– శుక్రవారం గన్‌పార్క్‌లో అభ్యర్థిత్వ ప్రకటన కార్యక్రమం
– అధిక సంఖ్యలో తరలిరావాలని పట్టభద్రులకు పిలుపు
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 5: నల్గొండ–ఖమ్మం–వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో డాక్టర్ నలమాస కృష్ణ స్వతంత్ర అభ్యర్థిత్వానికి కాకతీయ యూనివర్సిటీలోని పలు విద్యార్థి సంఘాలు తమ సంపూర్ణ మద్దతును ప్రకటించాయి. ఈ మేరకు విద్యార్థి సంఘాల ప్రతినిధులు హైదరాబాద్‌లో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో తమ సంఘీభావాన్ని ప్రకటించారు. రాష్ట్ర సాధన ఉద్యమంలో విద్యార్థులు కీలక పాత్ర పోషించారని, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా నిరుద్యోగం, ఉద్యోగ నియామకాల్లో జాప్యం, ప్రభుత్వ విద్యారంగ సమస్యలు, విశ్వవిద్యాలయాల అభివృద్ధి, సామాజిక న్యాయం వంటి అంశాలు పట్టభద్రులను ప్రభావితం చేస్తున్నాయని ప్రతినిధులు పేర్కొన్నారు. పట్టభద్రుల సమస్యలను శాసనమండలిలో బలంగా వినిపించడంతో పాటు ప్రజాస్వామిక విలువలు, సామాజిక న్యాయం, నిరుద్యోగ యువత ఆకాంక్షలకు ప్రాతినిధ్యం వహించాలనే లక్ష్యంతో డాక్టర్ నలమాస ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో నిలవడాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపారు. ఆయన అభ్యర్థిత్వానికి తమ సంఘాల తరఫున సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు వెల్లడించారు. హైదరాబాద్‌లోని గన్‌పార్క్ వద్ద ఆయన అభ్యర్థిత్వ ప్రకటన కార్యక్రమం శుక్రవారం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఉమ్మడి జిల్లాల పరిధిలోని పట్టభద్రులు, నిరుద్యోగ యువత, ఉద్యోగులు, తెలంగాణ ఉద్యమకారులు, మేధావులు, ప్రజాస్వామికవాదులు, వివిధ ప్రజా సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విద్యార్థి సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. పట్టభద్రుల సమస్యలు, నిరుద్యోగ యువత ఆకాంక్షలు, విద్యారంగ సమస్యలు, సామాజిక న్యాయం వంటి అంశాలపై విస్తృత ప్రజాస్వామిక చర్చకు ఈ కార్యక్రమం వేదిక కావాలని వారు ఆకాంక్షించారు. పట్టభద్రుల గొంతుకను వినిపించే ప్రజాస్వామిక ప్రయత్నంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని విద్యార్థి సంఘాల ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. విద్యార్థి సంఘాల ప్రతినిధులు ఇప్ప పృథ్వి రెడ్డి, ఉస్మానియా వర్సిటీ జేఏసీ పనికేర మోహన్ రాజ్, కాకతీయ యూనివర్సిటీ జేఏసీ కొమ్మరాజుల రాజు, విద్యార్థి ఉద్యమకారుడు,కంటెస్టెడ్ కార్పొరేటర్(49 డివిజన్) అనిల్, అడ్వకేట్ దామెర రవీందర్, విద్యార్థి ఉద్యమకారుడు స్వామి, పీడీఎస్ యు నవకిరణ్, అంబెడ్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్ శివ, డెమెక్రటిక్ స్టూడెంట్స్ అసొసియేషన్ భరత్, తెలంగాణ స్టూడెంట్స్ ఫోరమ్ నందు, ఆదివాసీ స్టూడెంట్స్ అసోసియేషన్ మనోహర్ – బీఎస్ఎఫ్ లు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





