– కాళేశ్వరం రూపకల్పనే రూ.లక్షన్నర కోట్ల ఆర్థిక, విద్యుత్ భారానికి కారణం
– మేడిగడ్డ పునాదులు బలపడకుండానే నీరు నిల్వతోనే విపత్తు
– మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 7: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీ మేరకు అంబేద్కర్ ప్రాణహిత-చేవెళ్ల సుజల స్రవంతి(తుమ్మిడిహెట్టి) ప్రాజెక్టును తిరిగి గాడిలో పెడుతుందని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. సాంకేతికంగా లోపభూయిష్టమైన, ఆర్థికంగా భారమైన కాళేశ్వరం రూపకల్పనకు బదులు తక్కువ వ్యయంతో, తక్కువ విద్యుత్ వినియోగంతో, దీర్ఘకాలిక ప్రయోజనాలు అందించే అసలు ప్రాజెక్టును పునరుద్ధరిస్తామని ప్రకటించారు. ప్రజాభవన్‌లో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల సమక్షంలో కాళేశ్వరం ప్రాజెక్టు, మేడిగడ్డ బ్యారేజీ పరిస్థితి, పునరావాస కార్యాచరణపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అనంతరం మంత్రి మాట్లాడారు. మేడిగడ్డ పునాదులు నిర్మాణపరంగా దెబ్బతిన్నాయని, పూర్తిస్థాయి శాస్త్రీయ పునరుద్ధరణ పూర్తికాకుండానే నీటిని నిల్వ చేయడం ప్రజల ప్రాణాలు, ప్రభుత్వ ఆస్తులు, దిగువ ప్రాంతాల భద్రతతో చెలగాటమాడటమే అవుతుందని మంత్రి హెచ్చరించారు. ‘కాగ’ 2022 నివేదిక ప్రకారం కాళేశ్వరం ప్రాజెక్టు వ్యయం అప్పటికే రూ.1.27 లక్షల కోట్లను దాటిందని, ప్రస్తుతం మొత్తం పెట్టుబడి రూ.1.50 లక్షల కోట్లకు మించి ఉండే అవకాశముందని మంత్రి తెలిపారు. ఇంత భారీ ప్రజాధనాన్ని వెచ్చించిన ప్రాజెక్టు నేడు నిర్మాణ సంక్షోభంలో చిక్కుకోవడం అత్యంత దురదృష్టకరమన్నారు. అసలు తుమ్మిడిహెట్టికి సంవత్సరానికి సుమారు 3,466 మెగావాట్ల విద్యుత్ సరిపోతే కాళేశ్వరం కోసం దాదాపు 8,450 మెగావాట్ల విద్యుత్ అవసరమయ్యే విధంగా రూపకల్పన చేశారని చెప్పారు. ఒక తప్పు సాంకేతిక నిర్ణయం రాష్ట్రంపై శాశ్వత విద్యుత్ భారం మోపిందని వ్యాఖ్యానించారు. సీఏజీ నివేదికలోనే కాళేశ్వరం పంపులు అన్నీ ఒకేసారి పనిచేస్తే రాష్ట్ర మొత్తం విద్యుత్ వినియోగానికి సమానమైన విద్యుత్ అవసరమవుతుందని స్పష్టంగా పేర్కొన్న విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. ఇది ప్రభుత్వ విమర్శ కాదని, దేశ అత్యున్నత రాజ్యాంగబద్ధ ఆడిట్ సంస్థ చేసిన అధికారిక పరిశీలన అని చెప్పారు. తుమ్మిడిహెట్టి రూపకల్పనలో 72 కి.మీ మేర గురుత్వాకర్షణ (గ్రావిటీ) ద్వారా నీటి ప్రవాహం ఉండేదని, ఎల్లంపల్లి వద్ద కేవలం 19 మీటర్ల లిఫ్ట్‌తోనే లక్ష్యం సాధ్యమయ్యేదని వివరించారు. అసలు ప్రాణహిత-చేవెళ్లను వదిలి మేడిగడ్డకు మార్చిన నిర్ణయమే నీటిపారుదల చరిత్రలో అత్యంత ఖరీదైన పొరపాటు మారిందన్నారు. సుమారు రూ.38 వేల కోట్లతో పూర్తయ్యే ప్రాజెక్టు స్థానంలో రూ.లక్షన్నర కోట్లకు పైగా భారాన్ని మోపిన కాళేశ్వరం వచ్చిందన్నారు. ఫలితంగా ఉత్తర తెలంగాణ సాగునీటి ప్రయోజనాలు ఆలస్యమవడమే కాక రాష్ట్రంపై అపార ఆర్థిక, విద్యుత్ భారం పడిందని తెలిపారు. గత అయిదేళ్లలో మేడిగడ్డ ద్వారా 165 టీఎంసీల నీటిని ఎత్తిపోస్తే అందులో 63 టీఎంసీలను వరదల కారణంగా తిరిగి నదిలోకి వదలాల్సి వచ్చిందని, మరో 20 టీఎంసీల నీరు ఆవిరైపోయిందని వివరించారు. ఇది ప్రాజెక్టు రూపకల్పనలోని లోపాలకు నిదర్శనమన్నారు. ప్రస్తుతం కన్నెపల్లి పంప్‌హౌస్ ద్వారా మేడిగడ్డ నుంచి నీటిని ఎత్తిపోసే పరిస్థితి ఎందుకు లేదో బ్యారేజీల్లో తలెత్తిన నిర్మాణ సమస్యలు ఏమిటో, పునరుద్ధరణ ఎందుకు అనివార్యమో అధికారులు సాంకేతిక ఆధారాలతో వివరించినట్లు మంత్రి తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి త్వరలో తుమ్మిడిహెట్టి ప్రాంతాన్ని సందర్శించి పనులను వేగవంతం చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ ప్రకటించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




