– లీకులపై కఠిన చర్యల కోసమే బిల్లు అని చెప్పిన మంత్రి
– విద్యార్థులపై లాఠీఛార్జ్‌పై అమిత్ క్షమాపణలు చెప్పాలన్న ఖర్గే
న్యూదిల్లీ,జూలై30: ప్రశ్నపత్రాల లీకేజీ నిరోధానికి ప్రభుత్వం తీసుకొచ్చిన ‘పబ్లిక్ పరీక్షల (అనుచిత పద్ధతుల నివారణ) సవరణ బిల్లు 2026’ రాజ్యసభ ముందుకు వచ్చింది. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ దీనిని సభలో ప్రవేశపెట్టారు. దీనిపై ఏడు గంటల పాటు చర్చించాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా జితేంద్ర సింగ్ మాట్లాడుతూ.. ప్రశ్నపత్రాల లీకులను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందని, ఏమాత్రం సహించే ప్రసక్తే లేదన్నారు. పిల్లల భవిష్యత్తును ప్రమాదంలో పడేయడాన్ని అనుమతించ బోమన్నారు. దేశంలోని విద్యార్థులు, యువత సంక్షేమాన్ని పరిరక్షించడంలో ప్రభుత్వ నిబద్ధతకు ఈ బిల్లు నిదర్శనమని చెప్పారు. ఈ బిల్లును తీసుకురావడానికి ప్రధాని ఏ మాత్రం ఆలస్యం చేయలేదని కేంద్ర మంత్రి వెల్లడించారు. ఈ సందర్భంగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసి ప్రధాని మోదీ కుర్చీ కాపాడారని రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు. యాంటీ పేపర్ లీక్ బిల్లుపై మాట్లాడుతూ.. ‘నీట్ పేపర్ లీక్ వల్ల చాలా మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. పేపర్ లీక్ కాకుండా ప్రభుత్వం ఏమాత్రం ముందస్తు చర్యలు చేపట్టలేదు. 2024లోనే ఈ బిల్లును ఎందుకు తీసుకురాలేదు? దిల్లీలో విద్యార్థుల విషయంలో పోలీసులు వ్యవహరించిన తీరుపై అమిత్‌షా ఎందుకు మౌనంగా ఉన్నారు? ఈ ఘటనకు ఆయన బాధ్యత వహించాల్సిందేనని అన్నారు. నీట్ ప్రశ్న పత్రం లీక్, విద్యా వ్యవస్థలో సంస్కరణల కోసం ఆందోళనకు దిగిన వారిపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారని మల్లికార్జున ఖర్గే ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులపై బాష్పవాయువు కూడా ప్రయోగించారని తెలిపారు. పోలీసుల తీరుపై కేంద్రం హోం శాఖ మంత్రి అమిత్ షా ఎందుకు మౌనంగా ఉన్నారని ఆయన ప్రశ్నించారు. ఇంతటి దారుణ ఘటనకు అమిత్ షాదే బాధ్యత అని స్పష్టం చేశారు. దీనిపై ఇంతవరకు అమిత్ షా ఎలాంటి ప్రకటన చేయలేదంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఢిల్లీ ఘటనపై నోరు విప్పి మాట్లాడాలంటూ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను ఖర్గే డిమాండ్ చేశారు. పేపర్ లీక్ వల్ల విద్యార్థులు నష్టపోవాలా? అని కేంద్రాన్ని ఆయన సూటిగా ప్రశ్నించారు. నీట్ పేపర్ లీక్ కారణంగా.. చాలామంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల ఆవేదనను అర్థం చేసుకోవాలని ఈ సందర్భంగా కేంద్రానికి ఖర్గే స్పష్టం చేశారు. విద్యార్థులకు జరిగిన నష్టాన్ని ఎవరు భర్తీ చేయాలి? అని మోదీ సర్కారును ఆయన నిలదీశారు. పేపర్ లీక్ అనేది తలదించుకోవాల్సిన అంశమని ఖర్గే అభివర్ణించారు. 2024లోనే ఈ బిల్లు ఎందుకు తీసుకురాలేదని కేంద్రాన్ని ఆయన ప్రశ్నించారు. ఎన్నికల్లో గెలుపు తప్ప విద్యార్థులపై ప్రేమ లేదని కేంద్ర వైఖరిని ఎండగట్టారు. బిహార్‌లో ఆందోళనకు దిగిన విద్యార్థులపై తుపాకులు ఎక్కుబెట్టారని విమర్శించారు. ఆందోళన చేసిన యువత ఉగ్రవాదులు కాదు కదా? అని కేంద్రానికి ఖర్గే చురకలంటించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు




