పురాతన ఆలయాల సంరక్షణకు కట్టుబడి ఉన్నాం

– గోదావరి పుష్కరాలను అద్భుతంగా నిర్వహిస్తాం
– ధర్మపురి నియోజకవర్గంలో రూ.200 కోట్లతో పుష్కరాల పనులు
– ఉగ్ర నరసింహుని ఆలయ పునర్నిర్మాణంలో పాల్గొనడం అదృష్టం
– ఉప ముఖ్యమంత్రి విక్రమార్క

ధర్మపురి, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 7 : రాష్ట్రంలోని పురాతన ఆలయాల సంరక్షణకు రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురిలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో ఉగ్ర నరసింహ స్వామి పునర్నిర్మాణ పనులకు సోమవారం తెల్లవారుజామున సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావులతో కలిసి భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ వేద పండితులు మంత్రులకు పూర్ణకుంభ స్వాగతం పలికారు. ముందుగా ఉగ్ర నరసింహ స్వామి ఆలయంలో ఉప ముఖ్యమంత్రితోపాటు మంత్రి లక్ష్మణ్ కుమార్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. 2.58 గంటలకు భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ తొమ్మిదేళ్ల బీఆరఎస్ పాలనకు చరమగీతం పాడిన ప్రజలు రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారని, ప్రజల ఆలోచనలకు అనుగుణంగా తాము పరిపాలన సాగిస్తున్నామని చెప్పారు. 2027లో నిర్వహించే గోదావరి పుష్కరాలను ప్రభుత్వం అద్భుతంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నదన్నారు. ఇందులో భాగంగా బాసర నుండి భద్రాచలం వరకు ఉన్న ప్రముఖ ఆలయాలను అభివృద్ధి చేయడంతోపాటు పుష్కరాలకు వచ్చే భక్తులకు మౌలిక సదుపాయాలు కల్పించడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. పుష్కరాల పనులు నిర్వహించడానికి బడ్జెట్లో రూ.వెయ్యి కోట్లు కేటాయించినట్లు ఉప ముఖ్యమంత్రి తెలిపారు. ఇప్పటికే ఉగ్ర శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధికి రూ.117 కోట్లు మంజూరు చేయగా స్థానిక ఎమ్మెల్యే, మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ విజ్ఞప్తి మేరకు రూ.80 కోట్లను అదనంగా మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ధర్మపురి, కోటిలింగాల క్షేత్రాల అభివృద్ధికి రూ.200కోట్లు కేటాయించినట్లు భట్టి తెలిపారు. వందల ఏళ్ల చరిత్ర కలిగిన ధర్మపురి ఉగ్ర నరసింహ స్వామి ఆలయ పునర్నిర్మాణ పనుల ప్రారంభానికి రావడం తన అదృష్టమని అన్నారు. వచ్చే పుష్కరాల నాటికి ఆలయ అభివృద్ధి పనులు పూర్తి చేస్తామని భట్టి వివరించారు.

పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన

ఈ సందర్భంగా ధర్మపురి మండలం తిమ్మాపూర్ గ్రామంలో నూతనంగా రూ.2.48 కోట్లతో ఏర్పాటు చేస్తున్న నూతన సబ్ స్టేషన్ పనులకు శంకుస్థాపన చేశారు. 2027 గోదావరి పుష్కరాలకు చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ధర్మపురి వద్ద గోదావరిలో పుష్కర ఘాట్ల నిర్మాణానికి రూ.22.16 కోట్లతో చేపట్టిన పనులకు శంకుస్థాపన చేశారు. ధర్మపురి, కోటి లింగాలలో రూ.58.55 కోట్లతో తొమ్మిది రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.

లక్ష్మీ నరసింహ స్వామి దయతో ముందుకు : మంత్రి అడ్లూరి

ధర్మపురి క్షేత్రంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి దయతో ముందుకు సాగుతున్నామని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ధర్మపురి ప్రజల ఆశీస్సులతో విజయం సాధించి నియోజకవర్గాన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నానని తెలిపారు.

అర్ధరాత్రి వేళ వెల్లువెత్తిన ఆప్యాయత 

ఉగ్ర నరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణ పనుల శంకుస్థాపనలో పాల్గొనేందుకు ఆదివారం అర్ధరాత్రి ధర్మపురికి చేరుకున్న ఉప ముఖ్యమంత్రికి కాంగ్రెస్ శ్రేణులు, స్థానిక ప్రజలు ఘన స్వాగతం పలికారు. అర్ధరాత్రి దాటిన సమయమైనప్పటికీ పార్టీ శ్రేణులు చూపిన ఆదరాభిమానాలు, కాంగ్రెస్ పార్టీ పట్ల వారి అకుంఠిత దీక్ష తనను ఎంతగానో కదిలించాయని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో గత పదేళ్ల పాలనలో ప్రజలు భయంభయంగా బతికారని, స్వేచ్ఛా స్వాతంత్య్రాలు కరవయ్యాయని గుర్తుచేశారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా, ప్రతి పైసా పేద ప్రజల సంక్షేమం కోసమే ఖర్చు చేసే ప్రజా ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకున్నారని అన్నారు. శంకుస్థాపన అనంతరం మంత్రి అడ్లూరి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయినా సంక్షేమ పథకాలను ఆపకుండా సమర్థవంతంగా అమలు చేస్తున్నామని భట్టి తెలిపారు. ఈ నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యతనిస్తున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా రూ.200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టామని, విద్యుత్ పోల్స్ షిఫ్టింగ్ కోసం ప్రత్యేకంగా రూ.6 కోట్లు మంజూరు చేసినట్లు గుర్తుచేశారు. అలాగే ఐటీఐ, డిగ్రీ కళాశాలలు, అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ల ఏర్పాటుతోపాటు నియోజకవర్గంలో విద్య, వైద్య రంగానికి పెద్దపీట వేస్తున్నామన్నారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. త్వరలోనే ఈ నియోజకవర్గంలోనూ స్కూళ్లలో బ్రేక్ ఫాస్ట్ పథకం ప్రారంభం కానుందన్నారు. అంతేకాక పేద కుటుంబాలకు అండగా నిలిచేందుకు కొత్తగా ‘ఇందిరమ్మ బీమా యోజన’ను అమలు చేస్తున్నట్లు వెల్లడించారు.
ప్రతిపక్షాల విమర్శలపై నిలదీయండి
ధనిక రాష్ట్రాన్ని అప్పజెప్పినా గత పదేళ్లలో బీఆ ర్‌ఎస్ ప్రభుత్వం పేదలకు ఇళ్లు, సరైన సంక్షేమం ఎందుకు అందించలేదని డిప్యూటీ సీఎం ప్రశ్నించారు. నేడు రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల అభివృద్ధికి కృషి చేస్తుంటే రోడ్డెక్కి విమర్శలు చేస్తున్న నాయకులను ప్రజలు నిలదీయాలని పిలుపునిచ్చారు. ప్రపంచంతో పోటీపడే స్థాయికి రాష్ట్రాన్ని తీసుకెళ్లాలనేదే ప్రభుత్వ లక్ష్యమని, ఈ ప్రగతిని ప్రతి ఇంటికీ తీసుకెళ్లే బాధ్యత పార్టీ శ్రేణులపై ఉందని స్పష్టం చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *