– మహేశ్వరం మెడికల్ కాలేజీకి 26 నెలలుగా ఏ బిల్లులూ కట్టని ప్రభుత్వం
– మూడేళ్లయినా భవనం ఎక్కడ కట్టాలో నిర్ణయించకపోవడమేంటి?
– మూడు రోజులుగా మెడికల్ విద్యార్థుల ధర్నా
– రాష్ట్ర చరిత్రలో అతి చెత్త ముఖ్యమంత్రి రేవంత్
– కలెక్టర్, డీఎంఈ తక్షణం విద్యార్థులకు హామీ ఇవ్వాలి
– రెండు నెలల్లోగా కాలేజీని మరో భవనానికి మార్చాలి
– మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్
మహేశ్వరం, ప్రజాతంత్ర, నవంబర్ 4: కాబోయే డాక్టర్లు చదువుకునే మహేశ్వరం ప్రభుత్వ మెడికల్ కాలేజీ పరిస్థితి చూస్తుంటే చాలా బాధ కలుగుతోంది.. మారుమూల ప్రాంతాల్లో ఉండే ప్రభుత్వ పాఠశాలలు కూడా ఇంత అధ్వాన్నంగా ఉండవవని మాజీ మంత్రి హరీష్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గం మంగళ్‌పల్లి వద్ద కనీస వసతులు లేవంటూ మూడు రోజులుగా ఆందోళన చేస్తున్న మహేశ్వరం ప్రభుత్వ మెడికల్ కాలేజీ విద్యార్థుల ధర్నా శిబిరాన్ని బుధవారం ఆయన సందర్శించారు. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి క్యామ మల్లేశ్ తో కలిసి విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, డీఎంఈ వాణీదేవిలతో ఫోన్లో మాట్లాడి విద్యార్థుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాడు కేసీఆర్ నాయకత్వంలో విద్యాశాఖ మంత్రిగా సబితా ఇంద్రారెడ్డి మన ఊరు – మన బడి కింద డిజిటల్ క్లాస్ రూమ్‌లు, డ్యూయల్ డెస్క్‌లు, ల్యాబ్స్, డైనింగ్ హాల్స్, హైజినిక్ వాష్‌రూమ్‌లతో ప్రభుత్వ బడులను అద్భుతంగా తీర్చిదిద్దారని గుర్తు చేశారు. కానీ నేడు హైదరాబాద్‌కు కూతవేటు దూరంలో ఉన్న ఈ ప్రతిష్టాత్మక ప్రభుత్వ మెడికల్ కాలేజీ పశువుల కొట్టం కంటే అధ్వాన్నంగా తయారైందని విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడితే విజన్ 2047, ఫ్యూచర్ సిటీ అని, తాను పక్క రాష్ట్రాలతో కాకుండా అమెరికా, చైనా, సింగపూర్‌లతో పోటీ పడుతున్నానని భారీ డైలాగులు కొడతాడు.. కానీ ఇక్కడ కాబోయే డాక్టర్ల దుస్థితి చూస్తుంటే బహుశా శ్రీలంక, నేపాల్‌లో కూడా ఇంత అధ్వాన పరిస్థితులు ఉండకపోవచ్చునన్నారు. సాక్షాత్తూ ఈ కాలేజీ బిల్డింగ్ ఓనర్ ప్రభుత్వానికి రాసిన లేఖే ప్రభుత్వ దివాలాకోరుతనానికి సాక్ష్యం అన్నారు. 2024 ఆగస్టు 1న భవనాన్ని తీసుకున్నప్పటి నుంచి అంటే 26 నెలలుగా వాటర్ బిల్లు కట్టలేదు, కరెంటు బిల్లు కట్టలేదు భవనం రెంట్ కట్టలేదని ఓనర్ లేఖ రాశారన్నారు. లక్ష కోట్లతో మూసీ సుందరీకరణ చేస్తా, లక్ష కోట్లతో ఫ్యూచర్ సిటీ కడతా, కొడంగల్‌కు 5 వేల కోట్లతో రేడియల్ రోడ్లు వేస్తా అంటున్న రేవంత్ రెడ్డికి మెడికల్ కాలేజీ పిల్లల వాటర్ బిల్లు, కరెంటు బిల్లు, రెంట్ కట్టడానికి పైసలు లేవా అని ప్రశ్నించారు. ప్రభుత్వం బిల్లులు కట్టకపోవడంతో ఓనర్ భవనాన్ని పట్టించుకోవడం మానేశాడన్నారు. ఫలితంగా పిల్లలకు నీళ్లు లేవు, వాష్‌రూమ్‌లు లేవు, కరెంటు వైర్లు వేలాడుతున్నాయి, ల్యాబ్స్, లైబ్రరీ, హాస్టల్ వసతి లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. థర్డ్ ఇయర్ పిల్లలు ఉన్న ఈ బిల్డింగ్‌కు ఇంతవరకు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ లేదు, ఫైర్ సేఫ్టీ క్లియరెన్స్ లేదు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు క్లియరెన్స్ లేదు, వాటర్ అండ్ ఎలక్ట్రిసిటీ మీటర్ లేదు, డ్రింకింగ్ వాటర్ ట్యాంక్ లేదు. కాలేజీ చుట్టూ చెత్తాచెదారం, స్క్రాప్, పాములు, కుక్కలు, పందులు, కోతులు ఉన్నాయని సాక్షాత్తూ కాలేజీ ప్రిన్సిపాలే ప్రభుత్వానికి లేఖ రాశారని తెలిపారు. ఒక చిన్న ప్రైవేట్ స్కూల్ పెట్టాలంటేనే ఫైర్ సేఫ్టీ, ఎన్ఓసీ, ఓసీ ఉన్నాయా అని చూస్తారు.. మరి ఏ అనుమతులూ లేకుండా, పాములు, పందుల మధ్య మూడేళ్ల నుంచి గవర్నమెంట్ మెడికల్ కాలేజీని ఎలా నడుపుతున్నారో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ సమాధానం చెప్పాలన్నారు. పిల్లల భవిష్యత్తు కోసమే విద్యాశాఖను తన వద్ద పెట్టుకున్నానని చెప్పుకునే రేవంత్ రెడ్డి ఎన్టీఆర్, చంద్రబాబు, వైఎస్సార్, కేసీఆర్ కంటే తానే బెస్ట్ సీఎం అని తనకు తానే సర్టిఫికెట్, సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్నాడని, సర్టిఫికెట్ ఇవ్వాల్సింది ప్రజలు.. ఈ విద్యాసంస్థల్లో చదువుకునే విద్యార్థులు ఇవ్వాలి అని వ్యాఖ్యానించారు. రాష్ట్ర చరిత్రలో వచ్చిన ముఖ్యమంత్రులందరిలోకెల్లా రేవంత్ రెడ్డి అత్యంత చెత్త ముఖ్యమంత్రి! సబితమ్మ మూసీ పర్యటనకు వెళ్తుందంటే, నేను టిమ్స్ ఆసుపత్రి పరిశీలనకు వెళ్తానంటే రాత్రే పసిగట్టి ఉదయం 6 గంటలకే మా ఇళ్ల ముందు వాలిపోయి హౌస్ అరెస్టులు చేసే ఇంటెలిజెన్స్.. హైదరాబాద్ పక్కనే మెడికల్ విద్యార్థులు మూడు రోజులుగా రోడ్డుపై ధర్నా చేస్తుంటే ఏం చేస్తోంది? విద్యార్థులు ఇప్పటికే జనవరిలో, ఆ తర్వాత రెండుసార్లు ధర్నా చేశారు. కలెక్టర్‌కు, ప్రిన్సిపాల్‌కు, డీఎంఈకి వినతిపత్రాలు ఇచ్చారు. తల్లిదండ్రులు స్వయంగా మంత్రి దామోదర్ రాజనరసింహను కలిశారు. అయినా మంత్రులకు, అధికారులకు ఈ పిల్లల గోడు పట్టదా? మెయిన్ రోడ్డు నుంచి కాలేజీ లోపలికి 2 కిలోమీటర్ల దూరం ఉంది. కనీసం రోడ్డు వసతి లేదు, లోపలికి బస్సు రానివ్వరు, సొంత వాహనాలను అనుమతించరు. బీఆర్ఎస్ హయాంలో ప్రతి మెడికల్, నర్సింగ్ కాలేజీకి ఉదయం ప్రాక్టికల్స్, మధ్యాహ్నం క్లాసుల కోసం సొంత బస్సు గానీ, అద్దె ఆర్టీసీ బస్సు గానీ తప్పనిసరిగా ఉండాలని నిబంధన పెట్టి అమలు చేశాం. గతంలో విద్యార్థులు నన్ను కలిసినప్పుడు నేను ప్రిన్సిపాల్, డీఎంఈ, హెల్త్ సెక్రటరీకి ఫోన్ చేసి చెబితే కొన్ని రోజులు బస్సు నడిపి మళ్లీ ఆపేశారు. కరోనా సమయంలో డాక్టర్ల ఆవశ్యకతను గుర్తించిన కేసీఆర్ ప్రతి జిల్లాకు ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఉండాలని సంకల్పించి 33 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశారు. స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి తెలంగాణ వచ్చే వరకు మన రాష్ట్రంలో 5 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, 2,850 ఎంబీబీఎస్ సీట్లు మాత్రమే ఉండేవి.. మన పిల్లలు మెడిసిన్ కోసం రష్యా, ఉక్రెయిన్, చైనా, నేపాల్ వెళ్లాల్సి వచ్చేది. కానీ కేసీఆర్ తొమ్మిదేళ్లలో ఎంబీబీఎస్ సీట్లను పది వేలకు పెంచారు.. పీజీ సీట్లను రెట్టింపు చేశార సూపర్ స్పెషాలిటీ సీట్లను మూడు రెట్లు పెంచారు. ప్రతి జిల్లాలో నర్సింగ్, పారామెడికల్, ఫార్మసీ కాలేజీలు పెట్టి హైదరాబాద్‌ను మెడికల్ హబ్‌గా మార్చారని హరీష్ రావు గుర్తు చేశారు. దేశంలో అత్యధికంగా ధాన్యం పండించే రాష్ట్రం తెలంగాణ అయితే ఏటా 11 వేల మంది డాక్టర్లను తయారు చేస్తూ దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉన్న రాష్ట్రం కూడా తెలంగాణే అన్నారు.
మహేశ్వరం మెడికల్ కాలేజీని 2022-23 లో మంజూరు చేసినప్పుడు సబితా ఇంద్రారెడ్డి హైవే పక్కన 25 ఎకరాల ప్రభుత్వ భూమిని ఇప్పించారు. కాలేజీ, హాస్టల్ భవనాల కోసం రూ. 182 కోట్లు కేసీఆర్ మంజూరు చేసి 400 పడకల ఆసుపత్రిని సాంక్షన్ చేసి శంకుస్థాపన కూడా చేశారు. సూర్యాపేట, నల్లగొండ, సిద్దిపేట, జగిత్యాల, వనపర్తి, వికారాబాద్, మహబూబ్‌నగర్ కాలేజీలను తాము రెండేళ్లలోనే అద్భుతంగా పూర్తి చేశాం. కానీ సబితా ఇంద్రారెడ్డికి పేరు వస్తుందనే అక్కసుతో కాంగ్రెస్ ప్రభుత్వం మహేశ్వరంలో కాలేజీ కట్టకుండా మార్చేసింది. ఈ మూడేళ్లలో మూడు ఇటుకలు కూడా పెట్టలేదు. తాను డీఎంఈ వాణీదేవితో ఫోన్లో మాట్లాడితే కాలేజీ భవనం ఎక్కడ కట్టాలో ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్తున్నారు. మూడేళ్లయినా స్థలం నిర్ణయించకపోవడం, టెండర్లు పిలవకపోవడం చూస్తుంటే ఈ ప్రభుత్వం గుడ్డెద్దు చేలో పడ్డట్టు వ్యవహరిస్తోందని స్పష్టమవుతోంద మూడు రోజులుగా విద్యార్థులు రోడ్డుపై ధర్నా చేస్తుంటే బాధ్యత తీసుకోని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, డీఎంఈ వాణీదేవి వెంటనే ఇక్కడికి వచ్చి విద్యార్థులతో మాట్లాడాలి. గరిష్టంగా రెండు నెలల గడువులోగా ఈ కాలేజీని వనస్థలిపురం, ఎల్బీ నగర్ టిమ్స్‌కు దగ్గరగా అన్ని వసతులున్న ప్రభుత్వ లేదా అద్దె భవనంలోకి మార్చాలి. ఈ మేరకు విద్యార్థులకు తక్షణమే రాతపూర్వక హామీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. కొత్త భవనంలోకి మార్చే వరకు తక్షణమే విద్యార్థులకు బస్సు సౌకర్యం, తాగునీరు, వాష్‌రూమ్‌ల వసతి కల్పించాలి.. కాలేజీ వరకు బస్సులను, విద్యార్థుల సొంత వాహనాలను వెంటనే అనుమతించాలి అని డిమాండ్ చేశారు. గతంలో 20 మంది విద్యార్థులు తనను, సబితను కలిసినప్పుడు ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు మీ దగ్గరికి వచ్చామన్నారు. మీ సమస్యకు శాశ్వత పరిష్కారం దొరికే వరకు, అన్ని వసతులున్న కొత్త భవనం, ల్యాబ్స్, లైబ్రరీ, హాస్టల్, బస్సు సౌకర్యం ఏర్పాటు చేసే వరకు నూ, సబితక్క, కిషన్ రెడ్డి అన్న, క్యామ మల్లేశ్ అన్న, యావత్ బీఆర్ఎస్ పార్టీ మీకు కొండంత అండగా ఉంటాం.విద్యార్థులెవరూ డిప్రెషన్‌కు లోనుకావద్దు, ధైర్యంగా ఉండి బాగా చదువుకోవాలి. మీరు చేస్తున్న పోరాటంతోనే మీకు కొత్త భవనం వస్తుంది. అవసరమైతే అసెంబ్లీలో గట్టిగా కొట్లాడి మీ సమస్యను పరిష్కరిస్తాం.. మీరు ఎంబీబీఎస్ పూర్తి చేసే నాటికి మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుంది.. అప్పుడు పీజీ, సూపర్ స్పెషాలిటీ సీట్లను ఇంకా పెంచి వైద్య రంగాన్ని మరింత ఉన్నతంగా తీర్చిదిద్దుతాం అని హరీష్ రావు చెప్పారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





