తుమ్మిడిహెట్టిపై మహారాష్ట్ర సీఎం సానుకూల స్పందన

– ముంబైలో ఫడ్నవీస్‌తో సీఎం రేవంత్ బృందం భేటీ
– బ్యారేజీ ఎత్తు 152 మీటర్లకు పెంచాల‌న్న‌ ప్రతిపాదనపై చర్చలు
– తమకు ప్రతికూల ప్రభావం లేకపోతే గత ఒప్పందాన్ని పున:పరిశీలించేందుకు సిద్ధం: ఫడ్నవీస్
– ఆదిలాబాద్ గిరిజనుల, ఆదివాసీల చిరకాల ఆకాంక్షలను వివరించిన సీఎం రేవంత్
– 152 మీటర్ల ఎత్తు ఎందుకు అవసరమో వివరించిన మంత్రి ఉత్తమ్
– రెండు రాష్ట్రాల అధికారుల కమిటీ ఏర్పాటుకు ఫడ్నవీస్ ప్రతిపాదన
– బ్యారేజీ ఎత్తు, నీటి లభ్యత, ముంపు ప్రభావం, సాంకేతిక అంశాలపై అధ్యయనం

ముంబై, అక్టోబర్ 26 : ముంబైలోని సహ్యాద్రి స్టేట్ గెస్ట్ హౌస్‌లో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌తో సీఎం ఎ.రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ బృందం సమావేశమైంది. తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దుల్లో ప్రాణహిత నదిపై తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణంపై కీలక చర్చలు జరిగాయి. బ్యారేజీ ఎత్తు పెంపు, నీటి లభ్యత, ముంపు ప్రభావం, ఇతర సాంకేతిక అంశాలపై చర్చించారు. ఈ భేటీలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి,మ రెండు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సమావేశం ప్రారంభంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తూ తుమ్మిడిహెట్టి ప్రాధాన్యాన్ని వివరించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా చరిత్ర, సంస్కృతి, గిరిజనుల జీవన పరిస్థితులు, ఆర్థిక వెనుకబాటుతనాన్ని మహారాష్ట్ర బృందం దృష్టికి తీసుకెళ్లారు. సుసంపన్నమైన చరిత్ర, సాంస్కృతిక వారసత్వం ఉన్నప్పటికీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధిలో వెనుకబడిపోయిందని తెలిపారు. గిరిజనులు, ఆదివాసీలకు అభివృద్ధి ఫలాలు అందలేదన్నారు. ఆర్థిక అవకాశాలు లేకపోవడం, వెనుకబాటుతనం కారణంగా గతంలో నక్సలిజం వంటి సమస్యలు తలెత్తిన పరిస్థితులను వివరించారు. ఆ ప్రాంతానికి సాగునీరు అందించేందుకు 1975 అక్టోబర్ 6న అప్పటి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు జలగం వెంగళరావు, ఎస్బీ చవాన్ మధ్య కుదిరిన ఒప్పందం నుంచి వివిధ దశల్లో ప్రయత్నాలు సాగుతున్నాయన్నారు. ఐదు దశాబ్దాలుగా అనేక ప్రతిపాదనలు, చర్చలు జరిగాయని గుర్తు చేశారు. అయినా ఆశించిన పురోగతి సాధించలేకపోయామన్నారు. బ్యారేజీ ఎత్తును 148 మీటర్లుగా నిర్ణయిస్తూ 2016లో ఒప్పందం కుదిరిందని గుర్తు చేస్తూ ఈ ఎత్తుతో బ్యారేజీ నిర్మిస్తే తెలంగాణ ప్రాంత తాగు, సాగునీటి అవసరాలు పూర్తిస్థాయిలో తీరవని మంత్రి ఉత్తమ్ వివరించారు. ప్రస్తుత విద్యుత్ అవసరాలు, ఇంధన వ్యయం, పర్యావరణ పరిరక్షణ, వాతావరణ మార్పులను పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. ప్రాజెక్టు నిర్వహణ వ్యయం కూడా ముఖ్యమైన అంశమంటూ గ్రావిటీ ద్వారా నీటిని తరలించే అవకాశాలకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరాన్ని తెలియజేశారు. ఈ పరిస్థితుల్లో బ్యారేజీని 152 మీటర్ల ఎత్తుతో నిర్మించడమే అత్యంత ప్రయోజనకరమైన ప్రత్యామ్నాయమని వివరించారు. సాంకేతిక, నిర్వహణ, ఆర్థిక అంశాలపరంగా ఈ ప్రతిపాదనకు ఉన్న ప్రాధాన్యాన్ని ప్రజెంటేషన్‌లో వివరించారు. బ్యారేజీ నిర్మాణంతో మహారాష్ట్రలో ముంపునకు గురయ్యే వ్యవసాయ భూములకు పరిహారం చెల్లించేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి ఉత్తమ్ స్పష్టం చేశారు. మహారాష్ట్రలో అమల్లో ఉన్న భూసేకరణ నిబంధనలు, ఆ రాష్ట్ర పరిహార విధానం ప్రకారం రైతులకు పరిహారం చెల్లిస్తామని తెలిపారు.

రెండు రాష్ట్రాల మధ్య చారిత్రక అనుబంధం : సీఎం రేవంత్

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రెండు రాష్ట్రాల మధ్య ఉన్న చారిత్రక, సాంస్కృతిక సంబంధాలను గుర్తు చేశారు. పూర్వ హైదరాబాద్ సంస్థానంతో రెండు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాలకు ఉన్న చారిత్రక అనుబంధాన్ని ప్రస్తావించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రధానంగా వెనుకబడిన అటవీ ప్రాంతమంటూ అక్కడి గిరిజనులు, ఆదివాసీలు ఎదుర్కొంటున్న సమస్యలను ఫడ్నవీస్ దృష్టికి తీసుకెళ్లారు. కొమురం భీమ్ సాగించిన జల్, జంగిల్, జమీన్ పోరాటాన్ని గుర్తు చేశారు. నాటినుంచి ఆదిలాబాద్ ప్రాంత ప్రజలు సాగు, తాగునీటి సదుపాయాల కోసం ఎదురుచూస్తున్నా దశాబ్దాలుగా వారి ఆకాంక్షలు నెరవేరలేదని వివరించారు. ఆదిలాబాద్ గిరిజనులు, ఆదివాసీల జీవితాల్లో వెలుగులు నింపాల్సిన అవసరం ఉందన్నారు. వెనుకబడిన ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు రెండు రాష్ట్రాలు కలిసికట్టుగా ముందుకు వెళ్లాలని కోరారు.

సరిహద్దు ప్రాంతాలకూ ప్రయోజనం

దేశ రక్షణ, జాతీయ వ్యూహాత్మక ప్రయోజనాలపరంగా ఆదిలాబాద్ ప్రాంతానికి ఉన్న ప్రాధాన్యాన్ని సీఎం ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆదిలాబాద్‌లో ప్రతిపాదిత రక్షణ, పౌర విమానాశ్రయ సదుపాయం అందుబాటులోకి వస్తే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధికి ఊతమిస్తుందని తెలిపారు. మహారాష్ట్రలోని సరిహద్దు ప్రాంతాలకూ ప్రయోజనం కలుగుతుందని వివరించారు. విమానాశ్రయంతో రెండు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల్లో రవాణా సదుపాయాలతో పాటు ఆర్థిక కార్యకలాపాలు, అభివృద్ధి అవకాశాలు మెరుగుపడుతాయన్నారు. తుమ్మిడిహెట్టి బ్యారేజీ సాగునీటి ప్రాజెక్టు మాత్రమే కాదని, రెండు రాష్ట్రాలను భౌతికంగా అనుసంధానించే వారధిగా కూడా నిలుస్తుందని అన్నారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి, గిరిజనుల సంక్షేమానికి రెండు రాష్ట్రాల సహకారం అవసరమన్నారు. పరస్పర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని తుమ్మిడిహెట్టి నిర్మాణానికి సహకరించాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రిని కోరారు.

ఫడ్నవీస్ సానుకూల స్పందన 

తెలంగాణ ప్రతిపాదనపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సానుకూలంగా స్పందించారు. తెలంగాణతో తనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని గుర్తు చేశారు. సరిహద్దులోని ఆదిలాబాద్ ప్రాంతంతో ప్రత్యేక అనుబంధం ఉందన్నారు. తన అమ్మమ్మ తెలుగు మాట్లాడతారని ఈ సందర్భంగా ప్రస్తావించారు. తుమ్మిడిహెట్టి బ్యారేజీ ఎత్తును పెంచాలన్న తెలంగాణ అభ్యర్థనను మరోసారి పరిశీలించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. అయితే తుది నిర్ణయానికి వచ్చే ముందు పలు అంశాలపై అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందన్నారు. సాంకేతిక, పర్యావరణ, పరిపాలనాపరమైన అంశాలను పరిశీలించాలని స్పష్టం చేశారు.
మహారాష్ట్రకు, తమ ప్రజలకు ఎలాంటి ప్రతికూల ప్రభావం లేకపోతే 148 మీటర్ల ఎత్తు ఒప్పందాన్ని పున:పరిశీలించేందుకు అభ్యంతరం లేదన్నారు. తెలంగాణ నీటి అవసరాలకు సహకరించేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ఫడ్నవీస్ స్పష్టం చేశారు. జాతీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ముందుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. స్నేహభావం, సోదరభావంతో మంచి పొరుగు రాష్ట్రాలుగా ముందుకు వెళ్లాలని అభిప్రాయపడ్డారు. గతంలో ఇతర రాష్ట్రాలతో మహారాష్ట్ర పలు అంతర్రాష్ట్ర సమస్యలను పరిష్కరించుకుందని గుర్తుచేశారు. పరస్పర చర్చలు, సహకారంతో ఆయా సమస్యలకు పరిష్కారం కనుగొన్నామని వివరించారు. తుమ్మిడిహెట్టి విషయంలో కేంద్ర జల సంఘం తన పరిధిలో అవసరమైన అధ్యయనాలు చేపడుతుందని తెలిపారు. సాంకేతిక పరిశీలనలు కొనసాగిస్తుందన్నారు. ఈలోపు రెండు రాష్ట్రాల నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శుల నేతృత్వంలో అధికారుల కమిటీ ఏర్పాటు చేయాలని ఫడ్నవీస్ ప్రతిపాదించారు. బ్యారేజీ ఎత్తు, నీటి లభ్యతపై కమిటీ సమగ్రంగా అధ్యయనం చేయాలని సూచించారు. మహారాష్ట్రలో ముంపునకు గురయ్యే భూములు, ప్రభావిత ప్రాంతాలను పరిశీలించాలన్నారు. పరిహారం, ఇతర సాంకేతిక అంశాలను కూడా అధ్యయనం చేయాలన్నారు. ముంపు ప్రభావం, ప్రభావిత భూముల విస్తీర్ణంపై రెండు రాష్ట్రాల అంచనాలను పరిశీలించాలని సూచించారు. ఇరు రాష్ట్రాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలన్నారు. అవసరమైతే ప్రత్యామ్నాయాలను కూడా అధ్యయనం చేయాలన్నారు. రెండు రాష్ట్రాల అధికారులు, సాంకేతిక నిపుణులు సంప్రదింపులు జరపాలని సూచించారు. తదుపరి సమావేశాల నిర్వహణ, కాలపరిమితులను నిర్ణయించాలన్నారు. ప్రాజెక్టుపై ముందుకు వెళ్లేందుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలన్నారు. దేశంలోని అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధికి కట్టుబడి ఉన్నామని ఇరువురు ముఖ్యమంత్రులు పునరుద్ఘాటించారు. ముఖ్యంగా వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వాలని అభిప్రాయపడ్డారు. గిరిజనులు, ఆదివాసీలు, అభివృద్ధి అవకాశాలు అందని వర్గాల సామాజిక, ఆర్థిక అభ్యున్నతికి కృషి చేయాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పారు.

ఇన్వెస్ట్ తెలంగాణ సదస్సుకు ఆహ్వానం

హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ నిర్వహించనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ఫడ్నవీస్‌కు తెలిపారు. ఈ సదస్సుకు హాజరుకావాలని ఆయనను ఆహ్వానించారు. ఈ ఆహ్వానంపై ఫడ్నవీస్ సానుకూలంగా స్పందించారు. సదస్సులో పాల్గొనేందుకు ఆసక్తి ఉందని, హాజరయ్యేందుకు ప్రయత్నిస్తానని చెప్పారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *