– వోటర్ల తిరిగి నమోదుపై ఈసీ వివరణకు సుప్రీంకోర్టులో అభ్యంతరం
– ఈనెల 19న ఫారం-6పై విచారణ
– దిల్లీలో 47.56 లక్షల నమోదులపై ప్రశ్నలు
– హైదరాబాద్‌లో వోటర్ల తొలగింపుపై పౌరసంఘాల ఆరోపణలు
– సీఈసీ రాజీనామా డిమాండ్ తో జిల్లాల్లో నిరసనలు
దిల్లీ, బెంగళూరు, ప్రజాతంత్ర ప్రత్యేక వార్త, నవంబర్ 4: ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్‌తో ఇండి కూటమి చేపట్టిన ఉద్యమం మరో దశకు చేరుకుంటున్నది. దిల్లీ రామ్‌లీలా మైదాన్‌లో 1 వ తేదీననిర్వహించిన భారీ సభకు కొనసాగింపుగా బెంగళూరులోని ఫ్రీడమ్ పార్క్‌లో రాష్ట్రస్థాయి నిరసన గురువారం నిర్వహించనున్నట్లు ఇండి కూటమి కర్ణాటక నాయకులు ప్రకటించారు. మరోవైపు, ఎస్ఐఆర్ ప్రక్రియలో వోటర్ల జాబితాల నుంచి తొలగించిన వ్యక్తులు తిరిగి నమోదు కావడానికి ఫారం–6 ఉపయోగించాలన్న ఎన్నికల సంఘం వివరణపై బుధవారం సుప్రీంకోర్టులో అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఈ వివాదాన్ని నవంబర్ 19న పరిశీలించనున్నట్లు న్యాయస్థానం తెలిపింది.
ఫ్రీడమ్ పార్క్‌లో నిరసన
బెంగళూరులో నిర్వహించిన సంయుక్త విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ నాయకుడు బీకే హరిప్రసాద్, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి కె.ప్రకాశ్, సీపీఐ, ఫార్వర్డ్ బ్లాక్, సీపీఐ(ఎంఎల్) నాయకులు నిరసన కార్యక్రమాన్ని ప్రకటించారు. ఎస్ఐఆర్ ప్రక్రియను రద్దుచేయడం, జ్ఞానేశ్ కుమార్ రాజీనామా, ఎన్నికల కమిషనర్ల నియామక ప్రక్రియలో మార్పులు తమ ప్రధాన డిమాండ్లని పేర్కొన్నారు. దిల్లీ సభతో ఉద్యమం ముగియలేదని, దేశవ్యాప్తంగా విస్తరించనున్నామని హరిప్రసాద్ తెలిపారు. కర్ణాటకలో మొదట రాష్ట్రస్థాయి కార్యక్రమం నిర్వహించి, తరువాత జిల్లాలు, తాలూకాల స్థాయికి తీసుకెళ్తామని ప్రకటించారు. ఎన్నికల సంఘం స్వతంత్రత దెబ్బతింటోందని, రాజ్యాంగ సంస్థలను అధికార పార్టీ రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగిస్తున్నారని ఆయన ఆరోపించారు.
ఫారం–6పై ఎన్నికల సంఘం కొత్త వివరణ
ఎస్ఐఆర్ కారణంగా వోటర్ల జాబితాల నుంచి పేర్లు తొలగిపోయినవారు తిరిగి నమోదు చేసుకోవడానికి ఫారం–6 దాఖలు చేయవొచ్చని ఎన్నికల సంఘం నవంబర్ 3న రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన ఎన్నికల అధికారులకు వివరణ పంపింది. గతంలో వోటరుగా నమోదైన వ్యక్తి పేరు ప్రస్తుతం జాబితాలో లేకపోతే ఫారం–6 ద్వారా తిరిగి చేర్పించుకోవచ్చని తెలిపింది. అలా దరఖాస్తు చేయడం వల్ల గతంలో వోటరుగా ఉన్న విషయాన్ని దాచిపెట్టినట్లు లేదా తప్పుడు ప్రకటన చేసినట్లు భావించరాదని స్పష్టం చేసింది. 1950 ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 31 కింద కేవలం గతంలో వోటరుగా నమోదై ఉన్న కారణంతోనే సంబంధిత వ్యక్తిపై చర్యలు తీసుకోరాదని ఎన్నికల నమోదు అధికారులకు సూచించింది. అయితే ఇతర నియోజకవర్గంలో వోటరుగా నమోదు కాకపోవడం వంటి చట్టపరమైన షరతులు వర్తిస్తాయని పేర్కొంది.
సుప్రీంకోర్టులో పిటిషనర్ల అభ్యంతరం
ఎన్నికల సంఘం తాజా వివరణను సవాలు చేస్తూ పిటిషనర్ల తరఫున న్యాయవాది ప్రశాంత్ భూషణ్ బుధవారం సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అంజలి భరద్వాజ్, అమృతా జోహ్రీ దాఖలు చేసిన పిటిషన్‌కు సంబంధించి ఆయన వాదనలు వినిపించారు. గతంలో వోటర్ల జాబితాలో ఉన్నవారిని కొత్త వోటర్ల మాదిరిగా ఫారం–6 దాఖలు చేయమనడం సరికాదని పిటిషనర్లు వాదిస్తున్నారు. ఇప్పటికే నమోదైనవారికి ఫారం–8 లేదా గతంలో సమర్పించలేకపోయిన ఎన్యూమరేషన్ ఫారాలను ఉపయోగించుకునే అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఈ అంశం న్యాయస్థానం పరిశీలనలో ఉందని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మౌఖికంగా వ్యాఖ్యానించారు. ఎన్నికల సంఘం నవంబర్ 3న ఇచ్చిన వివరణను అధికారిక దరఖాస్తు ద్వారా కోర్టు రికార్డులో చేర్చాలని పిటిషనర్లకు సూచించారు. ఈ వివాదంపై తదుపరి విచారణ ఈనెల 19న జరగనుంది.
దిల్లీలో 47.56 లక్షల నమోదులపై వివాదం
దిల్లీ ‘సర్’ ముసాయిదా వోటర్ల జాబితా నుంచి సుమారు 47.56 లక్షల నమోదులు మినహాయించడంపై వివాదం కొనసాగుతున్నది . పిటిషనర్ల వివరాల ప్రకారం వీటిలో సుమారు 31.59 లక్షల నమోదులను శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు తరలిపోయినవారిగా, 11.73 లక్షల నమోదులను గైర్హాజరు లేదా ఆచూకీ లేనివారిగా వర్గీకరించారు. ఈ వర్గీకరణలో పొరపాట్లు జరిగాయని పిటిషనర్లు ఆరోపిస్తున్నారు. ఈ నమోదుల్లో ఎంతమంది అర్హులైన వోటర్లున్నారు.. ఎంతమంది నిజంగా ఇతర ప్రాంతాలకు తరలిపోయారు.. ఎంతమంది మరణించారు, ఎన్ని పునరావృత నమోదులున్నాయన్నది పరిశీలించాల్సి ఉంది. ఈ అంశంలో ఎన్నికల సంఘం వివరణ, పిటిషనర్ల అభ్యంతరాలను సుప్రీంకోర్టు పరిశీలించనుంది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





