– సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి
– టీపీసీసీ ఆధ్వర్యంలో సీఈవో కార్యాలయం ముందు నిరసన
– ప్రధాన ఎన్నికల అధికారికి భట్టి వినతిపత్రం సమర్పణ
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 28 : దేశంలో కొన్నేళ్లుగా కుట్రపూరితంగా పౌరుల ఓటు హక్కును కాలరాస్తూ ‘ఓట్ల చోరీ’ జరుగుతోందని ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ పదేపదే చేసిన హెచ్చరికలు నేడు నిజమని తేలిపోయాయని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఎసఐఆర్ (ఎసఐఆర్) పేరుతో పౌరుల ఓట్లను తొలగిస్తున్న తీరుపై ఇతర కమిషనర్లే స్వయంగా అంగీకరించడం దేశ ప్రజాస్వామ్యానికి పట్టిన దురదృష్టకర పరిణామమని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్(సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని ఏఐసీసీ పిలుపునిచ్చిన నేపథ్యంలో టీపీసీసీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని బిబీఆర్కే భవన్‌లోని ఉన్న రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ శ్రేణులు సోమవారం భారీ నిరసన ప్రదర్శన చేపట్టాయి. ఈ కార్యక్రమంలో చేతిలో భారత రాజ్యాంగ ప్రతిని పట్టుకుని పాల్గొన్న భట్టి విక్రమార్క ప్రజాస్వామ్య పరిరక్షణకు కాంగ్రెస్ పార్టీ పునరంకితమై ఉందని చాటారు. అనంతరం పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్‌లతో కలిసి ఆయన ఎన్నికల కమిషనర్ సుదర్శన్‌రెడ్డికి వినతిపత్రం సమర్పించారు. 
ఈ సందర్భంగా మీడియాతో డిప్యూటీ సీఎం మాట్లాడుతూ దేశంలో రాజ్యాంగాన్ని, పౌరుల ఓటు హక్కును కాపాడటానికి రాహుల్ గాంధీ మొదటి నుంచీ పోరాడుతున్నారని గుర్తు చేశారు. ఓట్ల చోరీపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను నేడు స్వయంగా ఎన్నికల కమిషనర్లే ఒప్పుకోవాల్సి వచ్చిందని, ప్రజాస్వామ్యానికి ప్రాణవాయువైన ఓటు హక్కునే కాలరాస్తే ఇక ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఎక్కడ ఉందని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని విశ్వసించే పార్టీలన్నీ విభేదాలను పక్కనపెట్టి కాంగ్రెస్‌తో చేతులు కలపాలని, రాజ్యాంగంపై నమ్మకం లేని వారు మాత్రమే ఈ ఉద్యమానికి దూరంగా ఉంటున్నారని విమర్శించారు. ప్రజాస్వామ్యంపై, పౌరుల హక్కులపై కాంగ్రెస్‌కు సంపూర్ణ విశ్వాసం ఉందన్న ఆయన ప్రతి పౌరుడికీ వారి ఓటు హక్కు దక్కే వరకు పోరాటాన్ని ఆపేది లేదని స్పష్టం చేశారు. సీఈవో కార్యాలయం ముందు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు శ్రీధర్ బాబు, ప్రభాకర్, అజారుద్దీన్, ఎంపీ చామల, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు బైఠాయించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు




