– 10రోజుల్లో ఇందిరమ్మ ఇళ్ల ఫైనల్ బిల్లుల చెల్లింపు
– పాలేరు నియోజవర్గ పర్యటనలో మంత్రి పొంగులేటి వెల్లడి
ఖమ్మం/నేలకొండపల్లి, ప్రజాతంత్ర, అక్టోబర్ 26 : పాలేరు నియోజకవర్గ పరిధిలోని నేలకొండపల్లిలో ఉన్న 3వ శతాబ్దానికి చెందిన చారిత్రక బౌద్ధ స్తూపాన్ని, పరిసర ప్రాంతాలను అంతర్జాతీయ బౌద్ధ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దనున్నట్లు రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. నేలకొండపల్లిలో పర్యాటక సదుపాయాల కల్పన, బౌద్ధ స్థల సంరక్షణ/పునరుద్ధరణ పనులకు ఆయన సోమవారం శంకుస్థాపన వేశారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ 3వ శతాబ్దానికి చెందిన బౌద్ధ స్తూపాన్ని సుమారు 50-55 సంవత్సరాల క్రితం నేలకొండపల్లి గ్రామంలో గుర్తించారని, దేశంలోనే అత్యంత పెద్ద బౌద్ధ స్తూపాల్లో ఒకటిగా నిలిచిందని తెలిపారు. గత ప్రభుత్వాలు ఈ ప్రాంత అభివృద్ధిని ప్రారంభించినప్పటికీ పనులు పూర్తి చేయలేకపోయాయన్నారు. స్తూపం చుట్టూ ఉన్న ఒకటిన్నర కిలోమీటరు పరిధిలో పురావస్తు శాఖ అధికారులు గతంలో జరిపిన తవ్వకాల్లో ఎన్నో పురాతన వస్తువులు లభ్యమయ్యాయని, వాటిని భద్రపరిచేందుకు స్థానికంగా వసతులు లేక హైదరాబాద్ మ్యూజియంలో ఉంచారని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా వచ్చిన బౌద్ధ మతస్తులు, స్థానికుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని రాబోయే రోజుల్లో బౌద్ధ కట్టడాలపై అవగాహన ఉన్న ప్రముఖ నిపుణులను, అధికారులను ఇక్కడికి ఆహ్వానించి విస్తృతస్థాయి సమావేశం నిర్వహిస్తామన్నారు.
పది రోజుల్లో ఫైనల్ బిల్లుల చెల్లింపు
రాష్ట్రవ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి పెండింగ్లో ఉన్న ఫైనల్ బిల్లులన్నింటినీ రాబోయే పది రోజుల్లోగా లబ్దిదారుల ఖాతాల్లో జమ చేసే బాధ్యత ప్రభుత్వానిదేనని మంత్రి పొంగులేటి ప్రకటించారు. నేలకొండపల్లి రైతు వేదికలో నేలకొండపల్లి మండల లబ్దిదారులకు రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను మంత్రి అందజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మండలంలో మొదటి విడత మంజూరైన 648 ఇళ్లలో సుమారు 620 ఇళ్లు పూర్తయ్యాయని, వివిధ కారణాల వల్ల ఆగిన మిగిలిన ఇళ్లను కూడా త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొనడం, కరెంటు, నీటి సమస్యలు తలెత్తుతున్న నేపథ్యంలో రైతన్నలు నష్టపోకూడదనే ఉద్దేశంతో రెండో పంట వేయవద్దని విజ్ఞప్తి చేస్తున్నట్లు మంత్రి అన్నారు. అంతకుముందు మంత్రి మండలంలోని అనాసాగరం నుండి పమ్మి వరకు 2.5 కి.మీ మేర రూ.2.80 కోట్ల అంచనా వ్యయంతో బీటీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. నియోజకవర్గంలోని అభివృద్ధి పనులపై అన్ని ఇంజనీరింగ్ శాఖల అధికారులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. కూసుమంచి మండలం గోరిళ్లపాడు తండా గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ కార్యాలయ భవనాన్ని మంత్రి పొంగులేటి ప్రారంభించారు. కార్యక్రమాల్లో కలెక్టర్ దివాకర టీఎస్, హౌసింగ్ పీడీ భూక్యా శ్రీనివాస్, పీఆర్ ఎస్ఈ వెంకట్ రెడ్డి, ఖమ్మం ఆర్డీవో ఎన్.శ్రీనివాస్, నేలకొండపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వెన్నపూసల సీతారాములు, మండల ఎంపీడీవో ఎర్రయ్య, తహసీల్దార్ రాంప్రసాద్, స్థానిక సర్పంచ్ శీలం వెంకటలక్ష్మి, వివిధ శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు, అధఙక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. తన పర్యటనలో భాగంగా ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని నాయుడుపేట జంక్షన్లో ఉన్న ఓ ఫంక్షన్ హాల్లో ఖమ్మం-వరంగల్-నల్గొండ గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి నియోజకవర్గ స్థాయి సన్నాహక సమావేశానికి మంత్రి హాజరయ్యారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





