– ఎన్రోల్మెంట్పై ప్రత్యేక దృష్టి పెట్టాలి: కేటీఆర్
– ఆరు జిల్లాల నేతలతో వరుస సమావేశాలు
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 26 : రాష్ట్రంలో జరగనున్న రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలను బీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. ఎన్నికలకు ఇప్పటినుంచే పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ భవన్లో ఆరు జిల్లాల నేతలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా వరంగల్, నల్లగొండ, ఖమ్మం జిల్లాల నేతలతో శనివారం విడివిడిగా భేటీ అయ్యారు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై వారికి దిశానిర్దేశం చేశారు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్ల ఎన్రోల్మెంట్ అత్యంత కీలకమైన అంశమని కేటీఆర్ పేర్కొన్నారు. అర్హత కలిగిన ప్రతి గ్రాడ్యుయేట్ ఓటరుగా నమోదు చేసుకునేలా పార్టీ శ్రేణులు విస్తృతంగా కృషి చేయాలని సూచించారు. ఎన్రోల్మెంట్కు సంబంధించి పార్టీపరంగా అనుసరించాల్సిన వ్యూహంపై నేతలకు పలు సూచనలు చేశారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే సమయానికి పార్టీ యంత్రాంగం పూర్తిస్థాయిలో సన్నద్ధంగా ఉండేలా ఇప్పటినుంచే కార్యాచరణ రూపొందించుకోవాలని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులు, నిరుద్యోగులు, గ్రాడ్యుయేట్లను మోసం చేసిందన్న ఆగ్రహం వారిలో తీవ్రంగా ఉన్నదని కేటీఆర్ అన్నారు. చదువుకున్నవారు తమ సమస్యలతోపాటు తమ కుటుంబాలు, అన్నదాతలు, మహిళలు, యువత సహా రాష్ట్రంలోని అన్ని వర్గాల సమస్యలను గమనిస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాలకు ద్రోహం చేసిందన్న విషయాన్ని ప్రజలు అర్థం చేసుకున్నారన్నారు. ఈ నేపథ్యంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్కు ఓటమి తప్పదన్నారు. అయితే ఆ వ్యతిరేకత బీఆర్ఎస్కు అనుకూలంగా ఓటుగా మారేలా ఇప్పటి నుంచే పక్కా ప్రణాళికతో ముందుకు సాగాల్సిన అవసరం ఉందని పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహాల్లో భాగంగా మరో రెండు రోజుల్లో మహబూబ్నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల నేతలతో కేటీఆర్ సమావేశం కానున్నారు. ఆయా జిల్లాల నేతలతో విడివిడిగా భేటీ అయి ఎన్నికల కార్యాచరణపై చర్చించనున్నారు. గత గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వరంగల్, ఖమ్మం, నల్లగొండ పరిధిలో బీఆర్ఎస్ అభ్యర్థి స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలైన విషయాన్ని కేటీఆర్ గుర్తు చేశారు. ఎన్నిక పార్టీ గుర్తుపైనే జరుగుతుందని, నాయకులు, కార్యకర్తలు ఐకమత్యంతో పనిచేసి ఎవరిని అభ్యర్థిగా నిలబెట్టినా పార్టీ అభ్యర్థి విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





