– భూ వివాదాలకు శాశ్వత పరిష్కారమే లక్ష్యం
– వచ్చే ఏడాదిలోగా ప్రతి అంగుళం భూమిని సర్వే చేయాలని లక్ష్యం
– క్షేత్రస్థాయి సమస్యలను అధికారుల సమక్షంలోనే పరిష్కరిస్తాం
– రెవెన్యూ, హౌసింగ్ శాఖల మంత్రి పొంగులేటి
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 4 : ప్రధానంగా రైతుల ప్రయోజనాల కోసమే భూముల రీ సర్వే చేపడుతున్నామని, రైతుల భూ సమస్యల పరిష్కారానికి వారి సమక్షంలోనే రీ సర్వే జరగాలని రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. రీ సర్వే జరిగే గ్రామాల్లో ప్రతిరోజూ తహశీల్దార్లు పర్యటించాలని, ఆర్డీవో, అదనపు కలెక్టర్లు, కలెక్టర్లు నిరంతరం పర్యవేక్షించడమేగాక కనీసం వారానికోరోజు రీ సర్వే జరిగే గ్రామాలకు వెళ్లాలని స్పష్టం చేశారు. వచ్చే ఏడాదిలోగా రాష్ట్రవ్యాప్తంగా ప్రతి అంగుళం భూమిని సమగ్రంగా సర్వే చేసి భూ యజమానులకు పూర్తి భద్రతతో కూడిన వివాదరహిత భూములను అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. భూమి ఉన్న ప్రతి రైతుకు ఆధార్ కార్డు తరహాలో వారి భూమికి సంబంధించిన సమగ్ర, భద్రతతో కూడిన రికార్డులు, పాస్‌బుక్కులు అందించాలన్నది ప్రభుత్వ సంకల్పమని మంత్రి తెలిపారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సంబంధించి భూ సర్వే, రెవెన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, హౌసింగ్ అంశాలపై రంగారెడ్డి జిల్లా ఇన్చార్జి మంత్రి డి.శ్రీధర్‌బాబుతో కలిసి మేడ్చల్ మల్కాజ్గిరి కలెక్టరేట్లో బుధవారం సుదీర్ఘంగా సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ సమగ్ర భూ సర్వే కార్యక్రమాన్ని చట్టంలో నిర్దేశించిన విధంగా తొలుత రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో ఎంపిక చేసిన రెవెన్యూ గ్రామాల్లో మొదటి విడతగా వేగవంతంగా చేపట్టనున్నట్లు వెల్లడించారు. గతంలో హైదరాబాద్‌లో రాష్ట్రస్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించామని, ఈసారి నేరుగా జిల్లాలకు వచ్చి స్థానిక ప్రజాప్రతినిధులు, రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులు, క్షేత్రస్థాయి రెవెన్యూ అధికారులతో సమావేశమై సమస్యలను సమీక్షిస్తున్నట్లు చెప్పారు. మండలస్థాయి అధికారుల జాబితా నుంచి యాదృచ్ఛికంగా అధికారులను ఎంపిక చేసి ఆయా మండలాల్లో సర్వేకు సంబంధించిన అంశాలు, పెండింగ్ దరఖాస్తులు, ప్రజల నుంచి వస్తున్న అభ్యంతరాలు, క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న ఇబ్బందులపై నేరుగా చర్చిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు కోరుతున్న అంశాలు, అధికారులకు ఎదురవుతున్న సమస్యలు, పరిష్కారానికి అవసరమైన ప్రభుత్వ స్థాయి అనుమతులు, మార్గదర్శకాలపై సమస్యలను దాచిపెట్టకుండా స్పష్టంగా తెలియజేస్తే అక్కడికక్కడే సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. ఉద్దేశపూర్వకంగా సమస్యలను తప్పుదోవ పట్టించే లేదా ప్రజలను ఇబ్బందులకు గురిచేసే అధికారులపై తక్షణ చర్యలు ఉంటాయని హెచ్చరించారు. దాదాపు 125 ఏళ్ల క్రితం జరిగిన సర్వే తర్వాత రాష్ట్రంలో మరోసారి ఇంత విస్తృత స్థాయిలో సమగ్ర భూ సర్వే చేపడుతున్నామని మంత్రి పేర్కొన్నారు. ఈ సర్వే ద్వారా కేవలం భూముల కొలతలకే పరిమితం కాకుండా సర్వే నంబర్లు ఒకచోట ఉండటం, భూముల వాస్తవ స్వాధీన స్థితి మరోచోట ఉండటం వంటి సమస్యలకు కూడా శాశ్వత పరిష్కారం లభిస్తుందని వివరించారు. రెవెన్యూ, అటవీ శాఖల మధ్య సరిహద్దు వివాదాలు, పట్టా భూములకు సంబంధించిన సమస్యలు, భూముల హద్దులపై నెలకొన్న వివాదాలు వంటి అంశాలను కూడా సమగ్ర సర్వే ద్వారా గుర్తించి పరిష్కరించేందుకు అవకాశం ఉంటుందన్నారు. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమం విజయవంతం కావడానికి అధికారులు సమష్టిగా కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు. 22-ఎ కు సంబంధించి ఇప్పటివరకు ఇచ్చిన జీవోలు, మెమోలతో కవర్ కానీ అంశాలు ఏమైనా ఉంటే పరిశీలించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని మంత్రి పొంగులేటి అధికారులను ఆదేశించారు. సమావేశంలో ఎంపీ ఈటల రాజేందర్, ఎమ్మెల్యేలు కాలే యాదయ్య, మనోహర్ రెడ్డి, అరికెపూడి గాంధీ, బండారు లక్ష్మారెడ్డి, ఈర్లపల్లి శంకర్, మర్రి రాజశేఖర రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





