విద్యార్థుల‌పై ద‌మ‌న‌కాండ అమానుషం

– ‘నీట్’ పేప‌ర్ లీకేజీపై స‌మ‌గ్ర విచార‌ణ జ‌ర‌పాలి
– న‌ల్గొండ జిల్లా న్యాయ‌వాదుల డిమాండ్‌
– జిల్లా న్యాయ‌స్థానం ఎదుట నిర‌స‌న‌

న‌ల్గొండ‌, ప్ర‌జాతంత్ర‌, జూలై 21: విద్యార్థులపై కేంద్ర ప్రభుత్వ దమనకాండను సీనియర్ న్యాయవాదులు మల్లేపల్లి ఆదిరెడ్డి, జి.మోహన్ ఒక ప్ర‌క‌ట‌న‌లో ఖండించారు. ‘నీట్’ పేప‌ర్ల‌ లీకేజ్ పై సమగ్ర విచారణ జరిపి బాధ్యులైన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రసాద్ రాజీనామా చేయాలని కోరుతూ విద్యార్థులు, యువత, విద్యార్థుల తల్లిదండ్రులు పార్లమెంటు ముట్టడికి బయలుదేరితే కేంద్ర ప్రభుత్వం విద్యార్థులపై, విద్యార్థుల తల్లిదండ్రులపై, యువతపై జ‌రిపిన దాడుల‌ను నిరసిస్తూ నల్లగొండలో జిల్లా న్యాయస్థానం ఎదుట న్యాయవాదులు నల్ల బ్యానర్ తో మంగళవారం నిరసన వ్యక్తం చేసి విద్యార్థుల ఆందోళ‌న‌కు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా సీనియర్ న్యాయవాదులు ఆదిరెడ్డి, మోహన్, జి.వెంకటేశ్వర్లు, అనంతుల శంకరయ్య, దర్శనం నరసింహ మాట్లాడుతూ ‘నీట్’ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంపై సమగ్ర, నిష్పక్షపాత విచారణ జరిపి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలనడం అన్యాయమైన డిమాండా అని ప్ర‌శ్నించారు. లక్షలాదిమంది విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న ‘నీట్’ వంటి జాతీయస్థాయి పరీక్షల్లో ప్రశ్నపత్రాల లీకేజీ జరగడం అత్యంత ఆందోళనకరమని అన్నారు. ఈ వ్యవహారంపై న్యాయమైన డిమాండ్లతో కొన్ని రోజులుగా ప్రజాస్వామ్యబద్ధంగా భిన్న రూపాల్లో నిరసన వ్యక్తం చేస్తున్నా ఈ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించిందన్నారు. పరిష్కారం రాని సందర్భంలోనే పార్లమెంట్ ముట్టడికి బయలుదేరార‌న్నారు. ప్రజల గొంతును వినాల్సిన ప్రభుత్వం నిరసన తెలిపే హక్కును అణచివేయడానికి ప్రయత్నించడం ఆందోళనకర పరిణామమని అన్నారు. సమస్యను పరిష్కరించడానికి చొరవ చూపకుండా, ఉద్యమాలను అణచివేయాలనే ధోరణి అవలంబించడం దేశంలో మరింత ఉద్రిక్తతలకు దారితీసే ప్రమాదం ఉందన్నారు. ‘నీట్’ వ్యవస్థపై విద్యార్థుల్లో తిరిగి విశ్వాసం నెలకొల్పాలంటే లీకేజీ వ్యవహారంపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో లేదా స్వతంత్ర ఉన్నతస్థాయి దర్యాప్తు సంస్థ ద్వారా సమగ్ర విచారణ జరిపి లీకేజీ కుట్రలో పాల్గొన్న ప్రతి ఒక్కరిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అరెస్టు చేసిన విద్యార్థులను బేశారతిగా విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో న్యాయవాదులు కట్టా అనంతరెడ్డి, గుర్రం వెంకట్ రెడ్డి, బ్రహ్మచారి, భువనగిరి రవి, నర్సాజి, నాగిరెడ్డి, బొమ్మరబోయిన వెంకన్న, కిషోర్ కుమార్,పందుల సైదులు, అన్నపూసల ఐలేష్,పజ్జురి స్వామి గౌడ్, శేఖర్, ఎన్.రాములు,సంద యాదయ్య, ఆవుల ప్రేమ సుందర్, దున్న లింగస్వామి, బరిగల సైదులు, బి.వెంకటేశ్వర్లు, కే.విజయ్ కుమార్,వెంకట్ ముదిరాజ్, కే.శంకర్ ముదిరాజ్, సాయి తదితరులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *