ఆర్ఎల్ఐసి పర్యావరణ అనుమతికి కేంద్రం నిరాకరణ

  • ఇది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సాధించిన విజయం
  • కృష్ణా జలాల్లో తెలంగాణ వాటాను వదులుకోం
  • మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

కృష్ణా జలాలతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకానికి కేంద్రం పర్యావరణ అనుమతులు నిరాకరించడం రాష్ట్ర ప్రభుత్వం సాధించిన విజయంగా రాష్ట్ర నీటిపారుదల,పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. అంతర్ రాష్ట్ర నిబంధనలను ఉల్లంఘించి ఆర్ఎల్ఐసి నిర్మాణం ఏపి ప్రభుత్వం చేపట్టిందంటూ కేంద్రం వద్ద తాను పలుమార్లు రాష్ట్రం తరపున వాదనలు వినిపించడంతో పాటు రాష్ట్ర నీటిపారుదల ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా కేంద్రానికి లేఖ రాసిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. కేఆర్ఎంబి, అపెక్స్ కౌన్సిల్  అనుమతులు లేకుండా ఈ ప్రాజెక్టు నిర్మించాలన్నది ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం లక్ష్యమని ఆయన తెలిపారు.  అంతరాష్ట్ర జల నిబంధనలు మాత్రమే కాకుండా పర్యావరణ చట్టాలను కూడా కాదని వారు ఈ ప్రాజెక్టును మొదలు పెట్టారన్నారు.

అటువంటి కీలక సమయంలో అధికారంలోకి వొచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కృష్ణా జలాల్లో తెలంగాణ వాటాను కాపాడేందుకు పూనుకుందన్నారు. అందులో భాగంగానే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున తాను నీటిపారుదల అధికారులు ఎన్ జిటి, ఎంఓఎఫ్, సిసి లతో పాటు కేఆర్ ఎంబికే., కేడబ్ల్యూడిటి-2 వద్ద పటిష్టమైన వాదనలు వినిపించినందునే ఈ విజయం సాధ్యమైందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏకపక్షంగా ఆర్ఎల్ఐసి నిర్మాణం చేపట్టడాన్ని కేంద్ర పర్యావరణ మంత్రితో వ్యక్తిగతంగా మాట్లాడి సమగ్రంగా వివరించిన నేపథ్యాన్ని ఆయన ఉటంకించారు. దీనితో ఈఏసి, ఫిబ్రవరి 27న జరిగిన 25వ సమావేశంలో ఎన్జిటి ఉత్తర్వులను సమీక్షించి ఏపి ప్రభుత్వం నిబంధనలు ఉల్లంఘించి రాయలసీమ ఎత్తిపోతల పథకానికి అంకురార్పణ చుట్టినట్లు నిర్దారించుకున్న మీదటనే ఈ నిర్ణయం వెలువరించారన్నారు.

అంతే గాకుండా పర్యావరణ అనుమతులు పొందాలంటే పూర్వ స్టితితో పర్యావరణ అనుమతికి దరఖాస్తు పెట్టుకోవచ్చని స్పష్టం చేయడం తెలంగాణ రాష్ట్ర విజయంగా ఆయన అభివర్ణించారు ఆర్.ఎల్.ఐ. సి నిర్మాణాన్ని తాము అడ్డుకోకుండా ఉండి ఉంటే తెలంగాణ రాష్ట్రంలోని కృష్ణా నది పరీవాహక ప్రాంతంలో సాగు,తాగునీటికీ దుర్భర పరిస్థితి ఏర్పడుతుందన్నారు. వీటన్నింటినీ అధ్యయనం చేసిన మీదటే కృష్ణా జలాశయాలలో మన హక్కు కోల్పోకుండా చూడడంతో పాటు ఆనధికారికంగా నీటి భద్రతకు ముప్పు వాటిల్ల కుండా విధాన పరమైన పోరాటం చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *