– సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి ఆదేశాలు
– జీ9 బొగ్గు లేకనే యాదాద్రిలో పూర్తిస్థాయి ఉత్పత్తి లేదు
– విద్యుత్ శాఖపై ఎంసీఆర్ హెచఆర్డీలో సమీక్ష
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 23 : రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న విద్యుత్ అవసరాల దృష్ట్యా మహానది కోల్ ఫీల్డ్స్, కోల్ ఇండియా నుంచి బొగ్గు కొనుగోలుకు చర్యలు ప్రారంభించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కలు అధికారులను ఆదేశించారు. విద్యుత్ శాఖపై ఎంసీఆర్ హెచఆర్డీలో బుధవారం సమీక్ష నిర్వహించారు. యాదాద్రి థర్మల్ కేంద్రంలో పూర్తిస్థాయి విద్యుత్ ఉత్పత్తి చేయకపోవడంపై అధికారులను సీఎం, డిప్యూటీ సీఎంలు ప్రశ్నించారు. ఈ విద్యుత్ కేంద్రంలో ఉత్పత్తికి జీ9 బొగ్గు అవసరమని, సింగరేణిలో జీ9 బొగ్గు ఉత్పత్తి చేసే బ్లాకులు లేవని, సమీప భవిష్యత్తులోనూ సింగరేణి నుంచి జీ9 బొగ్గు ఉత్పత్తి అయ్యే అవకాశం లేదని అధికారులు తెలిపారు. జీ9 బొగ్గు లభ్యత లేనప్పుడు ఆ సాంకేతికతతో యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని ఎలా నిర్మించారని రేవంత్, భట్టి ప్రశ్నించారు. పిట్ హెడ్ (బొగ్గు గనులపైనే విద్యుత్ కేంద్ర నిర్మాణం) కాకుండా దూరంగా ఎందుకు యాదాద్రి థర్మల్ కేంద్రం నిర్మించారని, దానికి బొగ్గు సరఫరాతో రాష్ట్రంపై పడే అదనపు భారం ఎంత అని అధికారులను అడిగారు. ఆనాడు రాజకీయ కారణాలతోనే పిట్ హెడ్‌పై కాకుండా దూరంగా యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం నిర్మించారంటూ యాదాద్రికి బొగ్గు సరఫరాతో రాష్ట్రంపై రూ.40 వేల కోట్ల అదనపు భారం పడుతోందని అధికారులు సమాధానమిచ్చారు. సింగరేణి నుంచి జీ9 బొగ్గుకు ఉన్న అవకాశాలపై ఆరా తీయగా గత ప్రభుత్వం బొగ్గు బ్లాకుల వేలంలో పాల్గొనకపోవడంతో జీ9 బొగ్గును సింగరేణి సరఫరా చేయలేదని అధికారులు తేల్చిచెప్పారు. సింగరేణిలో ఇప్పటికే 14 బొగ్గు బ్లాకులు మూతపడ్డాయని తెలిపారు. తక్షణమే కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డితో చర్చించాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. దసరా లోపు యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం పూర్తిస్థాయిలో ఉత్పత్తి చేయాలని సీఎం రేవంత్ ఆదేశించారు. ఎంపీ వేం నరేందర్ రెడ్డి, ముఖ్యమంత్రి సలహాదారు కె.రామకృష్ణారావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, విద్యుత్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నవీన్ మిట్టల్, సింగరేణి సీఎండీ జ్యోతి బుద్ధ ప్రకాష్, ట్రాన్స్‌కో సీఎండీ డి.కృష్ణభాస్కర్, టీజీఆర్‌పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ అలీ, జెన్‌కో సీఎండీ ఎస్.హరీష్, టీజీఎస్‌పీడీసీఎల్ సీఎండీ జితేష్ వి.పాటిల్, టీజీఎన్‌పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి, ఎస్‌సీసీఎల్ డైరెక్టర్ (పీడబ్ల్యూ&ఏ) పి.గౌతమ్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





