– రాహుల్ గాంధీకి హరీష్ రావు లేఖ
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 20: తెలంగాణలో 22-ఎ నిషేధిత జాబితా భూముల సెక్షన్ దుర్వినియోగం జరుగుతోందని బీఆర్ఎస్ నేత, అసెంబ్లీలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్ టి.హరీష్‌రావు ఆరోపించారు. ఈమేరకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి బహిరంగ లేఖ రాశారు. సెక్షన్ 22-ఎ నిషేధిత భూముల రిజిస్ట్రేషన్ ఆపడానికి తెచ్చిన చట్టం అని, ప్రైవేటు ఆస్తులపై కృత్రిమ వివాదాలు సృష్టించి వసూళ్లకు పాల్పడటానికి కాదని తెలిపారు. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ సహా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల్లో హెచఎండీఏ అనుమతులున్న వేలాది ప్రైవేటు ఆస్తులను ఏకపక్షంగా 22-ఎజాబితాలో పెడుతూ వేధింపులకు గురిచేస్తున్నారన్నారు. రెవెన్యూ శాఖలో 30 శాతం వసూళ్ల రాకెట్ నడుస్తోందని, నిషేధిత జాబితా నుంచి ఆస్తులు తొలగించడానికి దళారులు మార్కెట్ విలువలో ఏకంగా 30% కమీషన్లు డిమాండ్ చేస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. యాదాద్రి జిల్లాలో 40 వేల ఎకరాలను 22A లో పెట్టారని నాలుగు నెలల క్రితమే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్వయంగా చెప్పినా సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. ఓఆర్ఆర్ చుట్టుపక్కల భూములపై వివాదాలు సృష్టించి రాజకీయ పలుకుబడి ఉన్న బినామీ సంస్థలతో 50:50 జాయింట్ డెవలప్‌మెంట్‌కు ఇవ్వాలని యజమానులపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నారన్నారు. ఇంత కుంభకోణం జరుగుతున్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్యలు తీసుకోకపోవడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమన్నారు. 22-ఎపై తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని వెంటనే మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఫోరెన్సిక్ ఆడిట్ ద్వారా ఏ ఆస్తిని ఎవరు జాబితాలో చేర్చారు. ఎందుకు తొలగించారు.. మధ్యవర్తుల ప్రమేయం, ఆర్థిక లావాదేవీలపై తక్షణమే నిజాలు తేల్చాలని కోరారు. బినామీ సంస్థలను నడిపిస్తున్న రాజకీయ శక్తులు ఎవరో విచారణలో నిగ్గు తేల్చాలన్నారు. దశాబ్దాల క్రితమే అర్బన్ ల్యాండ్ సీలింగ్ కింద క్రమబద్ధీకరించిన ఆస్తులను, రిజిస్టర్డ్ డాక్యుమెంట్లు ఉన్న భూములను మళ్లీ 22-ఎలో పెట్టి స్తంభింపజేయడం దుర్మార్గమన్నారు. జిల్లాల వారీగా 22-ఎ జాబితాను పబ్లిక్ డొమైన్‌లో ఉంచాలన్నారు. ఏ భూమిని ఎప్పుడు చేర్చారు, ఎవరి ఆదేశంతో తీసేశారో ప్రజలకు పారదర్శకం గా తెలియాలని, ఎన్నికల ముందు కాంగ్రెస్ చెప్పిన భూమాత.. భూ రికార్డులకు స్పష్టతనివ్వాలి అన్నారు. ఒక అవినీతి మంత్రిని కాపాడుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని పణంగా పెడుతోందని విమర్శించారు. ఈ దోపిడీపై రాహుల్ గాంధీ వెంటనే జోక్యం చేసుకోకపోతే కాంగ్రెస్ మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. ఈ ఆరోపణలపై స్వతంత్ర విచారణకు ఆదేశించి రేవంత్ ప్రభుత్వం తన నిజాయతీని నిరూపించుకోవాలని, లేదంటే బాధితులకు న్యాయం జరిగే వరకు బీఆరఎస్ పోరాటం ఆగదని స్పష్టం చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు




