్రయోజనమని అన్నారు. పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చిన టీసీఎస్ ప్రతినిధులను ముఖ్యమంత్రి అభినందించారు. టీసీఎస్ ఈ నిర్ణయంతో తన కల నెరవేరిందని అభిప్రాయపడ్డారు. ఆశించిన విధంగా ఫ్యూచర్ సిటీ అభివృద్ధికి బలమైన పునాది పడిందన్నారు. ఈ భారీ పెట్టుబడి ద్వారా ఏఐ, డేటా సెంటర్ల రంగంతో పాటు విద్యుత్, కూలింగ్, నెట్వర్కింగ్, నిర్మాణం, ఇంజినీరింగ్, ఆపరేషన్స్ వంటి అనుబంధ రంగాల్లో కొత్త అవకాశాలు ఏర్పడనున్నాయని చెప్పారు. పర్యావరణానికి అనుకూలంగా గ్రీన్ ఎనర్జీ, వాటర్-న్యూట్రల్ డిజైన్‌తో ఈ క్యాంపస్‌ను అభివృద్ధి చేయనున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన చర్చలకు 2026 జనవరిలో దావోస్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, టాటా సన్స్ చైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ మధ్య జరిగిన సమావేశం నాంది పలికింది. అనంతరం ప్రభుత్వం టీసీఎస్ ప్రతినిధులతో పలుమార్లు చర్చలు జరిపి కొద్ది నెలల్లోనే ప్రాజెక్టును కార్యరూపంలోకి తీసుకొచ్చింది. దేశంలోని మరో ఐదు రాష్ట్రాల నుంచి పోటీ ఉన్నప్పటికీ తెలంగాణ ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టును సాధించింది. ఈ ప్రాజెక్టుతో హైదరాబాద్‌ను గ్లోబల్ ఏఐ, డేటా సెంటర్ హబ్‌గా తీర్చిదిద్దాలన్న ప్రభుత్వ లక్ష్యం మరింత చేరువైంది. మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ఎన్.ఉత్తమ్ కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, టీసీఎస్ సీఈఓవో కె.కృతివాసన్, సీవోవో ఆర్తి సుబ్రమణియన్, హైపర్‌వాల్ట్ ప్రెసిడెంట్ వి.రాజన్న, హైపర్‌వాల్ట్ సీఈవో, ఎండీ దీపేష్ నందా సమావేశంలో పాల్గొన్నారు. అమెరికా నుంచి ఒపెన్ ఏఐ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ ఉదయ్ రుద్రరాజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, ప్రభుత్వ సలహాదారు కె.రామకృష్ణారావు, ఇన్వెస్ట్ తెలంగాణ సీఈవో బి.అజిత్‌రెడ్డి, టీజీఐఐసీ ఎండీ కె.శశాంక, పరిశ్రమల శాఖ ప్రత్యేక కార్యదర్శి కృష్ణాదిత్య, డైరెక్టర్ ఆఫ్ ఇండస్ట్రీస్ నిఖిల్ చక్రవర్తి, ఇతర ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





