పంచాయతీల బలోపేతమే ప్రభుత్వ లక్ష్యం

– రేపటినుంచి సర్పంచులు, కార్యదర్శులు, అధికారులకు శిక్షణ
– పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రి సీతక్క

హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 7 : గ్రామ పంచాయతీలే గ్రామాభివృద్ధికి కేంద్ర బిందువని, గ్రామాల అవసరాలను గుర్తించి అన్ని శాఖల సమన్వయంతో సమగ్ర అభివృద్ధి ప్రణాళికలను రూపొందించి అమలు చేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క అధికారులను ఆదేశించారు. గ్రామస్థాయిలో అమలవుతున్న ప్రతి అభివృద్ధి కార్యక్రమం ప్రజలకు నేరుగా ప్రయోజనం చేకూర్చేలా ఉండాలని, ప్రభుత్వ నిధుల వినియోగంలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా అధికారులు, ప్రజాప్రతినిధులు పూర్తి అవగాహనతో పనిచేయాలన్నారు. గ్రామ పంచాయతీ సమగ్ర అభివృద్ధి ప్రణాళిక అమలు, జిల్లాస్థాయి అన్ని శాఖల హెచ్‌వోడీల మధ్య సమన్వయం, 16వ ఆర్థిక సంఘం నిధుల వినియోగం, నూతనంగా అమల్లోకి వచ్చిన వి.బి.జి. రామ్-జి చట్టం, తాగునీటి సరఫరా, గ్రామీణాభివృద్ధి కార్యక్రమాల అమలుపై మంత్రి సీతక్క వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా అదనపు కలెక్టర్లు(లోకల్ బాడీస్), ఇంజినీర్-ఇన్-చీఫ్‌లు, జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. పంచాయతీల పనితీరులో నాణ్యత పెరగాలంటే ముందుగా సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, ఇంజినీరింగ్ అధికారులు, ఇతర సంబంధిత శాఖల సిబ్బందికి నూతన నిబంధనలపై పూర్తిస్థాయి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. అందుకే ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ రూపొందించి బుధ, గురు, శుక్రవారాల్లో అన్ని జిల్లాల్లో భారీస్థాయిలో శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, ఇంజినీర్లు, సంబంధిత శాఖల అధికారులకు క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సమస్యలపై పూర్తిస్థాయి మార్గదర్శకాలు అందజేస్తామని చెప్పారు. 16వ ఆర్థిక సంఘం నిధుల వినియోగంలో కేంద్రం కఠిన నిబంధనలు అమలు చేస్తోందని మంత్రి పేర్కొన్నారు. ముఖ్యంగా టైడ్, అన్‌టైడ్ గ్రాంట్ల వినియోగానికి సంబంధించి కొత్త మార్గదర్శకాలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా అర్థం చేసుకోవాలన్నారు. నిబంధనలకు విరుద్ధంగా నిధులు ఖర్చు చేస్తే గ్రామ పంచాయతీలకు, అధికారులకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు. వి.బి.జి. రామ్-జి చట్టం అమలులో అనేక మార్పులు చోటుచేసుకున్నాయని, పనుల ఎంపిక, పరిపాలనా విధానం, అమలు ప్రక్రియ, నిధుల నిర్వహణ తదితర అంశాల్లో కొత్త నిబంధనలను ప్రతి అధికారి పూర్తిగా తెలుసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. తప్పిదాలు పునరావృతం కాకుండా ప్రతి అధికారి, ప్రతి సర్పంచ్, ప్రతి కార్యదర్శి పూర్తిస్థాయిలో శిక్షణ పొందాలని స్పష్టం చేశారు. కాన్ఫరెన్స్‌లో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి దాన కిశోర్, కమిషనర్ దివ్య దేవరాజన్, ప్రత్యేక కమిషనర్ శ్రీలక్ష్మి, ఇంజినీర్-ఇన్-చీఫ్‌లు, జిల్లా అదనపు కలెక్టర్లు (లోకల్ బాడీస్), సంబంధిత శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

తాగునీటి సమస్య తలెత్తనివ్వం

జలాశయాల నీటి నిల్వలపై రోజువారీ పర్యవేక్షణ, అవసరమైతే ప్రత్యామ్నాయ నీటి వనరుల వినియోగానికి మంత్రి సీతక్క ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర డ్రింకింగ్ వాటర్ సప్లయ్ కార్పొరేషన్ బోర్డు సమావేశం మంగళవారం జరిగింది. రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలకు తాగునీటి సరఫరా పరిస్థితి, జలాశయాల్లో నీటి నిల్వలు, రాబోయే నెలల్లో తాగునీటి అవసరాలపై సమగ్రంగా సమీక్షించారు. వర్షాలు ఆలస్యమైనా, వర్షపాతం తగ్గినా, ఎల్‌నినో ప్రభావం ఉన్నా రాష్ట్రంలో తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికతో అధికారులు పనిచేయాలని ఆదేశించారు. రాష్ట్రంలోని గ్రామీణ జనావాసాలకు ప్రధానంగా కృష్ణా, గోదావరి బేసిన్‌ల ఉపరితల జల వనరుల నుంచి శుద్ధి చేసిన నీటిని సరఫరా చేస్తున్నట్లు వివరించారు. 29 జలాశయాల నుంచి 123 నీటి శుద్ధి కేంద్రాల ద్వారా గ్రామీణ ప్రాంతాలకు నీరు సరఫరా అవుతున్న నేపథ్యంలో ప్రతి జలాశయంలో 45 రోజులు, 90 రోజులు, 180 రోజుల అవసరాలకు అనుగుణంగా నీటి లభ్యతపై మంత్రి సమీక్షించారు. నెలాఖరు వరకు తగిన నీటి ప్రవాహం లేకపోతే అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి ఉదయసముద్రానికి, తుపాకులగూడెం బ్యారేజ్ నుంచి దుమ్ముగూడెంకు నీటిని విడుదల చేసేలా ఇరిగేషన్ అధికారులతో సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు. ప్రస్తుతం సింగూర్‌లో నీటి నిల్వలు తక్కువగా ఉన్నందున రాబోయే 45 రోజుల్లో ఇందులోకి తగిన నీటి ప్రవాహం రాకపోతే సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి (పాక్షికంగా), నిజామాబాద్ (పాక్షికంగా) జిల్లాల్లోని గ్రామీణ జనావాసాలు, పట్టణ ఆధారిత నివాస ప్రాంతాల్లో తాగునీటి సమస్యలు తలెత్తే అవకాశం ఉందని అధికారులు వివరించారు. దీనిపై స్పందించిన మంత్రి ఆయా ప్రాంతాల్లో భూగర్భ జలాల ఆధారిత నీటి పథకాలను వినియోగించేలా తక్షణమే సమగ్ర కార్యాచరణ సిద్ధం చేయాలని ఆదేశించారు. అన్ని నివాస ప్రాంతాలకు స్థానిక మంచినీటి వనరులను వినియోగిస్తూ ప్రత్యామ్నాయ తాగునీటి సరఫరా వ్యవస్థను సిద్ధంగా ఉంచాలని సూచించారు. స్థానిక నీటి వనరులు అందుబాటులో లేని ప్రాంతాల్లో బోర్‌వెల్‌లను లోతుగా తవ్వడం, ఫ్లషింగ్ చేయడం, అవసరమైతే బోర్‌వెల్‌లను అద్దెకు తీసుకోవడం వంటి చర్యలకు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *