– క్యూర్ చట్టం, ఇందిరమ్మ ఇండ్ల పేరుతో పేదలపై భారం
– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు తీవ్ర ఆగ్రహం
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 21 : హైదరాబాద్ నగరంపై, పేద, మధ్యతరగతి ప్రజలపై కాంగ్రెస్ ప్రభుత్వం పన్నుల భారం, డిపాజిట్ల పేరుతో నిలువుదోపిడీకి తెరతీసిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు తీవ్రంగా మండిపడ్డారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం తీసుకొచ్చిన కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ(క్యూర్) చట్టం, ఇందిరమ్మ ఇండ్ల పథకం అమలు తీరుపై ఘాటుగా విమర్శలు గుప్పించారు. 1955 నాటి మున్సిపల్ చట్టంలో ప్రజల అవసరాలకు అనుగుణంగా మార్పులు చేస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, అయితే క్యూర్ చట్టంలోని కీలక నిబంధనలు ప్రజలను పీల్చి పిప్పిచేసేలా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. శాస్త్రీయ పన్ను విధానం లేకుండా, రిజిస్ట్రేషన్ వాల్యూ ఆధారంగా యేటా 5 శాతం వరకు పన్నులు పెంచేలా నిబంధనలు విధించడం ముమ్మాటికీ పన్నుల దోపిడీయేనని రామచందర్‌రావు విమర్శించారు. నీరు, సివరేజ్ సేవలను విడదీసి వేర్వేరు పన్నులు విధించడం ద్వారా ప్రజలపై అదనపు ఆర్థిక భారం పడుతుందన్నారు. 74వ రాజ్యాంగ సవరణ స్ఫూర్తిని దెబ్బతీస్తూ కార్పొరేటర్లు, వార్డు సభ్యులు, ప్రజాప్రతినిధుల పాత్రపై స్పష్టత లేకుండా జవాబుదారీతనం లోపించిన ఈ చట్టాన్ని తాము అసెంబ్లీలో గట్టిగా నిలదీస్తామని స్పష్టం చేశారు. రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్లు, ప్రజల సూచనలు తీసుకోకుండా ఏకపక్షంగా చట్టం తీసుకురావాలనుకోవడం సరికాదన్నారు. అలాగే ఇందిరమ్మ ఇండ్ల పథకం మరొక ఆర్థిక దోపిడీ కార్యక్రమమని దుయ్యబట్టారు. 24 నియోజకవర్గాల్లో లక్షలాదిమంది అర్హులు ఉంటే 7,680 ఫ్లాట్లకు మాత్రమే నోటిఫికేషన్ ఇచ్చి ఒక్కో దరఖాస్తుదారుడి నుంచి రూ.100 రుసుముతోపాటు రూ.10వేల ఈఎండీ వసూలు చేయడం అత్యంత అన్యాయమన్నారు. ఈ ప్రక్రియ ద్వారా పేదల నుంచి ప్రభుత్వం దాదాపు రూ.1,000 కోట్లు వసూలు చేయడానికి కుట్ర పన్నిందని, ఇది గత బీఆర్ఎస్ ప్రభుత్వం గొర్రెల పంపిణీ పేరుతో చేసిన డిపాజిట్ల దోపిడీని గుర్తు చేస్తోందని విమర్శించారు. వైఎస్సార్ పాలనలో నిర్మించిన సద్భావన, అభిమాన్(జవహర్‌నగర్), పోచారం, చందానగర్, సహీరా(గాజులరామారం) టౌన్షిప్లతోపాటు కేసీఆర్ ప్రభుత్వంలో బోలక్పూర్, జవహర్‌నగర్‌లలో నిర్మించిన వందలాది డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇప్పటికీ ఖాళీగా పడి ఉన్నాయని గుర్తు చేశారు. రాజీవ్ స్వగృహ ఇళ్ల అవకతవకలపై సీబీసీఐడీ విచారణ జరుపుతామన్న బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా వెనక్కి తగ్గిందన్నారు. ఇలా గతంలో కట్టిన ఇళ్లకు మరమ్మతులు చేసి పేదలకు ఇవ్వకపోవడం కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రభుత్వాల నిర్లక్ష్యానికి అద్దం పడుతోందన్నారు. కేంద్రం ‘ప్రధానమంత్రి ఆవాస్ యోజన’ కింద ఇస్తున్న నిధులు, సబ్సిడీలను వాడుకుంటూ రూ.11 లక్షల ఇళ్లు ఇస్తున్నామంటూ కాంగ్రెస్ సర్కారు ప్రచారం చేసుకోవడం ప్రజలను తప్పుదోవ పట్టించడమేనన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ ప్రభుత్వం మరో నాటకానికి తెరతీసిందంటూ గతంలో నిర్మించిన ఇళ్లను వెంటనే ఉచితంగా అర్హులకు కేటాయించాలని, పాత ఇళ్లు పంపిణీ కాకపోవడంపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
బీజేపీలో పలువురు ప్రముఖుల చేరిక
తొలుత పార్టీ కార్యాలయంలో పలువురు ప్రముఖులు రామచందర్ రావు సమక్షంలో బీజేపీలో చేరారు. వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో సైనిక్‌పురికి చెందిన ప్రముఖ సేవా నిర్వాహకుడు జాయ్ మైఖేల్ డిసాజ్వా, ఓల్డ్ బోయిన్‌పల్లికి చెందిన వ్యాపారి దినేష్ కుమార్, కూకట్‌పల్లికి చెందిన వ్యాపారవేత్త శ్రావణ్‌కుమార్ సామల తదితరులున్నారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని వారికి పిలుపునిచ్చారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





