– సుమారు రూ.28 కోట్ల నగదు, 15 కిలోల పసిడి స్వాధీనం
– 5 కౌంటింగ్ మెషిన్లు పెట్టినా విఫలమైన అధికారులు
కోల్‌కతా, జూలై 30 :పశ్చిమ బెంగాల్‌లోని ఓ మాజీ డ్రైవర్ ఇంట్లో పెద్దఎత్తున నగదు, బంగారం బయటపడటం తీవ్ర దుమారం రేపుతోంది. బీర్‌భూమ్ జిల్లాలో నార్ మొండల్ అనే విశ్రాంత బస్సు డ్రైవర్ నివాసంలో పోలీసులు నిర్వహించిన సోదాల్లో ఇప్పటివరకు సుమారు రూ.28 కోట్ల నగదు, 15 కిలోల పసిడి స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు వెల్లడించారు. నోట్ల కట్టలు భారీగా ఉండటంతో.. వాటిని లెక్కించే క్రమంలో 5 కౌంటింగ్ మెషీన్లు విఫలమైనట్టు తెలుస్తోంది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. తులు మొండల్ అనే శిలల వ్యాపారికి నార్ మొండల్ బంధువు. తులు మొండల్.. తృణమూల్ కాంగ్రెస్ మాజీ నేత అనుబ్రత మొండల్‌కు సన్నిహితుడు. ఈ నేపథ్యంలో వీరు అక్రమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్టు పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది. దీంతో సోదాలు నిర్వహించగా.. తొలుత రూ.5.5 కోట్ల నగదు, 15 కిలోల బంగారం లభించాయి. ఆ తర్వాత తనిఖీలు కొనసాగించడంతో నగదు మొత్తం సుమారు రూ.28 కోట్లకు చేరింది. ఈ ఘటనపై నార్ మొండల్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణలో ఈ నగదు, బంగారం తులు మొండల్‌కు చెందినదని, అక్రమ కార్యకలాపాలు నిర్వహించి పొందిన సొమ్ముగా పేర్కొన్నట్లు సమాచారం. అయితే దీనిపై అధికారులు ఇంకా ఎలాంటి అధికారిక వివరాలూ వెల్లడించలేదు. అక్రమ ఆర్థిక లావాదేవీలు, ఇసుక-రాతి మాఫియా కార్యకలాపాలతో ఈ వ్యవహారానికి సంబంధాలున్నాయా అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. రాష్ట్ర రవాణా శాఖ ఉద్యోగిగా పనిచేసిన నార్ మొండల్.. పదవీ విరమణ పొందాక వ్యాపార రంగంలోకి అడుగుపెట్టినట్టు దర్యాప్తులో వెల్లడైంది. అయితే.. ఇంత భారీగా ఆస్తులు ఎలా కూడబెట్టాడనే అంశంపై అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ ఘటనపై రాజకీయంగానూ తీవ్ర విమర్శలు వ్యక్తమవుతుండగా.. టీఎంసీ వర్గాలు పరస్పర ఆరోపణలకు దిగాయి. నిందితులకు కొందరు పేరున్న నాయకులతో సంబంధాలున్నాయంటూ పలువురు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరిపి, అక్రమ సంపద వెనకున్న వారందరినీ చట్టం ముందు నిలబెట్టాలని డిమాండ్ చేస్తున్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు


