- ఆరుగురి దుర్మరణం, 14 మందికి తీవ్ర గాయాలు
- ప్రయాణికులు నిద్రపోతున్న వేళ కబళించిన మృత్యువు
- హైదరాబాద్-విజయవాడ హైవేపై ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ప్రైవేట్ బస్సు
- హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై దోరకుంట వద్ద దుర్ఘటన
- కోదాడ ప్రభుత్వ హాస్పిటల్‌కు క్షతగాత్రుల తరలింపు
Kodada Bus Accident | సూర్యాపేట, ఆగస్ట్ 26: కంటినిండా నిద్రపోతున్న వేళ.. ఇక కొద్దిసేపట్లో గమ్యస్థానానికి చేరుకుంటామనుకున్న క్షణాన మృత్యువు ఊహించని రూపంలో విరుచుకుపడింది. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం దోరకుంట వద్ద హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం పలు కుటుంబాల్లో తీరని శోకాన్ని నింపింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కోదాడ సమీపంలోని దోరకుంట వద్ద మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఒక ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది ఈ ఘోర ప్రమాదంలో ఆరుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు.
మృతుల్లో ఎన్టీఆర్ జిల్లా ఎ-కొండూరు మండలం పుల్లూరు గ్రామానికి చెందిన యాసరపు చిన్ని, విజయవాడకు చెందిన మేరీ జోస్న (29), పడమటి లంక నివాసి కేశవుల నాగేంద్రబాబు, ఆటోనగర్‌కు చెందిన సూరారపు షకీనా ఉన్నారు. మరో ఇద్దరి వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు వెల్లడించారు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 42 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ఈ ప్రమాదంలో గాయపడిన చందన, భవాని, యశ్వంత్, విటల్, మనోహర్, అనిల్ కుమార్, ధ్రువ, జయసింగ్ కుమార్, విజయలక్ష్మి, రమణమ్మ, సుధాకర్, నవీన్ కుమార్, అవినాష్, వంశీలను వెంటనే కోదాడ ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ప్రమాదం జరిగిన వెంటనే బస్సులోని ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు, అత్యవసర సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. బస్సులో చిక్కుకున్న క్షతగాత్రులను బయటకు తీసి చికిత్స నిమిత్తం సమీప హాస్పిటల్స్కు తరలించారు. కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తంది.ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.




