“క్యా బొల్తీ పబ్లిక్…”

దేశ రాజకీయాల్లో కొత్త తరహా ప్రజా స్పందనకు నాంది పలుకుతూ అభిజీత్ దిప్కే స్థాపించిన ‘కాక్‌రోచ్ జనతా పార్టీ (CJP)’ రాజకీయ పార్టీగా కాకుండా ప్రజా ఒత్తిడి వేదికగా కొనసాగుతామని ప్రకటించడం, అనంతరం ‘క్యా బోల్తీ పబ్లిక్’ పేరుతో దేశవ్యాప్త ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించాలనుకోవడం ఒక ఆసక్తికర పరిణామం. ప్రజల అసలు సమస్యలను నేరుగా వినడం, వాటిని ప్రభుత్వాల ముందుంచడం ప్రజాస్వామ్యంలో ఆరోగ్యకరమైన పరిణామమే. ముఖ్యంగా దేశవ్యాప్తంగా విద్యార్థులు, యువత తమ భవిష్యత్తుపై వ్యక్తం చేస్తున్న ఆందోళనల నేపథ్యంలో ఇలాంటి ప్రయత్నాలు మరింత ప్రాధాన్యం సంతరించుకుంటున్నాయి. గత పన్నెండు సంవత్సరాలుగా దేశంలో విద్యా వ్యవస్థ, ఉపాధి అవకాశాలు, ప్రభుత్వ నియామకాల నిర్వహణ, ప్రైవేట్ విద్యా రంగ నియంత్రణ వంటి అంశాలు యువతలో తీవ్రమైన చర్చకు దారితీశాయి. ఈ సమస్యలపై దేశవ్యాప్తంగా విద్యార్థి ఉద్యమాలు, నిరసనలు, సామాజిక మాధ్యమాల ప్రచారాలు పెరుగుతున్నాయి. ఇవి కేవలం ఒక రాజకీయ పార్టీకి అనుకూలం గానీ, వ్యతిరేకం గానీ కావు. ఇవి భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతున్న ఒక తరం స్వరాలు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం విద్యా రంగంలో తీసుకున్న పలు నిర్ణయాలు, అమలులో చోటుచేసుకున్న లోపాలు దేశ విద్యా వ్యవస్థను బలోపేతం చేయడానికి బదులుగా మరింత అనిశ్చితిలోకి నెట్టినయ్ . జాతీయ విద్యా విధానం (NEP-2020) ద్వారా విద్యలో సమూల మార్పులు తీసుకొస్తామని ప్రకటించినప్పటికీ, ప్రభుత్వ పాఠశాలల మౌలిక వసతులు, ఉపాధ్యాయుల ఖాలీల భర్తీ, ప్రభుత్వ విశ్వవిద్యాలయాల ఆర్థిక బలోపేతం వంటి ప్రాథమిక అంశాల్లో ఆశించిన స్థాయిలో పురోగతి కనిపించలేదని విద్యావేత్తలు పలుమార్లు పేర్కొన్నారు. ఇక పోటీ పరీక్షల నిర్వహణ విషయంలో ఏర్పడిన సంక్షోభం యువతలో తీవ్ర నిరాశను మిగిల్చింది. NEET, UGC-NET, CUET వంటి జాతీయ స్థాయి పరీక్షల నిర్వహణలో ప్రశ్నాపత్రాల లీకేజీలు, పరీక్షల రద్దు, సాంకేతిక లోపాలు, పారదర్శకతపై అనుమానాలు లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసినయ్. పరీక్షల నిర్వహణకు బాధ్యత వహించే సంస్థలపై ప్రజల విశ్వాసం దెబ్బతినడం ప్రజాస్వామ్య వ్యవస్థకు ఆందోళనకర పరిణామం.

విద్య అనేది దేశ అభివృద్ధికి పునాది. కానీ ఇటీవలి కాలంలో ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ విశ్వవిద్యాలయాల బలోపేతం కంటే ప్రైవేట్ విద్యా రంగం విస్తరణ ఎక్కువగా కనిపిస్తున్నది. నాణ్యమైన విద్య కోసం కుటుంబాలు లక్షల రూపాయలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. పాఠశాలల నుంచి ఉన్నత విద్య వరకు ఫీజుల పెరుగుదల మధ్యతరగతి, పేద కుటుంబాలపై తీవ్రమైన ఆర్థిక భారాన్ని మోపుతున్నది. అనేక రాష్ట్రాల్లో ఫీజు నియంత్రణ చట్టాలు ఉన్నప్పటికీ, వాటి అమలు విషయంలో తీవ్రమైన లోపాలున్నాయని తల్లిదండ్రుల సంఘాలు తరచూ ఆరోపిస్తున్నాయి. విద్య సేవగా కాకుండా వ్యాపారంగా మారుతోందనే విమర్శలు అరణ్య రోదనలు గా మిగిలిపోతున్నాయి.

ఇదే సమయంలో ఉద్యోగాల విషయంలో యువత ఎదుర్కొంటున్న అనిశ్చితి మరింత ఆందోళన కలిగిస్తున్నది . ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో ఆలస్యం, పరీక్షల వాయిదాలు, ప్రశ్నాపత్రాల లీకేజీలు, నియామక ప్రక్రియల్లో ఆలస్యం లక్షలాది మంది అభ్యర్థులను తీవ్ర మానసిక ఒత్తిడికి గురిచేస్తున్నాయి. అనేక మంది విద్యార్థులు సంవత్సరాల తరబడి పోటీ పరీక్షలకు సిద్ధమవుతూ తమ యవ్వనాన్ని వెచ్చిస్తున్నారు. కానీ పరీక్షలు రద్దు కావడం, కోర్టు వివాదాలు, ఖాలీల భర్తీ ఆలస్యం వంటి పరిణామాలు వారి భవిష్యత్తును అనిశ్చితిలోకి నెడుతున్నాయి. ప్రైవేట్ రంగం కూడా అందరికీ స్థిరమైన ప్రత్యామ్నాయం కాలేకపోతోంది. ఉన్నత విద్య పూర్తి చేసిన తర్వాత కూడా తగిన నైపుణ్యాలకు సరిపడే ఉద్యోగాలు లభించడం లేదనే అభిప్రాయం యువతలో బలపడుతున్నది. ఉద్యోగం దొరికినా వేతనాలు, ఉద్యోగ భద్రత, పని పరిస్థితులపై అనేక ప్రశ్నలు ఉన్నాయి. విద్యపై భారీగా పెట్టుబడి పెట్టిన కుటుంబాలకు ఇది మరింత భారంగా మారుతున్నది.

విద్యార్థి ఉద్యమాలను రాజకీయ కోణంలో మాత్రమే చూడడం కూడా సముచితం కాదు. భారత చరిత్రలో భాషా ఉద్యమాలు, ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమాలు, అవినీతి వ్యతిరేక పోరాటాలు, తెలంగాణ రాష్ట్ర సాధన వంటి అనేక చారిత్రక పరిణామాల్లో విద్యార్థులు కీలక పాత్ర పోషించారు. తమ భవిష్యత్తు, సమాజ భవిష్యత్తు గురించి ప్రశ్నించడం ప్రజాస్వామ్యంలో వారి హక్కు. ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పడం పాలకుల బాధ్యత.  ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు ఎన్నికల సమయంలో మాత్రమే ప్రజలను కలవడం సరిపోదు. అధికారంలోకి వొచ్చిన తరువాత కూడా ప్రజల సమస్యలను నిరంతరం వినే వ్యవస్థ అవసరం. ముఖ్యంగా విద్యార్థులు, నిరుద్యోగ యువత, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో క్రమం తప్పకుండా సంభాషించే జాతీయ స్థాయి వేదికలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. విద్యా విధానం, పరీక్షల సంస్కరణలు, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి సృష్టి వంటి అంశాలపై పారదర్శక చర్చలు జరగాలి.

ప్రభుత్వాలు కేవలం గణాంకాలతో సంతృప్తి చెందకుండా, క్షేత్ర స్థాయి వాస్తవాలను అర్థం చేసుకోవాలి. ఎంత మంది విద్యార్థులు ఉన్నత విద్యను మధ్యలోనే విడిచిపెడుతున్నారు? ఫీజుల భారం వల్ల ఎంత మంది అప్పుల్లో కూరుకుపోతున్నారు? పోటీ పరీక్షల కోసం ఎంత కాలం సిద్ధమవుతున్నారు? ఉద్యోగం కోసం ఎంతకాలం వేచి చూస్తున్నారు? వంటి ప్రశ్నలకు సమగ్ర సమాధానాలు కనుగొనాల్సిన సమయం వొచ్చింది. విద్యా రంగంలో నియంత్రణ, నాణ్యత, అందుబాటు అనే మూడు అంశాలకు సమాన ప్రాధాన్యం ఇవ్వాలి. ప్రైవేట్ విద్యాసంస్థల ఫీజులపై సమర్థవంతమైన నియంత్రణ వ్యవస్థ, ప్రభుత్వ విద్యాసంస్థల బలోపేతం, పరీక్షల నిర్వహణలో అత్యున్నత పారదర్శకత, ప్రశ్నాపత్రాల లీకేజీలపై కఠిన చర్యలు, ఖాలీలను నిర్దిష్ట కాలపట్టిక ప్రకారం భర్తీ చేసే విధానం వంటి సంస్కరణలు అత్యవసరం. అదే విధంగా పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు, కొత్త ఉపాధి అవకాశాల సృష్టిపై మరింత దృష్టి పెట్టాలి.

‘క్యా బోల్తీ పబ్లిక్’ వంటి కార్యక్రమాలు ప్రజల గొంతుకను వినడానికి ఒక వేదికగా ఉపయోగపడితే అది ప్రజాస్వామ్యానికి మేలు చేస్తుంది. అయితే ప్రజల అభిప్రాయాలను వినడం మాత్రమే కాదు, వాటిని విధాన నిర్ణయాల్లో ప్రతిబింబించడం కూడా అంతే ముఖ్యం. ముఖ్యంగా విద్యార్థులు, యువత వ్యక్తం చేస్తున్న ఆందోళనలను రాజకీయ లాభనష్టాల కళ్లద్దాలతో కాకుండా దేశ భవిష్యత్తు కోణంలో చూడాల్సిన అవసరం ఉంది. దేశానికి అత్యంత విలువైన సంపద యువత. వారి ఆశలు, ఆందోళనలు, ప్రశ్నలు నిర్లక్ష్యం చేయబడితే అది కేవలం ఒక తరం నిరాశ మాత్రమే కాదు, దేశ అభివృద్ధి సామర్థ్యానికే నష్టం. ప్రజలు ఏం చెబుతున్నారు అనే ప్రశ్నకు సమాధానం వెతకడం ఎంత ముఖ్యమో, ఆ సమాధానాల ఆధారంగా పాలనలో మార్పులు తీసుకురావడం అంతకంటే ముఖ్యమైన బాధ్యత. ప్రజాస్వామ్య బలం ఎన్నికల విజయాల్లో మాత్రమే కాదు; ప్రజల గొంతుకను వినడంలో, వారి సమస్యలకు సమయోచిత పరిష్కారాలు చూపడంలోనే ఉంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *