ఎన్నికలు పారదర్శకంగా జరిగితే కాంగ్రెస్‌కే అధికారం

– సీఈవో జ్ఞానేష్‌కుమార్‌ను అరెస్ట్ చేయాలి
– రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి డిమాండ్

వనపర్తి/హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 28 : రాజ్యాంగబద్దంగా, పారదర్శకంగా, దేశ పౌరుల ఓటు తొలగింపు లేకుండా ఇప్పుటికిప్పుడు న్యాయంగా ఎన్నికలు జరిపితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, రాహుల్ గాంధీ ప్రధాని కావడం ఖాయమని రెవెన్యూ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. బీజేపి ఓటు చోరీని ఎండగడుతూ వనపర్తి జిల్లా కేంద్రంలో పార్టీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో సోమవారం చేపట్టిన నిరసన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. బీజేపి అధికారంలోకి వచ్చింది ప్రజల మద్దతుతో కాదు.. ఓట్లు దొంగలించి మాత్రమే.. అది ఈ రోజుతో బయటపడింది అని ఆయన అన్నారు. కేంద్ర ఎలక్షన్ కమిషన్‌ను బీజేపి తనకు అనుకూలంగా వాడుకుని ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి రెండుసార్లు అధికారంలోకి వచ్చిందని సీఈవో జ్ఞానేష్‌కుమార్ చర్యల ద్వారా దేశప్రజలందరికీ స్ఫష్టంగా తెలిసిపోయిందన్నారు. ‘సర’ ప్రక్రియలో కుట్ర ఉందని మొదటినుండి రాహుల్ గాంధీ చెబుతున్నారని, బీజేపి దుర్మార్గపు ఆలోచనను దేశ ప్రజలకు చెప్పడానికి ప్రయత్నించిన నిజం ఇప్పుడు అందరికీ తెలిసిందని చెప్పారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలలో కక్షపూరితంగా ఓట్ల తొలగింపునకు పాల్పడ్డారని. దానికి ఉదాహరణ ప్రతిపక్షాలు బలంగా ఉన్న ప్రాంతాల్లో డిజిటల్ ఫారమ్‌లు, నకిలీ లాగిన్‌ల ద్వారా లక్షలాదిమంది అర్హులైన ఓటర్ల పేర్లను తొలగించారని ఆరోపించారు. భారీ ఓటు చోట్ర కుట్ర వెనుక ఉన్నవారిని కాపాడుతూ అధికార బీజేపీ ప్రయోజనాల కోసం జ్ఞానేశ్ కుమార్ పనిచేస్తున్నారని విమర్శించారు. దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లవెత్తుతున్న నేపథ్యంలో ఇప్పటికైనా ప్రజాస్వామ్యం మీద ఏమాత్రం గౌరవమున్నా కేంద్ర ప్రభుత్వం సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను, బాధ్యులైన వారిని వెంటనే అరెస్టు చేయాలని మంత్రి పొంగులేటి డిమాండ్ చేశారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఖర్గే, అగ్రనాయకులు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంగా గాంధీ పార్లమెంటులో చెప్పిన విధంగా దేశ ప్రజల మీద విశ్వాసం ఉంటే కేంద్రంలో ఉన్న బీజేపి దీనికి బాధ్యత తీసుకుని దేశ ప్రజలకు క్షమాపణ చెప్పి రాజ్యాంగ విలులను కాపాడాలని మంత్రి డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొని ప్లకార్డులు, బ్యానర్లతో ఎన్నికల సంఘ ప్రధాన అధికారికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *