మా భూముల హద్దులు నిర్ధారించాలి

– కలెక్టర్ కార్యాలయంలో అధికారులకు రైతుల వినతిపత్రం 
– కలకలం రేపుతోన్న ఎర్రవల్లి భూ సర్వే వివాదం 

మర్కుక్, ప్రజాతంత్ర,సెప్టెంబర్ 23 : సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలంలో భూ వివాదం కలకలం రేపుతోంది. అధికారులు ఇచ్చిన పట్టాదార్ పాస్ పుస్తకాల ప్రకారం కాకుండా వేరే సర్వే నంబర్ల పేరుతో వచ్చి భూములు కొలుస్తున్నారంటూ శివారు వెంకటాపుర్ గ్రామానికి చెందిన రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాస్ పుస్తకాలు ఉన్న తమ భూములకు హద్దులు నిర్ధారించి న్యాయం చేయాలని కోరుతూ ఎంఆర్‌వో కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. అధికారుల నిర్లక్ష్యం, రికార్డుల వ్యత్యాసం వల్ల దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న తమ భూములను కోల్పోవాల్సి వస్తోందని ఆరోపించారు. శివారు వెంకటాపుర్ గ్రామానికి చెందిన సర్వే నంబర్లు 41,85,88,77,100 లలో తమకు అధికారికంగా ధరణి పాస్ పుస్తకాలు, అలాగే పూర్వపు ఇందిరమ్మ పట్టాలు ఉన్నాయని రైతులు స్పష్టం చేశారు. కానీ అధికారులు ఎర్రవల్లి శివారుకు చెందిన సర్వే నంబర్ 325తో తమ భూములకు సంబంధం ముడిపెట్టి తమను వెళ్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారని వారు వాపోతున్నారు. ముందస్తు నోటీసులు లేకుండా వచ్చి సర్వే నిర్వహించడాన్ని సర్వే అధికారులను అడ్డుకుని నిరసన తెలిపారు. ‘మాకు అధికారులే 41 సర్వే నంబర్ల పట్టా పాస్ పుస్తకాలు ఇచ్చారు.. మేము 41 లోనే వ్యవసాయం చేసుకుంటున్నాం.. ఇప్పుడు వచ్చి మమ్మల్ని వెళ్లగొట్టి కొలుస్తామంటే ఎట్లా.. సిఎం రేవంత్ రెడ్డి స్పందించి రికార్డుల ప్రకారం సర్వే చేయించి మాకు న్యాయం చేయాలని వేడుకుంటున్నాం’ అన్నారు. సర్వే నంబర్లు 41, 85, 88, 77, 100 లను తీసుకెళ్లి 325 సర్వే నంబర్‌లో కలిపేశారు. గుర్రాల సూరయ్య, దర్శనాల  చంద్రయ్య, కుమార్‌లకు ధరణి పాస్ పుస్తకాలు ఉన్నా కూడా మాకు నోటీసులు ఇవ్వకుండా కొలవడానికి వచ్చారన్నారు. కలెక్టర్ కార్యాలయంలో శివారు వెంకటపూర్ రైతులు అడిషనల్ కలెక్టర్ లక్ష్మీ కిరణ్,  ఎమ్మార్వో కార్యాలయంలో ఎమ్మార్వో సరితకు వినతి పత్రం అందజేశారు. వెంటనే చ‌ర్య‌లు తీసుకుని మా శివారు హద్దులు నిర్ధారించి మాకు న్యాయం చేయాలని రైతులు డిమాండ్ చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *