– ప్రతి ఒక్కరూ ఆయుర్వేద జీవనశైలిని అలవర్చుకోవాలి
– ‘ఆయుష్’ ఏర్పాటుతో ప్రాచీన వైద్యానికి పూర్వవైభవం
– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 23 : భారతీయ సనాతన విజ్ఞాన సంపద అయిన ఆయుర్వేదాన్ని, సంప్రదాయ వైద్య పద్ధతులను ప్రతి ఒక్కరూ గౌరవించి తమ నిత్య జీవితంలో అలవర్చుకోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు పిలుపునిచ్చారు. 11వ ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం భారతీయ సంప్రదాయ వైద్య విధానాలకు పూర్వవైభవం తీసుకువచ్చేందుకు ‘ఆయుష్’ విభాగాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిందని రామచందర్ రావు తెలిపారు. నేడు ఆయుష్ రంగంలో చికిత్సలతోపాటు పరిశోధనలకు కూడా భారీ ఎత్తున నిధులు కేటాయిస్తూ ప్రోత్సహిస్తున్నారని చెప్పారు. మహర్షి పతంజలి అందించిన యోగా నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవంగా మారి ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందుతోందన్నారు. ఇటీవల తాను ఐర్లాండ్‌లోని ‘యూనివర్సిటీ ఆఫ్ లిమరిక్’ సందర్శించినప్పుడు అక్కడి అధ్యాపకులు సైతం యోగా ద్వారా తమ దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలను అధిగమించామని చెప్పడం భారతీయ విజ్ఞానానికి దక్కిన అంతర్జాతీయ గుర్తింపునకు నిదర్శనమని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయ రాయబార కార్యాలయాల ద్వారా కూడా యోగా తరగతులు నిర్వహిస్తుండటం మనందరికీ గర్వకారణమన్నారు. ఏ వైద్య విధానం కూడా మరొకదానికంటే తక్కువ కాదని, అన్ని వైద్య పద్ధతులకు వాటిదైన ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుందని ఆయన అన్నారు.
ముందస్తు నివారణా వైద్యంగా ఆయుర్వేదం
ఆరోగ్యమే మహాభాగ్యం అని గుర్తు చేస్తూ వ్యాధులు వచ్చాక చికిత్స తీసుకోవడం కంటే వ్యాధులు రాకుండా చూసుకునే నివారణా వైద్యంగా ఆయుర్వేదం విశిష్టమైన పాత్ర పోషిస్తుందని రామచందర్ స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో ప్రజాదరణ పొందిన జిందా తిలిస్మాత్ మొదలుకొని, కరోనా మహమ్మారి సమయంలో అల్లోపతి వైద్యులు సైతం ఆయుర్వేద కషాయాన్ని సిఫారసు చేయడం వరకు భారతీయ వైద్యం తన శక్తిని నిరూపించుకుంటూనే ఉందన్నారు. పురాతన భారతదేశంలోనే శస్త్రచికిత్సలు, అవయవ మార్పిడి మూలాలు ఉన్నాయని, అయితే గతంలో బ్రిటిష్, మొఘల్ పాలకుల కాలంలో మన దేశీయ జ్ఞానం తీవ్ర నిర్లక్ష్యానికి గురైందని ఆవేదన వ్యక్తం చేశారు. భావి తరాల వైద్య విద్యార్థులు భారతీయ వైద్య విజ్ఞానాన్ని మరింత ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లాలని ఆయన ఆకాంక్షించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





