కన్నుల పండువగా ఎల్లమ్మ తల్లి కల్యాణం

– అమ్మవారిని దర్శించుకున్న మంత్రి పొన్నం దంపతులు
– పూర్ణ కుంభంతో స్వాగతం.. పట్టు వస్త్రాల సమర్పణ

హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 21 : అత్యంత మహిమాన్వితమైన, భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలిచిన బల్కంపేట ఎల్లమ్మ తల్లి కళ్యాణ మహోత్సవం ప్రభుత్వం ఆధ్వర్యంలో మంగళవారం అంగరంగ వైభవంగా జరిగింది. జిల్లా ఇన్‌చార్జి మంత్రి, బీసీ, రవాణా శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ దంప‌త స‌మేతంగా హాజ‌ర‌య్యారు. అమ్మ‌వారికి ప్ర‌భుత్వం త‌ర‌పున ప‌ట్టు వ‌స్త్రాలు స‌మ‌ర్పించారు. వేలాదిమంది భక్తుల సమక్షంలో లోకకల్యాణం కోసం ఈ దివ్య  కార్య‌క్ర‌మాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారిని ఒక్కటే ప్రార్థిస్తున్నాం.. రాష్ట్రవ్యాప్తంగా సమృద్ధిగా వర్షాలు కురిసి, రైతులకు పాడి పంటలు పండాలి.. ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో జీవించాలి అని జిల్లా ఇన్‌చార్జి మంత్రి, బీసీ, రవాణా శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ప్రకృతి వైపరీత్యాల గురించి ఆందోళనలు ఉన్న ఈ సమయంలో గతంలో ఎన్నో విపత్తులను ఎదుర్కొని తన భక్తులను కాపాడిన బల్కంపేట ఎల్లమ్మ తల్లి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామన్నారు. హైదరాబాద్ బోనాలంటే ఒక సంప్రదాయం, ఒక సంస్కృతి, ఒక ఆధ్యాత్మిక వైభవం. ఈ మహోత్సవాల్లో అన్ని వర్గాల ప్రజలు పాల్గొని పరస్పర సహకారంతో భక్తిశ్రద్ధలతో జరుపుకోవడం మన రాష్ట్ర గొప్పతనం అని అన్నారు. ప్రభుత్వం తరఫున భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, అయినప్పటికీ భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తున్నందున అక్కడక్కడా స్వల్ప అసౌకర్యాలు ఎదురయ్యే అవకాశం ఉంటుందని, అలాంటి పరిస్థితుల్లో భక్తులు సహనంతో సహకరించి అమ్మవారిని భక్తితో దర్శించుకోవాలని కోరారు. బోనాల ఉత్సవాల సందర్భంగా హైదరాబాద్‌లోని మÖడు వేలకు పైగా దేవాలయాలకు ప్రభుత్వం ప్రత్యేక ఆర్థిక సహాయాన్ని అందించిందని మంత్రి చెప్పారు. భక్తులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించేందుకు దేవాదాయ శాఖతోపాటు అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయన్నారు. దేవాలయాల్లో మంచి వర్షాలు పడాలని పూజలు చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. బల్కంపేట ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో రాష్ట్రం అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి సాధించాలని, ప్రజల జీవితాల్లో సుఖశాంతులు నెలకొనాలని, లోకకల్యాణం చేకూరాలని ఈ పవిత్రమైన కల్యాణం సందర్భంగా మనసారా ప్రార్థిస్తున్నామని మంత్రి పొన్నం చెప్పారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *