చిన్నారులే దేశ సంపద

– ఏ చిన్నారీ అంగన్‌వాడి సేవలకు దూరం కావద్దు
– మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క

హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 7 : చిన్నారులే దేశ సంపద, దేశ భవిషత్తు అని, తెలంగాణ-2047 లక్ష్య సాధనలో నేటి చిన్నారులే కీలక పాత్ర పోషిస్తారని మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ(సీతక్క) అన్నారు. అందుకే ఏ ఒక్క చిన్నారికీ అంగన్‌వాడి సేవలు అందకుండా ఉండకూడదనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం మొబైల్ అంగన్‌వాడి కేంద్రాలను ప్రారంభిస్తోందని తెలిపారు. ఎంసీఆర్ హెచఆర్‌డీలో కార్మిక శాఖ మంత్రి వివేక్‌తో కలిసి కార్మిక శాఖ సహకారంతో మహిళా, శిశు సంక్షేమ శాఖ రూపొందించిన మొబైల్ అంగన్‌వాడి వాహనాన్ని మంత్రి సీతక్క జెండా ఊపి ప్రారంభించారు. ఈ వాహనం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని ఇందిరమ్మ కాలనీలో అంగన్‌వాడి సేవలు అందించనుంది. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ ఇప్పటివరకు సాంప్రదాయ అంగన్‌వాడి కేంద్రాలకు వచ్చే చిన్నారులకే పోషకాహారం, ఆరోగ్య సంరక్షణ, ప్రీ-స్కూల్ విద్య, తల్లిశిశు సంక్షేమ సేవలు అందుబాటులో ఉండేవని, అయితే అంగన్‌వాడి కేంద్రాలు లేని ప్రాంతాల్లో నివసించే చిన్నారులు, ముఖ్యంగా పనుల కోసం హైదరాబాద్ వంటి నగరాలకు వలస వచ్చే కార్మికుల పిల్లలు ఈ సేవలకు దూరమవుతున్నారని అన్నారు. అలాంటి ఒక్క చిన్నారి కూడా ప్రభుత్వ సేవలకు దూరం కాకూడదనే లక్ష్యంతో ఈ మొబైల్ అంగన్‌వాడి కేంద్రాన్ని అందుబాటులోకి తెస్తున్నామని చెప్పారు. అంగన్‌వాడి కేంద్రాల్లో లభించే అన్ని సేవలు మొబైల్ అంగన్‌వాడి కేంద్రాల్లో కూడా అందుబాటులో ఉంటాయని మంత్రి తెలిపారు. ఒక్కో మొబైల్ అంగన్‌వాడి వాహనం దాదాపు పది అంగన్‌వాడి కేంద్రాలకు సమానంగా సేవలందించే సామర్థ్యాన్ని కలిగి ఉందని, ఒక్కో మొబైల్ కేంద్రం ద్వారా సుమారు 300 మంది లబ్దిదారులకు సేవలు అందనున్నాయని వివరించారు. ప్రభుత్వ సేవలను ప్రజలు ఉన్న చోటుకే తీసుకెళ్లాలన్న ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని రూపొందించిందన్నారు. చిన్నారి చిరునవ్వే నిజమైన అభివృద్ధికి ప్రతీక అని పేర్కొన్న మంత్రి సీతక్క స్వాతంత్య్రోద్యమ తొలి దశల్లో గ్రామాలకు వెళ్లి అక్షరాస్యత, విజ్ఞానాన్ని పంచిన చైతన్య రథాల మాదిరిగానే ఈ మొబైల్ అంగన్‌వాడి కేంద్రాలు కూడా ప్రతి చిన్నారికి పోషకాహారం, ఆరోగ్యం, విద్యను చేరవేసి ఆరోగ్యవంతమైన భావితరాన్ని నిర్మించడంలో కీలక పాత్ర పోషిస్తాయన్నారు. కార్యక్రమంలో మహిళా శిశు సంక్షేమ శాఖ సెక్రటరీ శృతి ఓజా, జాయింట్ డైరెక్టర్ మోతి, మేడ్చల్ మల్కాజ్‌గిరి డిడబ్ల్యూవో శారద, కార్మిక మహిళా శిశు సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *