భూ దందాలపై సమగ్ర విచారణ జరపాలి

– కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 22 : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం భూదందాలు, సెటిల్‌మెంట్లకు పాల్పడుతోందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి ఆరోపించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శనివారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఆరఎస్ పాలనలోని ‘ధరణి’ని సముద్రంలో పడేస్తామని చెప్పిన కాంగ్రెస్ ‘భూభారతి’ పేరుతో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో సుమారు నాలుగు లక్షల ఎకరాల ప్రైవేటు భూములను 22ఏ నిషేధిత జాబితాలో చేర్చిందని ఆరోపించారు. ప్రభుత్వ, దేవాదాయ భూములు మాత్రమే ఉండాల్సిన 22ఎలోకి దశాబ్దాలుగా మున్సిపల్ అనుమతులు పొంది, పన్నులు కడుతూ నివాసముంటున్న ప్రైవేటు ఇళ్లు, స్థలాలను ఉద్దేశపూర్వకంగా చేర్చి సెటిల్‌మెంట్ల పేరిట 50% వాటాలు, భారీగా లంచాలు డిమాండ్ చేస్తున్నారని ఆరోపించారు. ఈ వ్యవహారంపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో సమగ్ర న్యాయ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. బాధిత ప్రజలకు మండలస్థాయి నుంచి హైకోర్టు వరకు బీజేపీ లీగల్ సెల్ ద్వారా ఉచిత న్యాయ సహాయం అందిస్తామని ప్రకటించారు. ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన కింద కేంద్రం 70 శాతానికి పైగా సబ్సిడీ, ధాన్యం కొనుగోలు, రవాణా, డీలర్ల కమీషన్ భరిస్తూ ఐదు కేజీల ఉచిత బియ్యం అందిస్తోందని తెలిపారు. దేశంలోని అన్ని రాష్ట్రాలు కేంద్ర లోగోను ముద్రిస్తుంటే తెలంగాణలో మాత్రం ప్రధాని మోదీ పేరు, భారత ప్రభుత్వ లోగో లేకుండా ముఖ్యమంత్రి, పౌరసరఫరాల శాఖ మంత్రి ఫోటోలు వేసుకోవడం సిగ్గుచేటన్నారు. కేంద్ర పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం తన పథకంగా ప్రచారం చేసుకోవడం మానుకోకపోతే ప్రత్యామ్నాయ మార్గాల్లో లబ్దిదారులకు బియ్యం అందించే అంశాన్ని పరిశీలిస్తామని హెచ్చరించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ గురించి మాట్లాడుతూ రాష్ట్రంలోని కాలేజీలకు చెల్లించాల్సిన సుమారు రూ.15 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కాలేజీలు మూతపడటంతోపాటు విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వకపోవడం వల్ల వారి ఉన్నత విద్య, ఉద్యోగావకాశాలు దెబ్బతింటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సెప్టెంబర్ 17న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలు దశాబ్దాలుగా ఈ ఉత్సవాలను అధికారికంగా జరుపుతుంటే తెలంగాణలో మాత్రం గత బీఆరఎస్, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాలు మజ్లిస్ పార్టీ భయంతో, ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే అధికారికంగా నిర్వహించకుండా చరిత్రను తొక్కిపెట్టాయని విమర్శించారు.

రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనల క్లియరెన్స్‌పై అసత్య ప్రచారాలు

ముఖ్యమంత్రులు లేదా మంత్రుల అధికారిక విదేశీ పర్యటనలకు విదేశాంగ మంత్రిత్వ శాఖ దౌత్య నిబంధనలు, అంతర్జాతీయ భద్రతా ప్రొటోకాల్స్ ప్రకారం నిర్ణయం తీసుకుంటుందని, ఇందులో రాజకీయ కక్షసాధింపులు ఉండవని స్పష్టం చేశారు. కాంగ్రెస్ హయాం నుంచే ఉన్న ఈ నిబంధనల ప్రకారం బీజేపీ మంత్రుల పర్యటనలకు కూడా పలుమార్లు అనుమతులు రాలేదని, దీన్ని రాజకీయం చేయడం తగదని హితవు పలికారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *