– రాష్ట్ర సాధనలో జయశంకర్ పాత్ర గొప్పది
– చివరి శ్వాస వరకు తెలంగాణ కోసం పోరాడిన వ్యక్తి
– జయశంకర్ జయంతి సభలో ప్రొఫెసర్ హరగోపాల్
– పాలకుల్లో మార్పుకు జెన్-జీ ఉద్యమం దోహదం
– జెన్-జీ ఉద్యమం తిరుగుబాటు తత్వాన్ని నేర్పింది : ప్రొ. నాగేశ్వరరావు
– ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, పలువురు ప్రముఖుల హాజరు
హైదరాబాద్, ఆగస్ట్ 6 (ప్రజాతంత్ర బ్యూరో) : మానవతా విలువలు క్షీణిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో నేటి తరానికి ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ జీవితం అని ప్రొఫెసర్ జి.హరగోపాల్ అన్నారు. ఉద్యమ నిర్మాణం, నిజాయతీ, నైతిక విలువలను తెలియజేసేందుకు ఆయన జీవితాన్ని పాఠ్యాంశాల్లో చేర్చాలని డిమాండ్ చేశారు. బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్‌లో తెలంగాణ వికాస సమితి అధ్యక్షుడు వనపట్ల సుబ్బయ్య అధ్యక్షతన గురువారం నిర్వహించిన ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సభలో ముఖ్య అతిథిగా హరగోపాల్ మాట్లాడుతూ జయశంకర్ లాంటి వ్యక్తుల జీవితాలను విద్యార్థులకు పరిచయం చేస్తే విలువలతో కూడిన సమాజ నిర్మాణానికి దోహదపడుతుందని అన్నారు. తెలంగాణపై పరిశోధనలు చేసి గణాంకాలతో రాష్ట్ర సాధన ఉద్యమానికి దిశా నిర్దేశం చేసిన మహనీయుడు జయశంకర్ అని కొనియాడారు. చివరి శ్వాస వరకు తెలంగాణ కోసం పోరాడిన ఆయనను ప్రజలు ఎన్నటికీ మరచిపోరన్నారు. ప్రజలను చైతన్యపరచడంలో కీలక పాత్ర పోషించారన్నారు. నేడు దేశంలో భయానక వాతావరణం నెలకొందని హరగోపాల్ ఆందోళన వ్యక్తం చేశారు. ఢిల్లీలో జరిగిన జెన్-జీ ఉద్యమం పాలకుల్లో మార్పుకు దోహదపడిందని, ప్రజల్లో భయాన్ని కొంతవరకు తొలగించిందని అభిప్రాయపడ్డారు. జెన్-జీ ఉద్యమం ప్రభావాలు – పరిణామాలు అంశంపై ప్రొఫెసర్ కె.నాగేశ్వరరావు మాట్లాడుతూ ఢిల్లీలో విద్యార్థులు, యువత చేపట్టిన ఉద్యమం సమాజానికి తిరుగుబాటు తత్వాన్ని నేర్పిందన్నారు. ఉద్యమంలో ఆక్రోశం, ఆవేదన, ప్రతిఘటన దాగి ఉన్నాయని, దేశ ఆర్థిక వ్యవస్థలో అసమానతలు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. పాలకులను ప్రశ్నిస్తే వేధింపులు, అక్రమ కేసులు ఎదురవుతున్నాయని విమర్శించారు. ధర్మం ముందు ఎంతటి శక్తివంతుడైనా నిలవలేడని, విద్యార్థి ఉద్యమాలు సమాజ మార్పుకు దోహద పడతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు కె.విరహత్ అలీ, గ్రంథాలయ పరిషత్ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు అయాచితం శ్రీధర్, మల్లోజుల విజయ్ తదితరులు పాల్గొన్నారు.
—————————————————————————————————————————————————————
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు




