కర్టాటకలో ఘోర ప్రమాదం

– క్వారీలో కార్మికులపై దొర్లిపడ్డ బండరాయి
– ఏడుగురు కార్మికుల దుర్మరణం
– ఘటనపై సీఎం శివకుమార్‌ ‌దిగ్భ్రాంతి

బెంగళూరు, జూలై 2: కర్ణాటకలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బెంగళూరు దక్షిణ తాలూకాలోని మడ పట్టణంలో గురువారం భారీ బండరాయి కార్మికులపై పడటంతో ఏడుగురు కార్మికులు మృతిచెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఓ స్టోన్‌ ‌క్రషర్‌ ‌కంపెనీలో కూలీలు పనులు చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతులను బిహార్‌కు చెందిన వలస కూలీలుగా పోలీసులు గుర్తించారు. ప్రమాదం జరిగిన సమయంలో క్వారీలో సుమారు 15 నుంచి 20 మంది కార్మికులు ఉన్నారని వారు తెలిపారు. కొత్త క్రషర్‌ ‌యూనిట్‌ ఏర్పాటు కోసం దాదాపు 100 అడుగుల ఎత్తులో ఒక హిటాచీ యంత్రం పని చేస్తోందని పోలీసులు వెల్లడించారు. ఈ సందర్భంగా ఒక పెద్ద బండరాయి జారి కింద ఉన్న కార్మికులపై పడిందని పోలీసులు వివరించారు. దీంతో ఏడుగురు కార్మికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారని పేర్కొన్నారు. క్షతగాత్రులను ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. శిథిలాలను తొలగించి చిక్కుకుపోయిన కార్మికులను రక్షించేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. మరోవైపు బాధిత కుటుంబాలకు సమాచారం అందించేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు. క్వారీలో నిర్లక్ష్యం లేదా భద్రతా నిబంధనల ఉల్లంఘన జరిగిందా? అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.  ప్రమాదంపై కర్ణాటక సీఎం శివకుమార్‌ ‌స్పందిస్తూ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల ఆత్మలకు శాంతి చేకూరాలని, వారి కుటుంబాలకు ఈ దుఃఖాన్ని తట్టుకునే శక్తి లభించాలని ఆయన ఆకాంక్షించారు. అలాగే క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా కార్మికుల భద్రత, రక్షణ అనేది క్వారీ యజమానుల బాధ్యత అని ముఖ్యమంత్రి నొక్కిచెప్పారు. భద్రతా నిబంధనలను ఉల్లంఘిస్తున్నట్లు తేలిన క్వారీలపై ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని సీఎం శివకుమార్‌ ‌హెచ్చరించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *