ఉద్యమకారుల సంక్షేమానికి సమగ్ర విధానాలు

–  తెలంగాణ ప్రభుత్వ ఉద్యమకారుల కమిటీ

హైదరాబా<, ప్రజాతంత్ర, జూలై 7 : : రాష్ట్ర సాధన కోసం పోరాడిన ఉద్యమకారుల గుర్తింపుతోపాటు వారి కుటుంబాలకు సామాజిక భద్రత, సంక్షేమ ప్రయోజనాలు కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉన్నతస్థాయి కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం సచివాలయం వద్ద అమరవీరుల జ్యోతి ప్రాంగణంలో కాకతీయ విశ్వవిద్యాలయం(కేయూ) విద్యార్థి ఉద్యమకారులతో విస్తృత Í్థయి సమావేశం నిర్వహించారు. సమావేశంలో రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి, ఉన్నతస్థాయి కమిటీ సభ్యుడు పొన్నం ప్రభాకర్, కమిటీ సభ్యులు ఎమ్మెల్సీలు ప్రొఫెసర్ ఎం.కోదండరాం, అద్దంకి దయాకర్, ఎస్. రాములు నాయక్, మోతే శోభన్ రెడ్డి తదితరులు పాల్గొని కేయూ విద్యార్థి ఉద్యమ నాయకులు, ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబ సభ్యులతో సుదీర్ఘంగా చర్చించారు. విద్యార్థి ఉద్యమకారులు పలు కీలక సూచనలు కమిటీ దృష్టికి తీసుకొచ్చారు. కేవలం ఉద్యమకారుల గుర్తింపు కార్డులు జారీ చేయడానికే పరిమితం కాకుండా ఉద్యమంలో భాగస్వాములైన వారి కుటుంబాలకు ఉపాధి అవకాశాలు, ఉన్నత విద్య, నాణ్యమైన వైద్య సేవలు, గృహ సౌకర్యాలు, పెన్షన్, ఆర్థిక భద్రత వంటి అంశాల్లో సమగ్ర సంక్షేమ విధానాలు అమలు చేయాలని కోరారు. తెలంగాణ సాధన కోసం చేసిన త్యాగాలకు తగిన గుర్తింపు, శాశ్వత సామాజిక భద్రత కల్పించే విధంగా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. మంత్రి పొన్నం మాట్లాడుతూ తెలంగాణ మలిదశ ఉద్యమంలో కాకతీయ, ఉస్మానియా విశ్వవిద్యాలయాల విద్యార్థుల పాత్ర చరిత్రాత్మకమైందని పేర్కొన్నారు. ఉద్యమకారులకు గుర్తింపు ఇవ్వడమే కాక వారి జీవితాల్లో సామాజిక, ఆర్థిక భద్రత కల్పించే సంక్షేమ సంస్కరణలను రూపొందించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని చెప్పారు. విద్యార్థి ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబ సభ్యులు అందించిన సూచనలు, ప్రతిపాదనలను సమగ్రంగా పరిశీలించి ఉన్నతస్థాయి కమిటీ నివేదికలో పొందుపరుస్తామని తెలిపారు. అనంతరం ఆ నివేదికను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి ఉద్యమకారుల కుటుంబాలకు అన్ని విధాలా న్యాయం జరిగేలా చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కాకతీయ విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థి ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబ సభ్యులు, వివిధ ఉద్యమ సంఘాల ప్రతినిధులు, సామాజిక కార్యకర్తలు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *