- ఇది ట్రయల్ మాత్రమే..
- పథకాలు అమలు కాకుండా బిఆర్‌ఎస్ కుట్రలు
- డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
ఖమ్మం, ప్రజాతంత్ర, జనవరి 26 : కాస్కో కేటీఆర్.. ఇందిరమ్మ ఇల్లు.. రేషన్ కార్డులు ఇతర సంక్షేమ పథకాల మంజూరుకు ఈరోజు అంతం కాదు ఆరంభం మాత్రమే… నువ్వు నీ పార్టీ.. సంక్షేమ పథకాల ప్రవాహాల్లో కొట్టుకుపోవడం ఖాయం.. అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విమర్శలు గుప్పించారు. కేసీఆర్ భ్రమల్లోనే బతుకుతున్నారని, నాలుగు సంక్షేమ పథకాలు వినబడడానికి చిన్నగా ఉండొచ్చని, కానీ ఈ పథకాల అమలుకు ఏడాదికి రూ.45 వేల కోట్లు భారం పడుతోందని తెలిపారు. అయినా కూడా ప్రజలందరికీ మంచి చేయాలని పథకాల పంపిణీ మొదలుపెట్టామని చెప్పారు. ఖమ్మం జిల్లా కొనిజర్ల మండలం చిన్నగోపతి గ్రామంలో నాలుగు పథకాల ప్రారంభ సభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడారు. రాష్ట్రంలో ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అమలు జరగకుండా చేయాలని బిఆర్‌ఎస్ పార్టీ కుట్రలు పన్నుతోంది.. నిధులు అందుబాటులో ఉన్నా గత పదేళ్లపాటు బిఆర్‌ఎస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు.
వారు ప్రజల గురించి ఆలోచిస్తే తాము ఇంత పెద్ద సంఖ్యలో రేషన్ కార్డులు ఇవ్వాల్సి వొచ్చేది కాదన్నారు. రాజ్యాంగానికి భిన్నంగా నడుచుకోవాలని కొందరు చూస్తున్నారని, సొంత భావజాలాన్ని ప్రజలపై రుద్దాలని కొందరు యత్నిస్తున్నారన్నారు. భారత రాజ్యాంగాన్ని మారుస్తామంటూ కేసిఆర్ మాట్లాడితే తగుదునమ్మా అంటూ ఆయన కొడుకు.. దశాబ్దకాలంగా పేద ప్రజలను పట్టించుకోకుండా.. ఒకే గ్రామంలోనే ఇస్తారా అంటూ మాట్లాడటం విడ్డూరంగా ఉంది. ప్రతి పథకాన్ని సంతృప్త స్థాయి(శాచ్యురేషన్ మోడ్)లో అమలు చేస్తాం. గత పదేళ్లు ప్రభుత్వాన్ని పాలకుల కోసమే వాడుకున్నారు.. గత పాలకులు నాలుగు గోడల మధ్య .. గడీల్లో కూర్చొని లబ్ధిదారులను ఖరారు చేశారు. మేము మూడు రోజులు ప్రజల మధ్య గ్రామసభలు పెట్టి జాబితాలు ప్రకటించి… ఇంకా మిగిలిన వారు ఉంటే దరఖాస్తులు పెట్టుకోమని చెప్పామని తెలిపారు.
ఇల్లు, రేషన్ కార్డులు రాకుండా సమాజానికి ద్రోహం చేసేవాళ్లు గ్రామసభలో గొడవలు చేయాలని ప్రయత్నం చేశారు.. ప్రజలు మా పిలుపును అర్థం చేసుకొని గ్రామసభల్లో లక్షల కొద్ది దరఖాస్తులు చేసుకున్నారని తెలిపారు. లక్షల్లో దరఖాస్తులు వొచ్చాయి. అన్నీ ఒకేసారి ఇవ్వలేం… 26న మొదలు పెడతామని చెప్పాం. కాబట్టి ప్రతి గ్రామంలో లాంచనంగా ఈరోజు నాలుగు పథకాలు ప్రారంభించాం. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు రెండు లక్షల వరకు రైతు రుణమాఫీ ఇచ్చిన హామీ మేరకు ప్రజా ప్రభుత్వంలో మూడు నెలల వ్యవధిలోనే 22 వేల కోట్లు రైతు రుణమాఫీ కింద రైతుల ఖాతాల్లో జమ చేశాం. బిఆర్‌ఎస్ నాయకులు పదేళ్లలో లక్ష రూపాయల రుణమాఫీ చేయలేకపోయారు. వారు దోపిడీ చేశారు.. మేం ప్రజలకు పంచుతున్నాం. సీఎల్పీ నేతగా ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు పాదయాత్ర చేసిన వ్యక్తిగా.. ఉప ముఖ్యమంత్రి హోదాలో ప్రతి నిమిషం ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా. ఈ ప్రభుత్వం ప్రజలకే అంకితం.. నిత్యం ప్రజలకు పనికి వచ్చే నిర్ణయాలే తీసుకుంటామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.




